Begin typing your search above and press return to search.

వర్క్ ఫ్రమ్ హోంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. యాపిల్ కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   16 Dec 2021 1:02 PM IST
వర్క్ ఫ్రమ్ హోంపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. యాపిల్ కీలక నిర్ణయం
X
వర్క్ ప్రమ్ హోం అనేది ఒకప్పుడు చాలామందికి తెలియదు. కేవలం సాఫ్ట్ వేర్ రంగానికే ఈ సేవలు పరిమితంగా ఉండేవి. ఇక మిగతా రంగాల్లో దాని ఊసే ఉండేది కాదు. కానీ కరోనా పుణ్యమా? అని పెద్దల నుంచి పిల్లల దాకా ఈ పదం సుపరిచితమే అయింది. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగాల నుంచి మీడియా రంగం కూడా ఇంటి నుంచి పని వెసలుబాటు కల్పించింది. ఇక పాఠశాల, కళాశాల విద్యార్థులకు సైతం లెర్నింగ్ ఫ్రమ్ హోం పేరిట తరగతులు నిర్వహించారు.

అయితే దాదాపు ఏడాదిన్నర కాలం నుంచి ఈ విధానం కొనసాగుతోంది. ఇక సెకండ్ వేవ్ అనంతరం ఇంటి నుంచి పని విధానాన్ని పలు కంపెనీలు ఉపసంహరించుకుంటాయని వార్తలు వచ్చాయి. 2022, ఫిబ్రవరి నెల నుంచి ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని పలు దిగ్గజ కంపెనీలు భావించాయి. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోం మరికొన్నాళ్లు కొనసాగే అవకాశం ఉంది.

దక్షిణాఫిక్రాలో పుట్టిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ పట్ల ప్రపంచ దేశాలు వణుకుతున్నాయి. డెల్టా కంటే ప్రమాదం అని... అతివేగంగా విస్తరించే లక్షణాలు ఈ వేరియంట్ లో ఉన్నాయని డబ్ల్యూహెచ్ వో తో పాటు పలువురు వైద్య నిపుణులు చెప్పిన విషయం తెల్సిందే. కాగా ఈ వేరియంట్ ప్రభావం యాపిల్ వంటి కంపెనీలపై కూడా పడింది. ఫిబ్రవరి 1, 2022 నుంచి ఉద్యోగులు ఆఫీసుకు రావాలని యాపిల్ కంపెనీ ఇదివరకే ప్రకటించింది.

అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాకుండా ఇంటి నుంచి పని విధానానికి బోనస్ కూడా ప్రకటించింది. ప్రతీ ఉద్యోగికి 1000 డాలర్లు అనగా... రూ.76వేలకు పైగా సొమ్మును అదనంగా చెల్లించనున్నట్లు తెలిపింది. ఉద్యోగుల భద్రతా దృష్ట్యా మరికొన్నాళ్లు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసింది. పరిస్థితులు కుదుటపడ్డాక తదుపరి ప్రకటన చేస్తామని యాపిల్ పేర్కొంది.


వర్క్ ఫ్రమ్ హోం లోనూ ఆయా కంపెనీలకు పని జరుగుతోంది. అంతేకాకుండా ఇంటి నుంచి పని విధానం అవడం వల్ల ఉద్యోగులు కాసింత ఎక్కువ సమయమే కష్ట పడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు వారిని ఆఫీసులకు పిలిచి... మళ్లీ లేని పోని తలనొప్పుల కన్నా ఈ విధానమే బెటర్ అని భావిస్తున్నాయి.

కాగా గూగుల్ కూడా ఇదివరకే ఇందుకు సంబంధించిన ప్రకటన చేసింది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా ఎంప్లాయిస్ కు మరికొన్నాళ్ల పాటు వర్క్ ఫ్రమ్ హోం వెసలుబాటు కల్పించింది. అంతేకాకుండా బోనస్ కూడా ప్రకటించింది. ఇప్పుడు యాపిల్ కూడా ఇదే బాటలో నడవడం గమనార్హం. అయితే మరికొన్ని దిగ్గజ కంపెనీలు సైతం ఈ జాబితాలో చేరే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఒమిక్రాన్ వేరియంట్ దాదాపు అన్ని దేశాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ప్రభుత్వాలు పూర్తి స్థాయి చర్యలు చేపట్టినా కూడా కేసులు వస్తూనే ఉన్నాయి.

ఈ మేరకు ఉద్యోగులకు ఇలాంటి సదుపాటం చాలా అవసరం అని విశ్లేషకులు అంటున్నారు. మరికొన్నాళ్ల పాటు పూర్తి స్థాయి ఇంటి నుంచి పని విధానం కల్పించి... ఆ తర్వాత దశల వారీగా కార్యాలయాలకు పిలిస్తే మంచిదని చెబుతున్నారు. ఇతర కంపెనీలు సైతం వీలైనంత త్వరగా ఇందుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం అంటున్నారు.