Begin typing your search above and press return to search.

యాపిల్ గొంతెమ్మ కోర్కెలు విన్నారా?

By:  Tupaki Desk   |   24 Jan 2017 4:59 AM GMT
యాపిల్ గొంతెమ్మ కోర్కెలు విన్నారా?
X
స్మార్ట్ ఫోన్ల‌లో యాపిల్ కంపెనీ త‌యారు చేస్తున్న ఐఫోన్‌ ల‌కు ఉన్న క్రేజ్ మ‌రే కంపెనీ స్మార్ట్ ఫోన్‌ కూ లేద‌నే చెప్పాలి. ఒకప్పుడు నోకియా - ఎరిక్స‌న్‌ - శ్యాంసంగ్... తాజాగా వ‌ర‌ద‌లా వెల్లువెత్తుతున్న కొత్త కంపెనీల ఫోన్ల‌లో లెక్క‌లేన‌న్ని ఫీచ‌ర్లున్న‌ప్ప‌టికీ ఐఫోన్ అంటేనే... యువ‌త వెర్రెత్తి పోతోంది. ఒక్క యువ‌తే కాదండోయ్‌... స్మార్ట్ ఫోన్ వాడే వారికి ఎవ‌రికైనా ... ఖ‌రీదెక్కువైనా ఎప్ప‌టికైనా ఐఫోన్‌ ను ప‌ట్టుకోవాల‌న్న కోరిక ఉంద‌న్న‌ది ఏ ఒక్క‌రూ కాద‌న‌లేని స‌త్యం. అయితే అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీ... ఈ ఐఫోన్ల‌ను అమెరికా స‌హా త‌న‌కు అనుకూలమైన ఇత‌ర దేశాల్లోనే ఉత్ప‌త్తి చేస్తోంది. అమెరికా మిన‌హా ఐఫోన్ ఉత్ప‌త్తి అవుతున్న దేశాల సంఖ్య‌ను వేళ్ల‌పై లెక్కించ‌వ‌చ్చు. మ‌రి ఐఫోన్ అంటే ప‌డి చ‌చ్చే భార‌తీయుల‌కు ఆ ఫోన్ అందాలంటే... ఎక్క‌డో దూర దేశాల్లో ఉత్ప‌త్తి అయిన స‌ద‌రు హ్యాండ్ సెట్లు ఇక్క‌డికి త‌ర‌లిరావాల్సిందే. ఇందుకు నెల‌ల త‌ర‌బడి స‌మ‌యం ప‌డుతోంది. దీంతో ఐఫోన్ ప్రియులైన భార‌తీయుల‌కు తాము కోరుకున్న ఐఫోన్ చేతిలోకి రావాలంటే నెల‌ల త‌ర‌బ‌డి నిరీక్ష‌ణ త‌ప్ప‌డం లేదు.

అయితే ఇక‌పై ఆ నిరీక్ష‌ణ‌కు చెక్ ప‌డే దిశ‌గా అడుగులు ప‌డుతున్నాయి. భార‌తీయుల కోసం భార‌త్‌ లోనే ఐఫోన్ల త‌యారీకి యాపిల్ కంపెనీ ఓ బృహత్కార్యాన్నే సిద్ధం చేసింది. ఇంత‌దాకా బాగానే ఉన్నా... ఆ కంపెనీ పెడుతున్న ష‌ర‌తులు చూస్తేనే మ‌తి పోతోంది. తాను త‌యారు చేసిన ఐఫోన్లు - ఇత‌ర ఎల‌క్ట్రానిక్ గూడ్స్ రేట్ల విష‌యంలో ఏమాత్రం రాజీ లేని ధోర‌ణితో ముందుకు సాగుతున్న యాపిల్... భార‌త్ విష‌యానికి వ‌చ్చేస‌రికి బీద అరుపులు అరుస్తోంది. ఆ బీద అరుపులేంటో ఓ సారి ప‌రిశీలిస్తే... స‌గ‌టు భార‌తీయుడికి ఆశ్చ‌ర్యంతో పాటు కోపం న‌శాళానికి అంట‌క మాన‌దు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... భార‌త ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత న‌రేంద్ర మోదీ... మేకిన్ ఇండియా పేరిట ఓ బృహ‌త్కార్యాన్నే ప్ర‌క‌టించారు. ఈ ప‌థ‌కం కింద దేశంలో ఉత్ప‌త్తి రంగంలోకి అడుగుపెట్టే పారిశ్రామిక‌వేత్త‌ల‌కు, ఆయా మ‌ల్టీ నేష‌న‌ల్ కంపెనీల‌కు భారీ ఎత్తున రాయితీలు ఇవ్వ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ ప్ర‌క‌ట‌న గురించి ఆరా తీసిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్... ఇదేదో బాగానే ఉంద‌ని భావించార‌ట‌. అప్ప‌టిదాకా భార‌త గ‌డ్డ‌పై అడుగు పెట్టాల‌న్న భావ‌నే రాని కుక్‌...మేకిన్ ఇండియా ప‌థ‌కంతో ఒక్క‌సారిగా భార‌త్ వైపు దృష్టి సారించారు. భార‌త గ‌డ్డ‌పైనా త‌మ కంపెనీ స్మార్ట్ ఫోన్ అయిన ఐఫోన్‌ తో పాటు ఇత‌ర ఎల‌క్ట్రానిక్ గూడ్స్‌ ను త‌యారు చేసేందుకు సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. అంతేనా... ఏనాడూ భార‌త్ వైపు చూడ‌ని ఆయ‌న ఏకంగా గ‌త ఏడాది మేలో ఢిల్లీ బాట ప‌ట్టారు. ఇక్క‌డి అపార అవ‌కాశాల‌ను తెలుసుకున్న ఆయ‌న ఏకంగా ఐఫోన్‌ ల ఉత్ప‌త్తిని ఇక్క‌డే చేప‌డ‌తామని, అందుకోసం ఏకంగా ఓ భారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామ‌ని సాక్షాత్తు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ముందే చెప్పేశారు. కుక్ ప్ర‌క‌ట‌న‌ను స్వాగ‌తించిన మోదీ... త‌న మేకిన్ ఇండియా బాగానే ప‌నిచేస్తోంద‌ని భావించారు. యాపిల్ కంపెనీ యూనిట్‌ కు రెడ్ కార్పెట్ ప‌రుస్తామ‌ని కూడా హామీ ఇచ్చారు. ఇక ఈ రెడ్ కార్పెట్ స్వాగతానికి స‌మ‌యం ఆస‌న్న‌మైన నేప‌థ్యంలో యాపిల్ త‌న‌లోని స్వలాభాపేక్ష‌ను బ‌య‌ట‌పెట్టుకుంది.

