Begin typing your search above and press return to search.

వైసీపీ ప్లీనరీ : నాటి ఉత్సాహం నేడు ఏదీ...?

By:  Tupaki Desk   |   4 Jun 2022 4:30 PM GMT
వైసీపీ ప్లీనరీ : నాటి ఉత్సాహం నేడు ఏదీ...?
X
వైసీపీ ప్లీనరీ అంటేనే క్యాడర్ రెక్కలు కట్టుకుని వాలే రోజులు నాడు కనిపించేవి. ప్రతీ పైసా తమ సొంత సొమ్ముతో ఖర్చు పెట్టి ఎంత దూరం అయినా క్యాడర్ కదం తొక్కిన సందర్భం నాడు ఉంది. జగన్ సీఎం కావాలన్న కసితో అంతా పనిచేసిన సందర్భం అది. మొత్తానికి అందరి కష్టం పదేళ్ళ శ్రమ ఫలించి జగన్ సీఎం అయ్యారు.

అయితే సీఎం అయ్యాక జగన్ ముఖ్యమంత్రిగానే ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ వచ్చారు. ఒక విధంగా పార్టీ అధినేత పోస్ట్ ఉన్నా పట్టించుకోలేదు. దాంతో పార్టీ గాలికి వదిలేసినట్లు అయింది. వైసీపీలో చిత్రమేంటి అంటే ఎపుడో వేసిన కమిటీలే ఇపుడూ ఉన్నాయి. నాడు కమిటీలలో ఉన్న వారు అంతా వివిధ పదవులలో కుదురుకున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వారున్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిచిన వారున్నారు. నామినేటెడ్ పదవులు తీసుకున్న వారున్నారు.

ఇలా చాలా మంది తప్పుకోగా పార్టీ ఆఫీసులు అన్నీ కూడా ఇపుడు ఖాళీగానే కనిపిస్తున్నాయి. ఈ మధ్యనే మాజీ మంత్రులకు పార్టీ జిల్లా పగ్గాలు అప్పగించినా నాటి ఉత్సాహం మాత్రం ఎక్కడా కనిపించడంలేదు. ప్రతీ పార్టీకి పట్టు కొమ్మలాంటి వారు క్యాడర్. వారితోనే పార్టీ మనుగడ ఉంటుంది

చిత్రమెంటి అంటే అధికారంలోకి పార్టీని తేవడానికి అష్టకష్టాలు పడిన కార్యకర్తలు ఆ తరువాత పవర్ లో ఉన్న పార్టీకి అసలు కనిపించరు ఇలా ఎందుకు జరుగుతుందో తెలియదు కానీ ఏ పార్టీ పవర్ లో ఉన్నా ఇదే పరిస్థితి. నాడు ఇదే రకమైన ఇబ్బందులతో టీడీపీ క్యాడర్ ని పక్కన పెట్టి తగిన మూల్యం చెల్లించింది. ఇపుడు వైసీపీ కూడా అన్నీ తెలిసి అన్నీ చూసి అదే బాటలో పయనిస్తోంది

ఇక ఎన్నికలు రెండు ఏళ్ల వ్యవధిలో ఉన్నాయంగా ప్లీనరీని నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే పార్టీ మీద అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. నేల రోజుల వ్యవధిలో ప్లీనరీ అంటే ఎక్కడా మాత్రం వైసీపీలో సందడి కనిపించడంలేదు అంటున్నారు. ప్లీనరీ సక్సెస్ కోసం ఒక వైపు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే పై స్థాయిలో నాయకులు ఇచ్చే ఆదేశాలు కానీ డైరెక్షన్స్ కానీ దిగువ స్థాయిలో అమలు చేయాల్సిన క్యాడర్ పూర్తి డల్ గా ఉంది.

ఈ మధ్యనే జనసేన ఆవిర్భావ సభ అదిరిపోయే రేంజిలో జరిగింది. దానికి కారణం కార్యకర్తల ఉత్సాహం. వారి పట్టుదల. వారి దూకుడు. ఇక కొద్దిరోజుల క్రితం ఒంగోలులో జరిగిన టీడీపీ మహానాడు గ్రాండ్ సక్సెస్ అయింది అంటే ఆ క్రెడిట్ కచ్చితంగా పార్టీ క్యాడర్ కే వెళ్తుంది. వారంతా ఎంతో కసిగా పనిచేసి దూరాలను తీరాలను దాటుకుని లక్షలుగా ఉప్పెనగా దూసుకొచ్చారు.

మరి వైసీపీలో ఆ ఉత్సాహం ఉందా అంటే లేదు అనే జవాబు వస్తుంది. వారి దాకా ఎందుకు జిల్లా పగ్గాలు అప్పగించినా కూడా కొందరు నాయకులు ఇంకా గుమ్మాలు దిగడంలేదు. మరి ఈ పరిస్థితిలో వైసీపీ ప్లీనరీ అంటే కత్తి మీద సామే. అటు జనసేనకు ఇటు టీడీపీకి మించి జనాలు రావాలి. ఉత్సాహంగా సభ జరగాలి. రీ సౌండ్ మోత మోగాలి అని వైసీపీ అధినాయకత్వం పిలుపు ఇస్తున్నా గ్రౌండ్ లెవెల్ లో మాత్రం సీన్ వేరేగా ఉంది అంటున్నారు