Begin typing your search above and press return to search.

కేటీఆర్ కు షాకిచ్చిన యాపిల్

By:  Tupaki Desk   |   18 May 2016 10:28 AM GMT
కేటీఆర్ కు షాకిచ్చిన యాపిల్
X
ప్రపంచ ప్రఖ్యాత సంస్థ యాపిల్ తాను భారత్‌ లో స్థాపించాలని భావించిన యాప్ డిజైన్ అండ్ డెవలప్‌ మెంట్ సెంటర్ ను కర్ణాటకలోని బెంగళూరులో ఏర్పాటు చేయబోతోంది. ఈ డెవలప్‌‍ మెంట్ సెంటర్‌ ను దక్కించుకునేందుకు పలు రాష్ట్రాలు ప్రయత్నించాయి. ముఖ్యంగా తెలంగాణలో ఐటీ మంత్రిగా మంచి జోరు మీదున్న కేటీఆర్ దీన్ని ఎలాగైనా హైదరాబాద్ లో ఏర్పాటు చేయించాలని తీవ్రం గా ప్రయత్నించారు. కానీ.. ఆయన ప్రయత్నాలన్నీ వమ్మయ్యాయి. వినూత్న మొబైల్ యాప్‌ లను తయారు చేసే భారత్‌ లోని డెవలపర్లకు సహకరించేలా బెంగళూరులో సెంటర్ ప్రారంభించనున్నట్టు యాపిల్ సంస్థ ఓ ప్రకటనలో తెలపడంతో కేటీఆర్ నిరాశకు గురైనట్లు సమాచారం.

ఈ సెంటర్ కోసం ఎంత పెట్టుబడి పెట్టునున్నామన్న విషయాన్ని యాపిల్ వెల్లడించలేదు. 2017లో ఈ సెంటర్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. భారత్‌ లో స్టార్టప్ సంస్థల పుట్టినిల్లుగా ఉన్న బెంగళూరులో యాప్ డిజైన్ అండ్ డెవలప్‌ మెంట్ సెంటరును ప్రారంభించనున్నామని, భారత్‌ లో ఇప్పటికే వేలమంది కొత్త తరం యాప్‌ ల తయారీకి కృషి చేస్తున్నారని యాపిల్ స్పష్టంగా పేర్కొంది. ఐఓఎస్ ఆపరేటింగ్ విధానంలో పని చేసేలా తయారయ్యే యాప్‌ లకు ఇక్కడ పూర్తి సహాయ - సహకారాలు లభిస్తాయని యాపిల్ సంస్థ వెల్లడించింది. ఇక్కడికి వచ్చి యాప్‌ లను తయారు చేసే వారికి ప్రతి వారమూ యాపిల్ నిపుణులు సలహా సూచనలు ఇస్తారని తెలిపింది.

మరోవైపు యాపిల్ సీఈవో టిమ్ బుధవారం హైదరాబాదు వస్తున్న తరుణంలో ఇలాంటి నిర్ణయం వెలువడడం ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ ఐటీ మంత్రిగా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధికి గట్టి ప్రయత్నాలే చేశారు. ఒకానొక దశలో ఆయనతో టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ పోటీపడడం కోసం లోకేశ్ కు కూడా ఏపీలో ఐటీ మంత్రి పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. అలాంటి కేటీఆర్ కు యాపిల్ తీసుకున్న తాజా నిర్ణయం షాకింగ్ అనే చెప్పాలి.