Begin typing your search above and press return to search.

చిన్న‌నాటి గురువును క‌లిసిన క‌లాం

By:  Tupaki Desk   |   20 July 2015 9:18 AM GMT
చిన్న‌నాటి గురువును క‌లిసిన క‌లాం
X
గ‌తాన్ని చాలామంది మ‌ర్చిపోతారు. మ‌రికొంద‌రు వ‌ర్త‌మానంలోనూ గ‌తాన్ని గుర్తు చేసుకుంటూ తాము ఎదిగిన వైనాన్ని త‌ర‌చూ గుర్తు చేసుకుంటుంటారు. అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారిలో ఇలాంటి గుణం చాలా అరుదుగా క‌నిపిస్తుంది.

దేశంలో ప్ర‌తిఒక్క‌రూ అభిమానించి.. ఆరాధించి.. వివాదాల మ‌ర‌క‌ను వేయ‌టానికి సాహ‌సించ‌ని అతి కొద్ది వ్య‌క్తుల్లో భార‌త మాజీ రాష్ట్రప‌తి అబ్దుల్ క‌లాం ఒక‌రు. దేశం కోసం జీవించే ఆయ‌న్ను ప్ర‌తిఒక్క‌రూ ఎంత‌గా గౌర‌విస్తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అత్యున్న‌త స్థానంలో ఉండి కూడా గ‌తాన్ని మ‌ర్చిపోవ‌టానికి క‌లామ్ అస్స‌లు ఇష్ట‌ప‌డ‌రు. నిమిషం ఖాళీగా ఉండ‌కుండా.. దేశం మొత్తం తిరుగుతూ..యువ‌త‌లో స్పూర్తిని నింపుతూ ఉండే ఆయ‌న తాజాగా త‌న‌కు చిన్న‌త‌నంలో పాఠాలు చెప్పిన గురువును వెతుక్కుంటూ వెళ్లారు.

ఎప్పుడో అర‌వైఏళ్ల క్రితం త‌న‌కు పాఠాలు చెప్పిన గురువును వెతుక్కుంటూ వెళ్ల‌టం గ‌మ‌నార్హం. 1950 ప్రాంతంలో తిరుచ్చి సెయింట్ జోస‌ఫ్ కాలేజీలో ఫిజిక్స్ ప్రొఫెస‌ర్ గా ప‌ని చేసిన చిన్న‌దురైని ఆయ‌న తాజాగా క‌లిశారు. ప్ర‌స్తుతం 91 ఏళ్ల వ‌య‌సులో ఉన్న ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకు క‌లాం స్వ‌యంగా వెళ్ల‌టంతో శిష్యుడ్ని చూసి ఆ గురువు ఆనంద భాష్పాలు కార్చారు.

అబ్దుల్ క‌లాం వ‌ర‌కు చిన్న‌దురైతో ప్ర‌త్యేక అనుబంధం ఉంది. ఆయ‌న ద‌గ్గ‌ర చ‌దువుకునే స‌మ‌యంలోనే క‌లాంకు సాంకేతిక రంగం మీద ఆస‌క్తి పెరిగింది. అది అంచ‌లంచెలుగా పెరిగి దేశం గ‌ర్వించే శాస్త్ర‌వేత్త‌ను త‌యారయ్యేలా చేసింది. ప్ర‌స్తుతం దిండుగ‌ల్ లో ఉంటున్న త‌న గురువును క‌లుసుకున్న సంద‌ర్భంగా క‌లామ్ ఆయ‌న‌కు ఒక పుస్త‌కాన్ని బ‌హుమ‌తిగా ఇచ్చారు. ఆయ‌న యోగ‌క్షేమాలు తెలుసుకున్నారు. ఈ వ‌య‌సులో కూడా త‌న చిన్న‌నాటిని గురువును గుర్తు పెట్టుకోవ‌టం గ్రేట్ క‌దూ.