Begin typing your search above and press return to search.

బీజేపీలోకి ములాయం చిన్న‌కోడ‌లు?

By:  Tupaki Desk   |   25 March 2017 7:31 AM GMT
బీజేపీలోకి ములాయం చిన్న‌కోడ‌లు?
X
రాజకీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుందో ఎవరూ చెప్ప‌లేని ప‌రిస్థితి.. చిరకాల శ‌త్రువులు కూడా భుజంభుజం క‌లప‌డం.. ఆత్మ‌బంధువుల్లా క‌లిసిమెల‌సి తిరిగిన నేత‌లూ బ‌ద్ధ విరోధులుగా మార‌డం వంటివ‌న్నీ రాజ‌కీయాల్లోనే క‌నిపిస్తాయి. పార్టీల మ‌ధ్య‌... రాజ‌కీయ కుటుంబాల మ‌ధ్య సంబంధాల‌దీ ఇదే దారి. తాజాగా ఉత్త‌ర ప్ర‌దేశ్ లో దుమ్మురేపుతున్న బీజేపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ ను అక్క‌డ నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు రాష్ర్టాన్ని ఏలిన ములాయం కుటుంబానికి చెందిన వ్య‌క్తి క‌ల‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో యూపీలో రాజ‌కీయంగా పెను మార్పులు వ‌స్తున్నాయా... ములాయం కుటుంబంలో ఎన్నిక‌ల ముందు రేగిన క‌ల‌హాలు ఇప్పుడు పార్టీ మార్పుల వ‌ర‌కు వెళ్ల‌నున్నాయా అన్న అనుమానాలూ వ‌స్తున్నాయి. అంత‌కుమించిన ఊహాగానాలూ వ‌స్తున్నాయి. యోగి ఆదిత్య‌నాథ్ ను ములాయం చిన్న కోడ‌లు అప‌ర్ణ యాద‌వ్ క‌ల‌వ‌డం రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపింది.

యూపీలో ములాయం కుటుంబం అంటే దేశంలోనే అతి పెద్ద వార‌స‌త్వం రాజ‌కీయ కేంద్రం. ఆ కుటుంబం నుంచి సుమారు 25 మంది రాజ‌కీయాల్లో ఉన్నారు. ములాయం, ఆయ‌న పెద్ద భార్య కుమారుడు అఖిలేశ్ లు ఆ రాష్ర్టానికి సీఎంలుగా ప‌నిచేశారు. ఇద్ద‌రు త‌మ్ముళ్లు కీల‌క నేత‌లుగా ఉన్నారు. పెద్ద కోడ‌లు ఎంపీ.. చిన్న కోడ‌లు అప‌ర్ణ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో లక్నో కంటోన్మెంట్‌ స్థానం నుంచి సమాజ్‌ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో దారుణంగా ఓడిపోయారు. ఇలా ఓడిపోయిన అపర్ణ బీజేపీకి ముఖ్యమంత్రిని ఎందుకు కలుసుకుంది? ఆమె మర్యాదపూర్వకంగానే క‌లుసుకున్నారా.. ఉత్త‌ర్ ప్ర‌దేశ్ ను ఉత్త‌మ్ ప్ర‌దేశ్ గా మార్చేందుకు వ‌డివ‌డిగా అడుగులు వేస్తున్న సీఎం యోగి ఆదిత్య‌నాథ్ కు సంఘీభావం ప్ర‌క‌టించేందుకు క‌లిశారా.. లేదంటే రాజ‌కీయంగా ఆమె కొత్త అడుగులు వేయ‌నున్నారా అన్న చ‌ర్చ మొద‌లైంది.

