Begin typing your search above and press return to search.

మూక‌దాడుల‌పై కేంద్రం మ‌రో షాకింగ్ నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   25 July 2018 5:00 PM GMT
మూక‌దాడుల‌పై కేంద్రం మ‌రో షాకింగ్ నిర్ణ‌యం!
X
దేశంలో మూక‌దాడులు వ‌ల్ల ఎంతో మంది అమాయ‌కులు అశువులు బాస్తున్న నేప‌థ్యంలో మూక‌దాడులకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్ర‌భుత్వం న‌డుం బిగించిన సంగ‌తి తెలిసిందే. దేశవ్యాప్తంగా మూకోన్మాద ఘటనలు, దాడుల‌ను అడ్డుకునేందుకు నిబంధనలను కఠినతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది.మూక హ‌త్య‌ల‌ను నివారించేందుకు కేంద్రం 2 క‌మిటీల‌ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. హోంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో సుష్మాస్వరాజ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌ - నితిన్‌ గడ్కరీ - టీసీ గెహ్లాట్‌ సభ్యులుగా జీఓఎంను ఏర్పాటు చేశారు. హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌ గౌబా నలుగురు సభ్యులతో ఉన్న అధికారుల కమిటీకి నేతృత్వం వహిస్తారు. దీంతోపాటు, తాజాగా మూక‌ హ‌త్య‌లకు నివారించేందుకు కేంద్రం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశాలపై నిఘా వేసి - నియంత్రించేందుకు ప్రతి జిల్లాలోనూ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌ ను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచించింది.

సోషల్ మీడియాలో అవాస్త‌వాల‌ను కొంద‌రు వైర‌ల్ చేస్తోన్న నేప‌థ్యంలో మూక‌హ‌త్య‌లు నానాటికీ పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో వాటికి అడ్డుక‌ట్ట వేసేందుకు కేంద్రం ప‌లు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టింది. సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ - ఫేక్ న్యూస్ లను నియంత్రించేందుకు ప్రతి జిల్లాలోనూ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటుచేయాలని కేంద్రం సూచించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్పీ స్థాయి అధికారిని ఆ టాస్క్ ఫోర్స్ కు నోడల్ అధికారిగా నియమించాలని ఆదేశించింది. అయితే, మూకహత్యలకు అడ్డుక‌ట్ట వేసేందుకు కేంద్రం స‌త్వ‌ర చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని ఈ నెల 17న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. దీనిపై స్పందించిన కేంద్రం....నెలరోజుల వ్యవధిలోనే స‌త్వరం స్పందించ‌డం విశేషం. ఈ తాజాగా మార్గ‌ద‌ర్శ‌కాల నేప‌థ్యంలోనైనా మూక‌దాడులు త‌గ్గుముఖం ప‌ట్టాల‌ని ప్ర‌జ‌లు ఆకాంక్షిస్తున్నారు.