Begin typing your search above and press return to search.

అమరావతిది అంతులేని కథా?

By:  Tupaki Desk   |   21 Sep 2016 6:59 AM GMT
అమరావతిది అంతులేని కథా?
X
ఏపీ సీఎం చంద్రబాబు తీరు చూస్తుంటే ప్రస్తుత తన పదవీ కాలంలో రాజధాని అమరావతికి డిజైన్ కూడా ఓకే చేసేలా లేరు. దీంతో నవ్యాంధ్ర ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న కలల రాజధాని కలగానే మిగిలిపోయేలా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ అమరావతి డిజైన్‌ను కూడా ఫైనల్ చేయలేకపోయింది. ఇప్పటికే పలు డిజైన్లు ఓకే చేసి తర్వాత తిరస్కరించిన ప్రభుత్వం తాజాగా జపాన్‌ కు చెందిన మాకీ సంస్థతో ఒప్పందాలు కూడా రద్దు చేసేందుకు సిద్దమైంది.

మాకీ సంస్థ డిజైన్ల ఒప్పందం రద్దు విషయంలో ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. అమరావతి ప్రధాన భవనాల డిజైన్ల కోసం మాకీతో పాటు అనేక అంతర్జాతీయ సంస్థలు డిజైన్లు సమర్పించాయి. మాకీ సంస్థ పెద్దపెద్ద డోముల తరహాలో భవనాలను డిజైన్ చేసి ఇచ్చింది. దీన్ని దాదాపు చంద్రబాబు ఓకే చేసేశారు. రూ. 87 కోట్లు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. అయితే అమరావతి డిజైన్లు చూసి పాకిస్తాన్ మీడియా ఏపీలో అణుధార్మిక కేంద్రం నిర్మిస్తున్నారని ప్రచారం చేసింది. దీంతో ఆ డిజైన్లు నవ్వుల పాలయ్యాయి. దీంతో చంద్రబాబు పరువు పోయినంత పనయింది.

దాంతో ఆ డిజైన్లను పక్కనపెట్టేశారు చంద్రబాబు. తాజాగా మాకీతో ఒప్పందం రద్దు చేసుకోవాలని మంగళవారం జరిగిన సమావేశంలో చంద్రబాబు నిర్ణయించారు. అమరావతి ప్రధాన భవనాల డిజైన్ కోసం కొత్తగా గ్లోబల్ టెండర్లు పిలవాలని నిర్ణయించారు. మొత్తం మీద మళ్లీ టెండర్లు పిలిచి - ఆయా కంపెనీలు డిజైన్లు సమర్పించి వాటిని ఓకే చేసేందుకు ఇంకెంత కాలం పడుతుందో ఏమో.. లేదంటే మనవాళ్ల సంస్థలు ఏమైనా ఉన్నాయో.