Begin typing your search above and press return to search.

యూఎస్ వీసా కావాలంటే..సోష‌ల్ మీడియా లెక్క‌లు చెప్పాల్సిందే

By:  Tupaki Desk   |   2 Jun 2019 7:55 AM GMT
యూఎస్ వీసా కావాలంటే..సోష‌ల్ మీడియా లెక్క‌లు చెప్పాల్సిందే
X
అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించింది మొద‌లు...డొనాల్డ్ ట్రంప్ వ‌రుస షాకులు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. అమెరికా అంటే ఉన్న క్రేజ్‌ను సైతం...వ‌దిలివేసేలా ట్రంప్ ష‌ర‌తుల ప‌రంప‌ర‌ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రో ప‌రిణామం తెర‌మీద‌కు వ‌చ్చింది. వీసా దరఖాస్తుదారులు కఠినతరమైన ప్రశ్నలు ఎదుర్కొనేలా అదనపు విచారణ వారెంట్‌ను జారీ చేశారు. అమెరికా డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ప్రతిపాదించిన ఈ విచార‌ణ ప్ర‌కారం...అభ్యర్థులందరూ అన్ని పాస్‌ పోర్టు నెంబర్లను - 5 ఏళ్ల‌ విలువైన సోషల్‌ మీడియా ఖాతాలు - ఈ-మెయిల్‌ అడ్రస్‌ లు - ఫోన్‌ నెంబర్ల సమాచారాన్ని అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసే ముందు సమర్పించాల్సి ఉంటుందని త్వ‌ర‌లో వెలువ‌డ‌నున్న‌ ఆదేశాల్లో స్ప‌ష్టం చేయ‌నున్నారు.

అమెరికా డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ను ప్ర‌స్తావిస్తూ బీబీసీ వెల్ల‌డించిన‌ స‌మాచారం ప్ర‌కారం - వీసాల జారీని మ‌రింత ప‌క‌డ్బందీగా రూపొందించేందుకు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భావించిన అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ మేరకు కఠినతరమైన నిబంధనలు అమలుచేయాలని ఆదేశించార‌ట‌. దీంతో తాజా నిర్ణ‌యానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని తెలిపింది. ఈ క్ర‌మంలో వీసా దరఖాస్తుదారుడికి ఉగ్రవాదం తదితర అంశాలతో సంబంధాలు ఉందేమో తేల్చేందుకు సోషల్‌ మీడియా అకౌంట్ల విచారణ కూడా అందులో భాగమని వివ‌రించింది. ఒకవేళ వీసా దరఖాస్తుదారుడికి ఉగ్రవాదం తదితర అంశాలతో సంబంధాలు ఉంటే సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని వీసా జారీని నిలిపివేయనున్నట్టు తేల్చిచెప్పింది. అయితే ఏ ఒక్క దేశాన్నో లక్ష్యంగా చేసుకొని ఈ నిబంధనలు తీసుకురావడం లేదని పేర్కొంది. ఈ విచార‌ణ‌లో సోషల్‌ మీడియా అకౌంట్ల యూజర్‌ నేమ్‌ - పాస్‌ వర్డ్‌ లను ఆఫీసర్లు అడగరని వెల్ల‌డించింది. గ‌త ఏడాది మార్చిలో ప్ర‌తిపాద‌న‌లు త్వ‌ర‌లో నిబంధ‌న‌ల రూపంలో అమ‌లులోకి రానున్న‌ట్లు పేర్కొంది.

ఈ అదనపు స్క్రీనింగ్‌ తో దరఖాస్తుదారుడి ఇంటర్వ్యూ సమయం గంటకు పైగా పట్టనుందని - త‌ద్వారా ప్ర‌తి ఏటా 14.7 మిలియ‌న్ల వీసాల జారీ విష‌యంలో ప్ర‌భావం చూపుతుంద‌ని అంటున్నారు. నూత‌న నిబంధ‌న‌ల‌తో కొత్త కొత్త ప్రశ్నలతో వీసా జారీ ప్రక్రియ చాలా జాప్యం కానుందని అంతర్జాతీయ విద్యార్థులను - శాస్త్రవేత్తలను - నిపుణులను ఇది నిరుత్సాహపరుస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా, ట్రంప్ అనుకున్న‌ది చేయ‌డ‌మే త‌ప్ప ఆందోళ‌న‌ల‌ను ప‌ట్టించుకునే బాప‌తు కాద‌నే సంగ‌తి తెలిసిందే.