Begin typing your search above and press return to search.

కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీసీసీ పదవి?

By:  Tupaki Desk   |   21 Nov 2019 8:21 AM GMT
కిరణ్ కుమార్ రెడ్డికి ఏపీసీసీ పదవి?
X
లాస్ట్ బాల్ వరకు ఆడి ఏపీ ఉమ్మడి రాష్ట్రాన్ని విడిపోకుండా శతవిధాలా అడ్డుకున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఏపీ విభజన చేస్తానన్న సొంత పార్టీ కాంగ్రెస్ నే ఎదురించిన సీఎంగా చరిత్రలో నిలిచిపోయారు. ఏపీ విభజన పూర్తయ్యింది. ఏపీలో కాంగ్రెస్ కనుమరుగైంది. ఈ నేపథ్యంలో ‘జైసమైక్యాంధ్ర’ పార్టీ పెట్టి కిరణ్ కూడా దారుణంగా ఓడిపోయి రాజకీయాలకు దూరమయ్యారు.

ఆ తర్వాత 2018లో తిరిగి కాంగ్రెస్ లో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాల్లో యాక్టివ్ రోల్ మాత్రం పోషించడం లేదు. రాహుల్ గాంధీ పాల్గొన్న కేవలం రెండు బహిరంగ సభల్లో మాత్రమే కనిపించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది. రాహుల్ రాజీనామా చేసేశారు. ఏపీలో పీసీసీ చీఫ్ గా ఉన్న రఘువీరారెడ్డి కూడా బాధ్యతలు వదిలేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పీసీసీలను ప్రక్షాళన చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఇటీవలే రాష్ట్రాల పీసీసీ చీఫ్ లు, పీసీసీ కార్యవర్గంతో సమావేశమైంది. ఆ కోవలోనే ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడి నియమించేందుకు యోచిస్తోందట.. ఖాళీగా ఉన్న ఈ పీసీసీ పీఠంపై ఇప్పుడు జగన్, బాబులను తలదన్నే నాయకుడిని కాంగ్రెస్ తీసుకువస్తోందన్నది సమాచారం.

ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ కళ్లన్నీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపైనే ఉన్నాయి. ఇక ఈయనతోపాటు కాంగ్రెస్ హయాంలో వెలుగు వెలిగిన పల్లం రాజు, చింతా మోహన్ లాంటి సీనియర్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నా వారికంటే కిరణ్ మెరుగ్గా కాంగ్రెస్ కు కనిపిస్తున్నారు. పల్లంరాజు, చింతాలు ఇప్పటివరకు స్వయంగా పాల్గొని ప్రజల్లో చేసిందేమీ లేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేస్తున్న క్రమంలోనే ఏపీసీసీ చీఫ్ గా కిరణ్ ను నియమించడానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ కాబోతున్నాయని సమాచారం.

వచ్చే 2024 ఎన్నికల నాటికి ఏపీలో పార్టీని నిర్మించి.. గౌరవనీయ స్థానానికి తీసుకురావడం ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డికి పెద్ద టాస్క్ గా మారింది. వచ్చే ఎన్నికల నాటికి కనీసం పదుల సంఖ్యలోనైనా సీట్లు గెలిపించేందుకు కిరణ్ రెడీ కావాల్సి ఉంటుంది.