Begin typing your search above and press return to search.

యాపిల్ సీఈవో భలే జోకేశారే

By:  Tupaki Desk   |   26 May 2016 6:05 PM GMT
యాపిల్ సీఈవో భలే జోకేశారే
X
కొంతమందికి కొన్ని ప్రశ్నలు అస్సలు గిట్టవు. తమకేమాత్రం ఇష్టం లేని ప్రశ్నలు ఎదురైనప్పుడు చికాకు పడిపోవటం మన రాజకీయ నాయకులకు అలవాటే. తమను ఇరుకున పెట్టే సందేహాల్ని ఎవరైనా వ్యక్తం చేస్తే వెంటనే బ్యాలెన్స్ మిస్ అయి మండిపడతారే కానీ.. చమత్కారంగా మాట్లాడి.. ఇష్యూను డైవర్ట్ చేయాలన్న ధోరణి అస్సలు కనిపించదు. ప్రశ్నలు అడిగినోళ్ల నోరు మూయించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అనుసరించిన ఎదురుదాడి సూత్రాన్ని పాటించే నేతలు.. అందుకు భిన్నంగా యాపిల్ సీఈవో టిమ్ కుక్ ను ఫాలో అయితే బాగుంటుందేమో.

తనకు ఏ మాత్రం ఇష్టం లేని ప్రశ్నలు ఎదురైనప్పుడు ఆయనెంత కూల్ గా విషయాన్ని డైవర్ట్ చేస్తారో చెప్పే ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. ఈ మధ్యనే భారత్ కు వచ్చి వెళ్లిన టిమ్ కుక్ ప్రస్తుతం నెదర్లాండ్స్ లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా అక్కడి మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను ఒక చిత్రమైన ప్రశ్నను వేశారో మీడియా ప్రతినిధి.

ఐఫోన్ ను ఎప్పుడు.. ఎక్కడ కనిపెట్టారంటూ ప్రశ్నించిన మీడియా ప్రతినిధికి.. కుక్ ఇచ్చిన సమాధానం ఏమిటంటే.. ‘‘గత రాత్రి అమ్ స్టర్ డ్యామ్ లో ఓ పెయింటింగ్ చూశా. అది 350 ఏళ్ల నాటిది. ఆ పెయింటింగ్ లోని యువతి చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ ను ఆధునీకరించి ఐఫోన్ తయారు చేశాం. అంటే.. ఐఫోన్ ను 350 ఏళ్ల క్రితమే కనిపెట్టాం’’ అంటూ చమత్కరించి అక్కడ వారిని నవ్వుల్లో ముంచెత్తిన ఆయన.. సూటిగా సమాధానం చెప్పకుండా విషయాన్ని డైవర్ట్ చేశారు. ఈ తరహా వ్యూహాన్ని మన రాజకీయ అధినేతలు ఫాలో అయితే పలు వివాదాల నుంచి ఇట్టే బయటపడతారేమో..?