Begin typing your search above and press return to search.

జ‌గ‌న్ విజ‌యం రోజున‌.. లైకులు లేవు.. మైకులు ప‌గ‌ల‌లేదు.. ఏంటి?

By:  Tupaki Desk   |   25 May 2022 12:30 AM GMT
జ‌గ‌న్ విజ‌యం రోజున‌.. లైకులు లేవు.. మైకులు ప‌గ‌ల‌లేదు.. ఏంటి?
X
ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఏం చేసినా.. ఆహా ఓహో అంటూ.. వైసీపీ నాయ‌కులు రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే. మైకులు ప‌గిలిపోయేలా.. జ‌గ‌న్ గొప్ప‌లు ప్ర‌స్తావించ‌డంతో పాటు.. జ‌గ‌న్‌ను మించిన నాయ‌కుడు దేశంలోనే లేరంటూ.. పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు జారీ చేస్తూ ఉంటారు. జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేస్తుంటారు. విష‌యం ఏదైనా అధినేత భ‌జ‌న‌లో నాయ‌కులు ఆరితేరుతుంటారు. అయితే.. ఇప్పుడు పార్టీకి, అధినేత‌కు అత్యంత కీల‌క‌మైన రోజు వ‌చ్చింది.

దీంతో ఆ రోజున నాయ‌కులు మ‌రింత రెచ్చిపోతార‌ని.. ఖ‌చ్చితంగా మీడియా ముందుకు వ‌స్తార‌ని.. అధినేత ను ఆకాశానికి ఎత్తేస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అంతేకాదు.. ఈ మూడేళ్ల విజ‌యాన్ని కూడా వ‌ల్లెవేసి.. మ‌రీ.. జ‌నాల చెవులు చిల్లులు ప‌డేలా .. ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే.. అనూహ్యంగా అంద‌రూ మూగ‌బోయారు. ఒక్క‌రంటే.. ఒక్క‌రు కూడా మీడియా ముందుకు రాలేదు. పోనీ ప్ర‌క‌ట‌న‌లు కూడా జారీ చేయ‌లేదు.. దీంతో ఏమైంద‌నే చ‌ర్చ జోరుగా సాగుతోంది.

ఇంత‌కీ విష‌యం ఏంటే.. ఏపీలో 2019లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీ 151 స్థానాలు సాధించి.. క‌నీ వినీ ఎరుగ‌ని ఘ‌న విజ‌యం సొంతం చేసుకుంది. ఇదొక అద్వితీయ మైన రోజుగా.. వైసీపీ గ‌తంలో పండ‌గ చేసుకుంది. ఏకంగా 50శాతం పైగా ఓటు బ్యాంకునుసాధించామ‌ని.. ఇది దివంగ‌త ఎన్టీఆర్ క‌న్నా.. మెజారిటీ ఎక్కువ‌గా ఉంద‌ని.. నాయ‌కులు చెప్పుకొచ్చారు. అలాంటి విజ‌యం సాధించిన రోజు.. ఈ నెల‌లో వ‌చ్చింది. దీంతో ఆ రోజున నాయ‌కులు పెద్ద ఎత్తున బ‌య‌ట‌కు వ‌చ్చి.. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న సంక్షేమానికి జోడించి.. భారీ ఎత్తున ప్ర‌సంశ‌లు గుప్పిస్తార‌ని అనుకున్నారు.

కానీ, అనూహ్యంగా ఒక్క‌రంటే ఒక‌రు కూడా బ‌య‌ట‌కు రాలేదు. అస‌లు ఈ విష‌యం గుర్తులేద‌న్న‌ట్టుగానే వ్య‌వ‌హ‌రించారు. బాక్సులు బ‌ద్ద‌లు కాలేదు. లైకులు లేవు.. షేర్లు లేవు. అయితే.. ఇవ‌న్నీ చేశార‌ని.. అయితే.. అట్ట‌ర్ ఫ్లాప్ అయింద‌ని.. కొంద‌రు చెబుతున్నారు. అదే ఎన్నిక‌ల‌కు ముందు జ‌గ‌న్ వేసిన ప్ర‌తి అడుగుకు లైకులు, షేర్లు ప‌డ్డాయి. దేశంలో బీజేపీ త‌ర్వాత‌. సోష‌ల్ మీడియా ఫాలోయింగ్ వైసీపీకే ఉండేద‌ని.. నాయ‌కులు చెప్పేవారు. అంతేకాదు.. 40 ఏళ్ల అనుభ‌వం ఉన్న టీడీపీకి కూడా అంత ఫాలోయంగ్ లేద‌ని చెప్పేవారు.

అలాంటి పార్టీకి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో లైకులు లేవు. షేర్లు అంత‌క‌న్నా లేవు. అంటే.. ఒక్క‌సారిగా వైసీపీ ప‌రిస్థితి దారుణంగా మారింద‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీ అధిష్టానం అస‌లు ఏం జ‌రుగుతోంద‌నే విష‌యాన్ని ప‌రిశీలించాల‌ని ప‌లువురు సూచిస్తున్నారు. ప్ర‌భుత్వ అధికారిక పేజీ కానీ, జ‌గ‌న్ పేజీ కానీ, వైసీపీ అధికారిక పేజీలో కూడా ఎలాంటి లైకులు క‌నిపించ‌లేదు. క‌నీసం షేర్లు కూడా ల‌భించ‌లేదు.

వాస్త‌వానికి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక‌, మెజారిటీ సంఖ్య‌లో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. ఇక‌, 22 మంది ఎంపీలు ఉన్నారు. కార్పొరేష‌న్ చైర్మ‌న్‌లు, ఇంచార్జ్‌లు, 90 శాతం లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల్లో గెలిచిన వారు ఇలా.. చాలా మంది ఉన్నారు. ఇలాంట‌ప్పుడు..ఫేస్‌బుక్ క‌నిపెట్టిన జుక‌ర్ బ‌ర్గ్‌కు కూడా రాని లైకులు, షేర్లు రావాలి. ఇక‌, యూట్యూబ్ వ్యూస్ కూడా అదిరిపోవాలి. కానీ, తాజాగా అలాంటివేవీ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌న‌నార్హం. దీనిని బ‌ట్టి వైసీపీ రేంజ్ త‌గ్గిపోయిందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రి అధిష్టానం దీనిపై ఏం చేస్తుందో చూడాలి.