Begin typing your search above and press return to search.

కుక్కకు ఓటు హక్కు కలిపించిన ఏపీ !

By:  Tupaki Desk   |   10 Feb 2020 3:00 PM GMT
కుక్కకు ఓటు హక్కు కలిపించిన ఏపీ !
X
ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కుక్క కూడా ఓటు వేయబోతోంది. ప్రతి కుక్కకి ఒకరోజు వస్తుంది అనే సామెతని మనం ప్రతి రోజు ఎదో ఒక సందర్భంలో ఉపయోగిస్తూనే ఉంటాం. అలా . ఇప్పుడు ఒక కుక్కకి ఒక రోజు వచ్చింది. ఈ కారణం చేతనే త్వరలో కుక్క తన ఓటు హక్కుని వినియోగించుకోబోతోంది. గ్రామ సింహంగా కుక్క గారికి కూడా ఓటు హక్కు కల్పించేశారు ఏపీ అధికారులు. కుక్కకు ఓటా అని నోరెళ్ల బెడుతున్నారా? మీరు వింటున్నది నిజమే! అయితే , అసలు కుక్కకి ఓటు ‍హక్కు కల్పించిన ఆ మేధావులు ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా! ఈ ఘనకార్యం చేసింది ఎవరో కాదు .. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర పాలక సంస్ద అధికారులు. అసలు ఈ కుక్కకి ఓటు హక్కు ఎలా వచ్చిందో ..ఆ అధికారులు చేసిన ఘనకార్యం ఏమిటో పూర్తిగా చూద్దాం..

త్వరలో ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. దీనితో అధికారులు ఓటర్ల జాబితాని రెడీ చేయడంలో బిజీగా బిజీగా గడిపేస్తున్నారు. ఈ నేపథ్యం లోనే స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఏలూరు నగర పాలక సంస్థ విడుదల చేసిన ఫైనల్ ఓటర్ లిస్టును విడుదల చేసారు. అయితే ఓటరు జాబితాలో ఒకరికి కుక్క ఫొటో తో ఓటు హక్కు కల్పించారు. ఏలూరు 12వ డివిజన్‌ కు చెందిన బన్నీ గార అనే వ్యక్తికి లిస్టులో 5928 సీరియల్‌ నంబరుగా 194వ పోలింగ్‌ బూత్‌ లో ఓటు హక్కు కల్పించారు. ఇక్కడ వ్యక్తి ఫొటో కు బదులు కుక్క ఫొటో ముద్రించారు. దీనితో మన అధికారులు కుక్కకు కూడా ఓటు హక్కు కల్పించారని, మన అధికారులు జంతు ప్రేమికులంటూ సోషల్ మీడియా లో సెటైర్లు వేస్తున్నారు. అలాగే అదే డివిజన్‌ లో ఎప్పుడో మరణించిన బాల కృష్ణకాశీ అనే వ్యక్తి కి రెండు సీరియల్ నెంబర్ల తో రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కల్పించారు. అలాగే, 13వ డివిజన్‌ లో మహిళా ఓటరు వల్లూరి అరుణకు ఏకంగా ఏడు చోట్ల ఓటు హక్కు కల్పించారు. దీనితో అధికారుల పనితీరు సూపర్ అంటూ నవ్వుకుంటున్నారు. ఏమైనా కూడా మేము తలచుకుంటే ఎవరికైనా ఓటు హక్కు కల్పించగలం అని మరో సారి ప్రభుత్వం అధికారులు నిరూపించారని నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు..