Begin typing your search above and press return to search.

ప్ర‌కాశం వైసీపీ ఎమ్మెల్యే.. ప్ర‌తి స్కూల్ నుంచి వెయ్యి రూపాయ‌లు ఇవ్వాలంట‌!!

By:  Tupaki Desk   |   5 July 2022 2:42 PM GMT
ప్ర‌కాశం వైసీపీ ఎమ్మెల్యే.. ప్ర‌తి స్కూల్ నుంచి వెయ్యి రూపాయ‌లు ఇవ్వాలంట‌!!
X
ప్రకాశం జిల్లాలో ఒక గాసిప్ వార్త చక్కర్లు కొడుతుంది ..ఆ వార్త ప్రకారం ప్ర‌కాశం జిల్లాలో ఓ వైసీపీ ఎమ్మెల్యే బ‌హిరంగ `వ‌సూళ్ల`కు తెర‌దీశారు. ఇప్ప‌టి వ‌ర‌కు కొంద‌రు నాయ‌కులు ఏదో తెర‌చాటు వ్య‌వ‌హారాలు చేస్తున్నారే త‌ప్ప‌.. ఇలా రోడ్డున ప‌డి హుకుం జారీ చేసి మ‌రీ వ‌సూళ్ల‌కు పాల్ప‌డుతున్న సంఘ‌ట‌న‌లు క‌నిపించ‌డం లేదు. కానీ, ఇప్పుడు మాత్రం ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే.. నేరుగా స్కూళ్ల‌కు తాఖీదులు పంపి మ‌రీ.. వ‌సూళ్ల రాజాలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే గుస‌గుస వినిపిస్తోంది. ఈ వ్య‌వ‌హారం వైసీపీలోనే పెద్ద ఎత్తున చ‌ర్చ‌గా మార‌డం విశేషం. ఇంత‌కీ ఆయ‌న ఎందుకు వ‌సూలు చేస్తున్నారంటే..

రేపు జ‌ర‌గ‌బోయే జీవీకే(జ‌గ‌న‌న్న విద్యా కానుక‌) కార్య‌క్ర‌మం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. ఇది ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో.. ప్ర‌భుత్వ నిర్వ‌హ‌ణ‌లో చేస్తున్న కార్య‌క్ర‌మం. ఈ రోజు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను తెరిచి.. రేపు ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించేందుకు స‌ర్కారు ముందుగానే ప్లాన్ చేసుకుంది. పాఠ‌శాల విద్యార్థుల‌కు ఏటా ఇస్తున్న‌ట్టుగానే జ‌గ‌న‌న్న కానుక‌లు(స్కూలు బ్యాగు, పుస్త‌కాలు, బెల్టు, షూస్‌, సాక్సు) అందించ‌నున్నారు. దీనికి సంబంధించి స్వ‌యంగా ముఖ్య‌మంత్రే ప‌ర్య‌వేక్షిస్తున్నారు.

అయితే, ప్ర‌కాశం జిల్లాలో మాత్రం ఒక వైసీపీ ఎమ్మెల్యే త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి పాఠ‌శాల‌కు హుకుం జారీ చేశారట‌. అదేంటంటే.. ప్ర‌తి స్కూలు నుంచి కూడా వెయ్యి రూపాయ‌లు ఈ జ‌గ‌న‌న్న విద్యా కానుక కార్య‌క్ర‌మానికి ఇవ్వాల‌ని ఆదేశించార‌ట‌. ఈ ఆదేశాలు నేరుగా మండ‌ల విద్యాశాఖ అధికారి(ఎంఈవో)కి చేరాయి.

దీంతో ఆయన పాఠ‌శాల‌ల్లోని టీచ‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశార‌ట‌. ప్ర‌తి స్కూల్ నుంచి త‌ప్ప‌కుండా.. రూ.1000 ఇవ్వాల‌ని.. ఇది ఎమ్మెల్యే ఆదేశామ‌ని.. ఆయ‌న చెప్ప‌డంతో టీచ‌ర్లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం ఏ ఇద్ద‌రు టీచ‌ర్లు క‌లుసుకున్నా.. ఇదే విష‌యం చ‌ర్చించుకుంటున్నారు.

ఇక‌, త‌మ పై అధికారిగా ఉన్న ఎంఈవోనే ఆదేశాలు జారీ చేశాక‌.. తాము ఏం చేయాల‌నే విష‌యంపై వారు త‌ల‌ప‌ట్టుకున్నారు. ఇవ్వ‌క‌పోతే.. ఎక్క‌డ త‌మ‌పై టార్చ‌ర్ మొదలు పెడ‌తాడో అని ఒప్పుకొన్నార‌ట‌. ఈ క్ర‌మంలో రేప‌టి కార్య‌క్ర‌మానికి దాదాపు నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌తి పాఠ‌శాల నుంచిరూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూలు కావొచ్చు అని అంటున్నారు. మ‌రి ఆ కార్య‌క్ర‌మానికి అంత ఖ‌ర్చు ఎందుకు అవుతుంది ? అని చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌హా అయితే.. 4-5 ల‌క్ష‌లు ఖ‌ర్చు అవుతాయ‌ని.. అది కూడా భోజ‌నం పెడితేనే అవుతుంద‌ని.. అంటున్నారు.

మ‌రి ప్ర‌తి పాఠ‌శాల నుంచి వ‌సూలు చేయ‌గా వ‌చ్చే రూ.50 ల‌క్ష‌లు ఎవ‌రి జేబులోకి వెళ్తుంద‌ని.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తి ఒక్క‌రూ చ‌ర్చించుకుంటున్నారు. అంతేకాదు.. ఇది వాస్త‌వానికి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మం. ప్ర‌తి రూపాయి కూడా ప్ర‌భుత్వమే ఇస్తుంది. పోనీ.. ఎమ్మెల్యే కొంత హంగామా చేయాల‌ని అనుకున్నా.. 50 ల‌క్ష‌ల ఖ‌ర్చు అయితే..ఎంత మాత్రం కాద‌ని స్తానికులు చెబుతున్నారు.. దీంతో ఇదేం అన్యాయం అని టీచ‌ర్లు ఎవరికి వాళ్లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నా.. ఏమీ చేయ‌లేక‌.. ఇస్తాం అని చెప్పార‌ని.. పెద్ద ఎత్తున నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ జ‌రుగుతోంది. .. సో.. ఇదీ.. ప్ర‌కాశంలో వైసీపీ ఎమ్మెల్యేగారి వ‌సూళ్ల ప‌ర్వం..!! మ‌రి ఈ విష‌యం వైసీపీ అధిష్టానానికి తెలిస్తే.. ఏం చేస్తారో చూడాలి.