Begin typing your search above and press return to search.

ఆ సామాన్యుడ్ని ప్రగతిభవన్ కు పిలిచిన సీఎం!

By:  Tupaki Desk   |   12 May 2020 3:45 AM GMT
ఆ సామాన్యుడ్ని ప్రగతిభవన్ కు పిలిచిన సీఎం!
X
మట్టిలోని మాణిక్యాల్ని వెతికి మరీ పట్టుకునే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎక్కువే. టాలెంట్ ఉన్నా.. వినూత్నంగా ప్రయత్నిస్తున్నా.. వెంటనే వారి వివరాల్ని సేకరించి.. వారిని తన దగ్గరకు పిలిపించుకొని మాట్లాడటం ఆయనకో అలవాటు. తాజాగా ఓ సామాన్యుడికి సీఎం నుంచి పిలుపు వచ్చింది. ప్రగతిభవన్ కు రావాలని.. తనను కలవాలని కేసీఆర్ కోరటం గమనార్హం. ఇంతకీ అతడెవరు? అతనికి ప్రగతిభవణ్ నుంచి పిలుపెందుకు వచ్చింది? అన్న వివరాల్లోకి వెళితే..

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని ధనోరకు అనే గ్రామంలో కేంద్రే బాలాజీ అనే యువరైతు ఉన్నాడు. ఆ ఊరి వారి లెక్కలో చూస్తే.. అతనేం పెద్ద ప్రత్యేకమైన వ్యక్తి కాదు. ఊళ్లో వారు గుర్తించలేని అతడిలోని టాలెంట్ ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించారు. ఇంతకీ ఆయనకు నచ్చిన పాయింట్..తెలంగాణలో తొలిసారి యాపిల్ ను పండించటమే.

హైదరాబాద్ లోని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) శాస్త్రవేత్తల సూచనలు.. సలహాలు పాటిస్తూ సేంద్రీయ విధానంలో యాపిల్ సాగు చేస్తున్నాడు బాలాజీ. వ్యయ ప్రయాసలతో తాను పండించిన ఆపిళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందివాలన్నది అతడి కోరిక. తన గురించి తెలుసుకున్న సీఎం కేసీఆరే స్వయంగా ప్రగతి భవన్ రావాలన్న కబురు పంపటంతో అతగాడు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు.

ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందితే.. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున యాపిళ్లను పండించాలన్నదే తన లక్ష్యంగా చెబుతున్నాడు. మరో వారంలో తన చేతికి పంట వస్తుందని.. దాన్ని తీసుకొని సీఎం కేసీఆర్ ను కలవనున్నట్లుగా చెబుతున్నాడు. ఏమైనా.. మట్టిలో మాణిక్యాల్ని వెతికే టాలెంట్ సీఎంకు ఎక్కువేనని చెప్పక తప్పదు.