Begin typing your search above and press return to search.

మేం క‌ట్టిన డ‌బ్బులే మాకిస్తున్నారు.. ఏంటి మీ గొప్ప‌.. ఏపీ మంత్రికి మ‌హిళ షాక్!

By:  Tupaki Desk   |   1 Aug 2022 6:01 AM GMT
మేం క‌ట్టిన డ‌బ్బులే మాకిస్తున్నారు.. ఏంటి మీ గొప్ప‌.. ఏపీ మంత్రికి మ‌హిళ షాక్!
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌రోసారి విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి.. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అంటూ కార్య‌క్ర‌మం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ త‌ర‌ఫున ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు గెల‌వ‌ని చోట ఆయా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులు ఈ కార్యక్ర‌మం నిర్వ‌హించాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు ఇచ్చారు.

గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌తి ఇంటికీ వెళ్లి ఈ మూడేళ్ల కాలంలో ప్ర‌భుత్వం చేసిన మంచిని వివ‌రించ‌డంతోపాటు సంక్షేమ ప‌థ‌కాల వ‌ల్ల ఎంత ల‌బ్ధి చేకూరిందో వివ‌రించాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మాన్ని స‌రిగా చేయ‌నివారు ఎవ‌రైనా స‌రే వచ్చే ఎన్నిక‌ల్లో అసెంబ్లీ టికెట్ ఇచ్చేది లేద‌ని ఖ‌రాఖండీగా తేల్చిచెప్పిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జులు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం అంటూ త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. అయితే చాలా చోట్ల వీరికి ప్ర‌జ‌ల నుంచి నిర‌స‌న సెగ ఎదుర‌వుతోంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. వివిధ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌లేద‌ని, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు అంద‌డం లేద‌ని ప్ర‌జ‌లు నిల‌దీస్తున్నార‌ని మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. దీంతో అధికార పార్టీ నేత‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ కు షాక్ త‌గిలింద‌ని వార్త‌లు వస్తున్నాయి. బుగ్గ‌న ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లా డోన్ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించారు. ఇందులో భాగంగా డోన్ ప‌ట్ట‌ణంలోని 30 వార్డుకు వెళ్లారు. అక్క‌డ ఓ మ‌హిళ ఇంటికి వెళ్లిన మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ త‌మ ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆమెకు వివ‌రించారు. అంతేకాకుండా ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భుత్వం నుంచి ఆమెకు ఎంత స‌హాయం అందిందో లెక్క‌లు వేసి చెప్పారు.

అయితే ఈ క్ర‌మంలో ఆ మ‌హిళ మంత్రి బుగ్గ‌న‌కు షాక్ ఇచ్చింది. ఆమె శ‌ర‌ప‌రంప‌ర‌గా ప్ర‌శ్న‌లు సంధించ‌డంతో ఆమెకు స‌మాధానం చెప్ప‌డానికి మంత్రితోపాటు అధికారులు ఇబ్బందిప‌డ్డారు. తాము జ‌గ‌న‌న్న చేదోడు కింద ఆర్థిక సాయానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే ఇంత‌వ‌ర‌కు రాలేద‌ని మ‌హిళ నిల‌దీశారు. త‌న పిల్ల‌ల‌కు ఉద్యోగాలు కూడా రాలేద‌న్నారు. ఈ క్ర‌మంలో బుగ్గ‌న ఈ మూడేళ్ల‌లో ప్ర‌భుత్వం మీ కుటుంబానికి 98,140 రూపాయ‌లు ఇచ్చింద‌ని ఆమెకు న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేశారు.

అయితే ఆ మ‌హిళ ఇందులో మీ ప్ర‌భుత్వం గొప్పేమీ లేద‌ని.. ల‌క్ష ఇచ్చి ప‌న్నులు కింద 2 ల‌క్ష‌లు లాగుతున్నార‌ని మండిప‌డ్డారు. దీనికి స్పందించిన మంత్రి ప‌న్నులు తాము ఒక్క‌ర‌మే పెంచ‌లేద‌ని దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ అధిక ధ‌ర‌లు, ప‌న్నులు ఉన్నాయ‌ని చెప్ప‌క‌నే చెప్పేశారు. అయినా ఆ మ‌హిళ వెన‌క్కి త‌గ్గ‌లేదు. చెత్త ప‌న్ను నుంచి అనేక ర‌కాల ప‌న్నులు వ‌సూలు చేస్తూ ప్ర‌జ‌ల‌ను నిలువుదోపిడీ చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో అస‌హ‌నం వ్య‌క్తం చేసిన మంత్రి బుగ్గ‌న‌, అధికారులు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు.