Begin typing your search above and press return to search.

మ‌ర‌ద‌లి 'ఖాతా'కు ఆ మాజీ సీఎం కోట్లు పంపార‌ట‌

By:  Tupaki Desk   |   3 July 2017 5:24 PM GMT
మ‌ర‌ద‌లి ఖాతాకు ఆ మాజీ సీఎం కోట్లు పంపార‌ట‌
X
సంచ‌ల‌న విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో అఖిలేశ్ లీల‌లు ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద ద‌ర‌ఖాస్తు చేసిన స‌మాచార హ‌క్కు కార్య‌క‌ర్త పుణ్య‌మా అని సంచ‌ల‌న విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అఖిలేశ్ సీఎంగా ఉన్న స‌మ‌యంలో గో సేవా ఆయోగ్ పేరుతో గోశాల‌ల‌కు సంక్షేమ నిధులు విడుద‌ల చేశారు. 2012 నుంచి 2017 మ‌ధ్య‌లో రాష్ట్రవ్యాప్తంగా రూ.9.66 కోట్లు సంక్షేమ నిధుల కోసం విడుద‌ల చేయ‌గా.. అందులో 86 శాతం నిధుల్ని ఒకే ఒక్క గోశాల‌కు కేటాయించారు. ఇంత‌కీ.. ఆ గోశాల ఎవ‌రిదో కాదు.. అఖిలేశ్ యాద‌వ్ మ‌ర‌ద‌లు అప‌ర్ణ యాద‌వ్ న‌డుపుతున్న స్వ‌చ్ఛంద సంస్థ‌ది కావ‌టం గ‌మ‌నార్హం.

నూత‌న్ ఠాకూర్ అనే మ‌హిళ స‌మాచార హ‌క్కు చ‌ట్టం ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌టం ఈ సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అప‌ర్ణ యాద‌వ్ ఎవ‌రో కాదు.. అఖిలేశ్ సోద‌రుడు ప్ర‌తీక్ యాద‌వ్ స‌తీమ‌ణే. ల‌క్నోలోని అమౌసీ ప్రాంతంలో జీవ్ ఆశ్ర‌య పేరుతో గోశాల‌ను ఏర్పాటు చేసి ఆవుల సంరక్ష‌ణ‌కు కృషి చేస్తున్న‌ట్లు చెబుతారు. రాష్ట్రంలో ఈ త‌ర‌హా ఎన్జీవోలు ఉన్న‌ప్ప‌టికీ.. మ‌ర‌ద‌లు నిర్వ‌హిస్తున్న ఎన్జీవోకు భారీ ఎత్తున నిధుల్ని అఖిలేశ్ స‌ర్కారు విడుద‌ల చేయ‌టం విశేషం.

2012 నుంచి 2015 వ‌ర‌కూ జీవ్ ఆశ్ర‌య‌కు వ‌రుస‌గా నిధులు విడుద‌ల చేసిన నాటి అఖిలేశ్ స‌ర్కారు తీరుపై ఇప్పుడు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయిన వారికి కోట్లాది రూపాయిలు ఇచ్చిన వైనం ఇప్పుడు దుమారంగా మారింది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల అనంత‌రం అధికారంలోకి వ‌చ్చిన యోగి స‌ర్కారు.. ఇప్ప‌టివ‌ర‌కూ రూ.1.05 కోట్ల నిధుల్ని గోవుల సంర‌క్ష‌ణ‌కు విడుద‌ల చేయ‌గా.. అందులో జీవ్ ఆశ్ర‌య‌కు ఎలాంటి నిధులు విడుద‌ల చేయ‌లేద‌ని చెబుతున్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్‌ లో మ‌రో ట్విస్ట్ ఏమిటంటే.. అఖిలేశ్ ఫ్యామిలీని త‌న ద‌ర‌ఖాస్తుతో బ‌జారున నిల‌బెట్టేలా చేసిన నూత‌న్ ఠాకూర్ ఎవ‌రో కాదు.. ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ స‌తీమ‌ణే. ములాయం ఫ్యామిలీతో ఈ ఐపీఎస్ అధికారికి లొల్లి న‌డుస్తోంది. ఏమైనా.. ప‌వ‌ర్ చేతిలో లేని వేళ‌.. అఖిలేశ్ తీరును త‌ప్పు ప‌ట్టే ఉదంతం తెర మీద‌కు రావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/