Begin typing your search above and press return to search.

పెత్తందారులు అంటూ టార్గెట్ చేసిన జగన్

By:  Tupaki Desk   |   21 Dec 2022 8:19 PM IST
పెత్తందారులు అంటూ టార్గెట్ చేసిన జగన్
X
ఏపీలో జరుగుతున్నది జరగబోయేది కాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని మంచి రైమింగ్ తో చెప్పిన జగన్ దాన్ని మెల్లగా వైసీపీ ఎన్నికల అజెండాగా మార్చేస్తున్నారు. ఈ మధ్యన ఆయన మాట్లాడుతున్న ప్రతీ సభలోనూ పేదలు పెత్తందారులు అంటూ ఒక పెద్ద డివిజన్ ని తెస్తున్నారు. నేను పేదల కోసం ఎంతో చేస్తూంటే పెత్తందారులు ఓర్వలేకపోతున్నారు అని జగన్ పదే పదే అంటున్నారు.

నా పేదలు అంటూ వారిని వెనకేసుకుని వస్తూ పెత్తందారులతో యుద్ధం చేస్తున్నామని కూడా ఆయన వివరిస్తున్నారు. ఇక పుట్టిన రోజు వేళ కూడా ఆయన నోట అదే మాట వచ్చింది. బాపట్ల జిల్లా యడ్లపాడులో జరిగిన ట్యాబుల పంపిణీ కార్యక్రమంలో జగన్ పెత్తందారులు అనడమే కాకుండా అదొక భావజాలం అని సరికొత్త డెఫినిషన్ ఇచ్చారు. ఆ భావజాలం ఉన్న వారు పేదలకు మేలు చేస్తే చూడలేకపోతున్నారు అని ఆయన మండిపడ్డారు.

పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు ఎందుకు అని ప్రశ్నించడమే కాదు, దాన్ని అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్లారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇక పేదల కోసం మంచి పనులు చేస్తున్నా అడ్డు పుల్లలు వేసే వారు అధికం అయ్యారని ఆయన విమర్శించారు. చదువులలో అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి, అపుడే అభివృద్ధి సాధ్యపడుతుంది అని ముఖ్యమంత్రి అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విప్లవం ప్రారంభించామని, ఈ రోజున ప్రపంచంతో పోటీ పడగల స్థాయిలో ప్రతీ విద్యార్ధి ఉండాలని ఆయన అన్నారు. అందుకోసం తాము చేయాల్సినవి చేస్తున్నామని చెప్పారు. ఇక పిల్లలకు మరింత సులువుగా పాఠ్యాంశాలు అందేలా తాము అన్ని విషయాలు ట్యాబుల్లో ఉంచి అందిస్తున్నామని చెపారు.

తాను పేదల కోసం అమలు చేసే కార్యక్రమాల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గలేదని, మూడున్నరేళ్ళ పాలనలో అది స్పష్టం అయిందని ఆయన వివరించారు. మన కంటే పిల్లలు బాగా ఎదగాలని చదవాలని తల్లిదండ్రులకు కోరిక ఉంటుందని, డబ్బులు లేకనే వారు చదువులకు దూరం అవుతారని ఆయన పేర్కొన్నారు.

తాను పాదయాత్ర సందర్భంగా అలాంటి పరిస్థితిని గమనించానని ఆయన చెప్పుకొచ్చారు. ఎవరూ డబ్బు లేకపోవడం వల్ల వెనకబడకూడదని, పేదరికం అడ్డుకాకూడదనే తాను విద్యకు పెద్ద ఎత్తున ఖరు చేస్తున్నట్లుగా జగన్ తెలిపారు. తన పుట్టిన రోజున తనకు ఎంతో ఇష్టమైన చిన్నారుల కోసం పధకం ప్రారంభించడం ఆనందంగా ఉంది అని జగన్ అన్నారు. తాను చేపట్టే మంచి పనులు అన్నీ పేదలకు చేరాలని వారే రేపటి రోజున ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు. మొత్తానికి పేదలు పెత్తందార్లూ అంటూ జగన్ పుట్టిన రోజు స్పీచ్ సాగిపోయింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.