Begin typing your search above and press return to search.

ద‌ర‌ఖాస్తు చేసుకోండి డ‌బ్బులిస్తాం.. సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌

By:  Tupaki Desk   |   15 Jun 2021 8:30 AM GMT
ద‌ర‌ఖాస్తు చేసుకోండి డ‌బ్బులిస్తాం.. సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న‌
X
ఒక‌వైపు రాష్ట్రం ఆర్థిక క‌ష్టాల్లో అల్లాడుతున్న విష‌యం తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. సీఎం జ‌గ‌న్ వీటినేమీ ప‌ట్టించుకోవ‌డం లేదు. వార్షిక రుణ ప్ర‌ణాళిక‌లు పెట్టుకుని మ‌రీ.. అప్పుల పాల‌న సాగిస్తున్నారనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. ఖాత‌రు చేయ‌డం లేదు. తాజాగా `వైస్సార్ వాహ‌నమిత్ర‌` ప‌థ‌కానికి ఆయ‌న వ‌రుసగా మూడో ఏడాది కూడా ఆయ‌న నిధులు విడుద‌ల చేశారు. ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ప్రభుత్వం 10వేల రూపాయల చొప్పున వారి ఖాతాల్లోకి జ‌మ చేసిన సీఎం జ‌గ‌న్‌.. ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లుచేశారు.

ఈ ప‌థ‌కంలో ఇప్ప‌టికీ ద‌ర‌ఖాస్తు చేసుకోనివారికి మ‌రింత స‌మ‌యం ఇస్తామ‌న్న జ‌గ‌న్‌.. ఈ నెల 30 వ‌ర‌కు ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన ప్ర‌తి ఒక్క‌రికీ రూ.10 వేలు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఆటో, క్యాబ్‌ డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో నేరుగా చూడటం ద్వారా వాహనమిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ ఈ పథకం అమ‌లు చేస్తున్న‌ట్టు తెలిపారు.

2.48 లక్షల మందికి రూ.248.47 కోట్ల నగదును సీఎం జ‌గ‌న్ ఈ సంద‌ర్భంగా విడుద‌ల చేశారు. అయితే.. ఈ విధ‌మైన పంపకాల‌పై ప్ర‌జాస్వామ్య వాదులు పెద‌వి విరుస్తున్నారు. ఒక‌వైపు రాష్ట్రం ఆర్థిక న‌ష్టాలు, క‌ష్టాలుఎదుర్కొంటున్న స‌మ‌యంలో ఆదాయం పెంపుపై దృష్టి సారించాల్సిన ప్ర‌భుత్వం ఇలా రాజ‌కీయ కోణంలో ప్ర‌జాధ‌నాన్ని పంచ‌డం ఏమేర‌కు స‌బ‌బ‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జ‌ల‌కు ఆదాయ మార్గాల‌నుచూపించాల్సిన అవ‌స‌రం పాల‌కులకు ఉంద‌ని గుర్తు చేస్తున్నారు. కానీ, జ‌గ‌న్ మాత్రం పంచ‌డంపై దృష్టి పెట్ట‌డం శోచ‌నీయ‌మ‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.