అంతేకాదు... రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల‌కు మారుపేరైన ములాయం ఇప్పుడు సొంత రాష్ర్టంలో పార్టీ గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటుండ‌డంతో త‌న కుటుంబాన్ని రాజ‌కీయంగా ఫామ్ లో ఉంచేందుకే ఆమెను బీజేపీ వైపు మ‌ళ్లిస్తున్నారా అన్న అనుమానాలూ పొడ‌సూపుతున్నాయి. మొన్న‌టి ఎన్నిక‌ల్లో ములాయం పార్టీ స‌మాజ్ వాది దారుణంగా ప‌రాభ‌వం పొందినా కూడా ములాయం, అఖిలేశ్ లు యోగి ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మంలో పాల్గొనడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో ఆమె బీజేపీలో చేరుతుందా.. అన్న చ‌ర్చ ఒక్క‌సారిగా మొద‌లైంది. పైగా అపర్ణ ప్రధాని నరేంద్రమోదీకి వీరాభిమాని కావ‌డం ఇక్క‌డ మ‌రో కీల‌కాంశం.. 'స్వచ్ఛభారత్‌ ను మెచ్చుకుంటూ ఆమె సోషల్‌ మీడియాలో పోస్టింగులు పెట్ట‌డం.. గోవధకు తాను వ్యతిరేకమని బాహాటంగా చెప్ప‌డంతో ఇదంతా అప‌ర్ణ సొంత ప్ర‌ణాళికా... కుటుంబంతో ఆమె విభేదిస్తుందా అన్న కోణ‌మూ క‌నిపిస్తోంది.

అపర్ణ గ‌తంలో.. బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ భారత్‌ లో అసహనం పెరుగుతోందంటూ చేసిన వ్యాఖ్యలను పూర్తిగా నిరసించింది. అప్పట్లో అమీర్‌ ఖాన్‌ ను ములాయం సమర్థించారు. తాను సామాజిక సేవా కార్యక్రమాల్లోనే పాల్గొంటానని, రాజకీయాల్లోకి రానని చెప్పింది. అయినప్పటికీ మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసింది. ఆధ్యాత్మిక భావాలున్న అప‌ర్ణ‌.. ములాయం కుటుంబంలో సోషల్‌ మీడియాలో చురుగ్గా వున్న ఒకే ఒక వ్యక్తి. సోషల్‌ మీడియాలో తాను పోస్టు చేసే ఆలోచనలు - విమర్శలు తన వ్యక్తిగతమైనవని చెబుతున్నా ఆమె అడుగులు మాత్రం బీజేపీ వైపు ప‌డుతుండ‌డంతో కుటుంబ రాజ‌కీయ విధానాల నుంచి ప‌క్క‌కు జ‌రుగుతూ వ్య‌క్తిగ‌త రాజ‌కీయానికి తెర‌లేపుతున్నార‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

కొస‌మెరుపుః యోగి ఆదిత్య‌నాథ్ అస‌లు పేరు అజిత్ సింగ్ బిస్త్... వివాహానికి పూర్వం అప‌ర్ణ అసలు పేరు కూడా అప‌ర్ణ బిస్త్‌. ఇద్ద‌రిదీ ఉత్త‌రాఖండ్ లోని గార్వార్ జిల్లాయే. ఇది ఒక‌ప్ప‌టి యూపీలో ప్రాంత‌మే. అప‌ర్ణ తండ్రి అర‌వింద్ సింగ్ బిస్త్ టైమ్స్ ఆఫ్ ఇండియా ల‌క్నో విభాగానికి ఎడిట‌ర్ గా ఉండేవారు. అప‌ర్ణ‌, యోగిలు ఇద్ద‌రూ రాజ్ పుత్ ఠాకూర్ కులానికి చెందిన‌వారే. దీంతో యోగికి అప‌ర్ణ సోద‌రి వ‌రుస అవుతార‌న్న ప్ర‌చారం కూడా ఉంది. అయితే, దీన్ని రెండువైపుల వారు ఎవ‌రూ ధ్రువీక‌రించ‌లేదు, ఖండించ‌లేదు. మ‌రి... ఇద్ద‌రి మ‌ధ్య అన్నాచెల్లెళ్ల బంధం కూడా ఉందో లేదో తెలియ‌క‌పోయినా ఆధ్యాత్మిక‌త‌, హిందూత్వ‌, జంతుప్రేమ వంటి విష‌యాల్లో యోగి, బీజేపీ భావ‌జాలానికి అప‌ర్ణ భావ‌జాలానికి ద‌గ్గ‌రి సంబంధం ఉంది. మ‌రి అప‌ర్ణ అడుగులు ఎటు ప‌డ‌తాయో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/