Begin typing your search above and press return to search.

పరీక్షల రీషెడ్యూల్ పై నోరు మెదపని ఏపీపీఎస్సీ!

By:  Tupaki Desk   |   25 Oct 2019 11:01 AM GMT
పరీక్షల రీషెడ్యూల్ పై నోరు మెదపని ఏపీపీఎస్సీ!
X
ఏపీపీఎస్సీ ఒక రాజ్యాంగ బద్దమైన స్వతంత్ర్య వ్యవస్థ. దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం, ఆదేశాలు ఇవ్వడానికి వీల్లేదు. ఈ ఆయాచిత అధికారమే ఆ సంస్థ దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నియామకమైన సభ్యుల అండతో ఏపీపీఎస్సీ లో నిర్లక్ష్యం మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతూనే ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

ఇటీవల జరిగిన గ్రామ సచివాలయ, వార్డు పరీక్షల లీకేజీ వ్యవహారంలో కూడా ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఎపీపీఎస్సీ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు తెలిసింది. త్వరలో జరగాల్సిన మెయిన్స్ పరీక్షల ప్రశ్న పత్రాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషన్ భావిస్తోంది. లీకేజీ భయంతోనే ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

2018లో విడుదలైన పలు నోటిఫికేషన్లకు పరీక్షల ప్రశ్నపత్రాల సెట్టింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. అయితే సచివాలయ పరీక్షల ప్రశ్నపత్రం ఉదంతం బయటకు రావడంతో ఇప్పుడు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడమా.? వాయిదా వేయడమా? రీషెడ్యూల్ చేయడమా అన్నది ఏపీపీఎస్సీ నిర్ణయించలేకపోతోంది. కమిషన్ కు, సిబ్బందికి మధ్య సమన్వయం లేకపోవడం వల్ల భర్తీ సవ్యంగా జరగడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. సిబ్బంది అక్రమాల వల్లే ఇలా లీకులు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి.

ఏపీపీఎస్సీ వ్యవహారశైలి కారణంగా పలువురు అభ్యర్థులు కోర్టుకు ఎక్కుతున్నారు. ఉద్యోగాలకు విద్యార్హత విషయంలో కొంత గందరగోళం నెలకొంది. ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ తప్పులు, ఒప్పులపై ఏపీపీఎస్సీ నిర్లక్ష్యం చేసినా వారిపై చర్యలు తీసుకునే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో ఏపీపీఎస్సీ వ్యవహారశైలి..అందులో పనిచేసే సిబ్బంది చేసే ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వారిలో నెలకొంది. ఇప్పటికైనా ఏపీపీఎస్సీ పనితీరు మార్చుకోవాలనే డిమాండ్ నిరుద్యోగుల నుంచి వినిపిస్తోంది.