Begin typing your search above and press return to search.

మళ్లీ ములాయం కోడలు బీజేపీకి సపోర్టు చేసింది

By:  Tupaki Desk   |   30 Dec 2017 6:37 PM GMT
మళ్లీ ములాయం కోడలు బీజేపీకి సపోర్టు చేసింది
X
ములాయం సింగ్ యాదవ్ - అఖిలేశ్ యాదవ్‌ లు బీజేపీని వ్యతిరేకిస్తుంటే ఆ ఇంటి చిన్నకోడలు అపర్ణాయాదవ్ మాత్రం బీజేపీ ఏం చేసినా శభాష్ శభాష్ అంటోంది. తాజాగా ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్ సభలో పెట్టడంపైనా ఆమె స్పందించారు. సమాజ్ వాది పార్టీ వైఖరికి భిన్నంగా ఆమె ట్రిపుల్ తలాక్ బిల్లుకు మద్దతు ప్రకటించారు. అక్కడితో ఆగకుండా ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యులతో కలిసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. దీంతో ఆమె వ్యవహారం ఇప్పుడు సమాజ్‌వాదీ పార్టీలో కలకలం రేపుతోంది.

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు అపర్ణా యాదవ్ శుక్రవారంనాడు బహిరంగంగానే మద్దతు ప్రకటించారు. తలాక్ బిల్లును ఓ ట్వీట్‌ లో ఆమె స్వాగతించారు.ట్రిపుల్ తలాక్ బిల్లును స్వాగతించదగిన ముందడుగుగా అపర్ణా యాదవ్ అభివర్ణించారు. దానివల్ల మహిళలకు ముఖ్యంగా ముస్లిం మహిళలకు సాధికారత లభిస్తుందని, ముస్లిం మహిళలు ఎన్నోఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యకు ఊరట లభిస్తుందని ఆమె అన్నారు. అదేసమయంలో సమాజ్ వాది పార్టీ మాత్రం ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఎస్పీ లోకసభలో కొన్ని సవరణలు ప్రతిపాదించింది. సవరణలు చేయకుండా బిల్లును ప్రస్తుత రూపంలో అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. తలాక్ బిల్లుతో వచ్చే ఎన్నికల్లో బిజెపి ప్రయోజనం పొందాలని చూస్తోందని విమర్శించింది. కానీ... అపర్ణ మాత్రం బీజేపీని ఈ విషయంలో తెగ పొగిడేస్తున్నారు.

కాగా అపర్ణ, ఆమె భర్త ప్రతీక్ యాదవ్ లు గతంలోనూ బీజేపీ పెద్దలను కలిసిన సందర్భాలున్నాయి. లక్నోలో ఇఫ్తార్ విందు సందర్భంగానూ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను అపర్ణా యాదవ్, ప్రతీక్ యాదవ్ దంపతులు కలుసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతోనే అపర్ణా ఓసారి సెల్ఫీ దిగారు. అంతేకాదు... యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయిన తరువాత అపర్ణయాదవ్ ఆయనతో భేటీ అయ్యారు.

ఆ తరువాత యోగి కూడా అపర్ణ - ప్రతీక్‌ ల ఇంటికొచ్చారు. ప్రతీక్ నిర్వహిస్తున్న గోశాలను ఆయన సందర్శించారు. 'కన్హా ఉపవాన్' పేరుతో తాను న‌డుపుతున్న‌ గోశాలను సందర్శించాల్సిందిగా యోగిని ప్రతీక్ ఆహ్వానించడంతో ఆప్పుడాయన వెళ్లారు. దీంతో ఆప్పట్లో అపర్ణ బీజేపీలోకి వెళ్తారన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా మరోసారి అదే ప్రచారం జరుగుతోంది.