రేపు యాపిల్ ప్ర‌తినిధులు భారత ప్ర‌భుత్వంలోని ప‌లు కీల‌క శాఖ‌ల అధికారుల‌తో భేటీ కానున్నారు. ఇందుకోసం ఓ భారీ ప్ర‌తినిధి బృందాన్ని కుక్ భార‌త్‌ కు పంపిస్తున్నారు. వారు ఇక్క‌డ అడుగుపెట్టేందుకు ముందుగానే కార్య‌రంగం సిద్దం చేసేందుకు కుక్ చాలా తెలివిగానే పావులు క‌దిపార‌న్న వాద‌న వినిపిస్తోంది. భార‌త్‌ లో త‌మ కంపెనీ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు తాము ఆస‌క్తిగానే ఉన్నామ‌ని చెబుతూనే ఆయ‌న‌... రాయితీల చిట్టాను విప్పార‌ట‌. ఇత‌ర దేశాల నుంచి దిగుమతి చేసుకునే విడిభాగాలు - ఇత‌ర ప‌రిక‌రాల‌పై ఏకంగా 15 ఏళ్ల పాటు దిగుమతి సుంకాన్ని మిన‌హాయించాల‌ని ఆయ‌న ప్ర‌తిపాదించారు. అంతేనా... త‌న‌కు అవ‌స‌ర‌మైన విడిభాగాల‌కు క‌స్ట‌మ్స్ సుంకాన్ని ఏకంగా ఎత్తివేయాల‌ని కోరార‌ట‌. ఇక ముడి స‌రుకుల మీద పూర్తి స్థాయిలో ప‌న్ను మినహాయింపును ఆయ‌న కోరుతున్నారు.

అంతేకాదండోయ్‌... త‌న యూనిట్‌ను ఇక్క‌డ ఏర్పాటు చేస్తే... తాను కోరుకున్న ప్ర‌తి అంశానికి ఏమాత్రం అడ్డంకులు లేకుండా చూడాల‌ని కూడా మోదీ స‌ర్కారును కోరార‌ట‌. ఇదేదో గాలి వార్త‌ల విష‌యం కాదు. ఏకంగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖలో కీల‌క స్థానంలో ఉన్న ఓ అధికారి చెప్పిన విష‌యాలివి. యాపిల్ నుంచి విన‌తుల లిస్టు అందింద‌ని ధృవీక‌రించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ కూడా... యాపిల్ రాయితీల‌ను మాట‌ను ప‌రోక్షంగానే ఒప్పుకున్నా... అస‌లు విష‌యాన్ని మాత్రం వెల్ల‌డించ‌డం లేదు. మ‌రి యాపిల్ కంపెనీ ప్ర‌తిపాదించిన ఈ గొంతెమ్మ కోరిక‌ల‌కు మోదీ స‌ర్కారు ఎలా స్పందిస్తుంద‌న్న విష‌యం రేపు తేలిపోనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/