Begin typing your search above and press return to search.

అమిత్ షా తో భేటీలే భేటీలు... ?

By:  Tupaki Desk   |   29 Oct 2021 11:51 AM GMT
అమిత్ షా తో భేటీలే భేటీలు... ?
X
కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆయన బీజేపీ ప్రభుత్వంలో పవర్ ఫుల్. ప్రధాని నరేంద్ర మోడీ తరువాత ప్లేస్ ఆయన‌దే. అలా అద్వితీయంగా దేశాన్ని నడుపుతున్నారు. ఆయన శాఖ కూడా కీలకం కావడంతో ఆయనతోనే అందరికీ పని పడుతోంది. ఈ మధ్యనే అమిత్ షాని కలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు, అక్కడ రెండు రోజుల పాటు మకాం వేసినా షా దర్శనం మాత్రం దక్కలేదు. అయితే ఆ తరువాత షా చంద్రబాబుతో ఫోన్ లో మాట్లాడారు అని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఇలా ఉంటే ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలవాలని మళ్లీ టీడీపీ తన ప్రయత్నాల్లో తాను ఉంది. వైసీపీ నుంచి కూడా అమిత్ షా తో భేటీకి ట్రయల్స్ జరుగుతున్నాయి. మరి ఇవన్నీ ఇలా ఉండగానే అమిత్ షా తానే ఏపీకి వచ్చేస్తున్నారు.

ఆయన నవంబర్ 14న ఏపీలోని తిరుపతికి వస్తున్నట్లుగా అధికార వర్గాల సమాచారం. అమిత్ షా అధ్యక్షతన 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశం తిరుపతిలో జరగనుంది. ఈ మీటింగుకు దక్షిణాదికి చెందిన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు సీనియర్ అధికారులు హాజరవుతారు. ఒక విధంగా అత్యంత కీలకమైన సమావేశం ఇది. అలా అమిత్ షా తానుగా ఏపీకి విచ్చేస్తున్నారు. అది కూడా అధికారిక హోదాలో. మరి అమిత్ షాని కలిసేందుకు ఏ రాజకీయ పార్టీ అధినేత ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆయనతో భేటీకి తిరుపతి దాకా వస్తే సరిపోతుంది.

అయితే షాతో భేటీకి అందరి కంటే ఎక్కువ అవకాశం ఏపీ సీఎం జగన్ కి ఉంటుంది. జగన్ ఈ మీటింగులో ఎటూ పాల్గొంటారు. పనిలో పనిగా కొంతసేపు అయినా షా తో ఆయన ఏకాంత ముచ్చట్లు పెట్టవచ్చు. పైగా ఏపీలో ఇపుడు హాట్ హాట్ గా టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉంది. దాంతో టీడీపీని కట్టడి చేయడానికి షాతో వైసీపీ ఈ భేటీని వేస్తుంది అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తున్న టీడీపీ కూడా అమిత్ షా టూర్ ని జాగ్రత్తగా గమనిస్తోంది.

చంద్రబాబు తిరుపతిలోనే అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం అవుతారు అంటున్నారు. ఇప్పటికే ఆయన ఫోన్ లో బాబుతో మాట్లాడి ఉన్నదువల్ల నేరుగా కలసి ఏపీలో వైసీపీ అరాచకాలను కేంద్ర హోం మంత్రి దృష్టికి తేవాలని చంద్రబాబు అనుకుంటున్నారుట. ఇంకో వైపు ఏపీలో బీజీపీకి మిత్ర పక్షం నేతగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఎలాగూ ఉన్నారు. ఆయన కూడా చాలా కాలంగా ఢిల్లీకి వెళ్ళి షాని కలవాలని, ఏపీలో అనేక సమస్యలు ఆయనకు చెప్పాలని చూస్తున్నారుట. ఇపుడు ఆయనకూ మంచి చాన్స్ వచ్చేట్టుంది. ఇలా ఏపీకి చెందిన ప్రధాన పార్టీల నేతలు అంతా కూడా అమిత్ షా తో భేటీల మీద భేటీలు వేస్తారు అన్న ప్రచారం అయితే సాగుతోంది. మరి అతి కీలకమైన మీటింగునకు అది కూడా అధికారిక హోదాలో హాజరవుతున్న అమిత్ షా ఏపీ రాజకీయ నేతలకు వరస అపాయింట్మెంట్ ఇచ్చే తీరిక ఉంటుందా. అసలు ఆయనకు ఆ కోరిక ఉందా అన్న చర్చ అయితే సాగుతోంది. ఏది ఏమైనా చాలా కాలానికి ఏపీకి షా రావడం, రెండు బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య వార్ సాగుతున్న నేపధ్యంలో టూర్ చేయడం చూస్తే మాత్రం కచ్చితంగా ఏపీ బీజేపీకి దిశా నిర్దేశం చేసే విధంగానే ఉంటుంది అంటున్నారు.