Begin typing your search above and press return to search.

ఏపీ అప్పులు 8 ల‌క్ష‌ల కోట్ల అంట‌!

By:  Tupaki Desk   |   22 July 2022 4:27 AM GMT
ఏపీ అప్పులు 8 ల‌క్ష‌ల కోట్ల అంట‌!
X
శ్రీలంక ఆర్థిక సంక్షోభంతో మ‌న‌దేశంలోనూ వివిధ రాష్ట్రాలు ఎడాపెడా చేస్తున్న అప్పుల‌పై దేశ స్థాయిలో భారీ చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పులు ఎక్కువ‌గా చేస్తోందని ప్ర‌తిప‌క్షాలు తీవ్ర విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. అలాగే కొన్ని ప‌త్రిక‌లు, టీవీ చానెళ్లు సైతం వీటిపై ప్ర‌త్యేక క‌థ‌నాలు ఇస్తున్నాయి. తాజాగా శ్రీలంక సంక్షోభం నేప‌థ్యంలో కేంద్ర ప్ర‌భుత్వం కూడా ఆయా రాష్ట్రాల అప్పుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింద‌ని.. అప్పులు ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రాల‌ను హెచ్చ‌రించింద‌ని వార్త‌లు వ‌చ్చాయి.

రెండు రోజుల క్రితం ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వం అఖిల ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ స‌మావేశానికి రెండు తెలుగు రాష్ట్రాల ఎంపీల‌తోపాటు వివిధ రాష్ట్రాల ప్ర‌జాప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఏపీ అప్పుల ఊబిలో చిక్కుకుంద‌ని కేంద్రం హెచ్చ‌రించిన‌ట్టు వార్తా క‌థ‌నాలు వ‌చ్చాయి. అంతేకాకుండా రాష్ట్ర వాస్త‌వ ఆదాయ‌న్ని మించిపోయి అప్పులు ఉన్నాయ‌ని.. ఈ అప్పులును తీర్చ‌డానికి కూడా మ‌ళ్లీ అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి ఉంద‌ని కేంద్రం హెచ్చ‌రించింద‌ని అంటున్నారు.

కాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ అప్పులు మొత్తం రూ.8 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరాయ‌ని చెబుతున్నారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం చూపుతున్న‌ అప్పుల అసలు లెక్కలకు, కేంద్రం పేర్కొన్న లెక్కలకు పొంతనే కుద‌ర‌డం లేద‌ని అంటున్నారు. ఏటా రాష్ట్ర జీఎస్‌డీపీలో అప్పులు 4%కు మించకూడదని ఆర్థిక సంఘం నిర్దేశించింద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. అన్ని అప్పులనూ కలిపి లెక్కిస్తే గుండె గుభేలుమంటుందని వారంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లెక్కకు మించి అప్పులు చేస్తోందని, అప్పు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌) ఇప్పటికే హెచ్చరించింద‌ని గుర్తు చేస్తున్నారు.

ఢిల్లీలో జ‌రిగిన అఖిల‌ప‌క్ష స‌మావేశంలో ఏపీ అప్పు రమారమి రూ.4.25 లక్షల కోట్లుగా పేర్కొన్నట్లు కొందరు చెబుతున్నారు. కానీ వాస్తవ లెక్కలు ఇంతకంటే చాలా ఎక్కువని అంటున్నారు. జ‌గ‌న్ ప్రభుత్వం బడ్జెట్‌లో చూపకుండా ఈ మూడేళ్లలో చేసిన అప్పు రూ.28,837 కోట్లు అని కేంద్రం తన ప్రజంటేషన్‌లో పేర్కొంద‌ని చెబుతున్నారు. 2019-20 నుంచి 2021-22 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా కేంద్రం ఈ లెక్కలను చూపింద‌ని అంటున్నారు.

2022-23 ఆర్థిక సంవత్సరం చివరినాటికి మొత్తం అప్పు రూ.4,39,394 కోట్లకు చేరుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వం అంచనా. నిజానికి 2021-22 ఆర్థిక సంవత్సరం చివరికే రాష్ట్రం అప్పు ఎంతో భారంతో ఉంద‌ని నిపుణులు చెబుతున్నారు. ఇందులో బ‌హిరంగ రుణాలు రూ.4,13,000 కోట్లు, రాష్ట్ర కార్పొరేష‌న్ల అప్పు రూ.1,38,603 కోట్లు, స్టేట్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీస్ కార్పొరేష‌న్ అప్పులు రూ.10 వేల కోట్లు, నాన్ గ్యారెంటీ రుణాలు రూ.77,233 కోట్లు ఉన్నాయంటున్నారు. అలాగే గ‌త మూడేళ్ల‌లో చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు రూ.1.50 ల‌క్ష‌ల కోట్లు చెల్లించాల్సి ఉంద‌ని చెబుతున్నారు. ఈ మొత్తం క‌లిపితే 7,88,836 కోట్లు అవుతాయ‌ని నిపుణులు ఢంకా బ‌జాయించి చెబుతున్నారు. వీటికి ఈ ఆర్థిక సంవత్స‌రం (2022-23)లో నాలుగు నెల‌ల్లో చేసిన అప్పుల‌ను క‌ల‌పాల్సి ఉంద‌ని అంటున్నారు.

అలాగే కేంద్రం చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం.. బడ్జెటేతర రుణాలను బట్టి.. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడోస్థానంలో ఉన్నట్లు తేల్చింద‌ని చెబుతున్నారు. జీఎస్‌డీపీలో బడ్జెట్‌లో చూపని రుణాలు సుమారు 2.5% ఉన్నట్లు పేర్కొంద‌ని స‌మాచారం. వాస్తవానికి రుణాల మొత్తం రాష్ట్ర స్థూల త‌ల‌స‌రి ఆదాయం (జీఎస్‌డీపీ)లో 4% దాటకూడదంటున్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ బడ్జెటేతర రుణాలు అంతకుమించి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా దాదాపు రూ.23,000 కోట్ల రుణం ఈ మూడేళ్లలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం తీసుకుంద‌ని అంటున్నారు. ఇవికాకుండా గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు రూ.70వేల కోట్ల వరకు ఉన్నాయని అంచనా. ఇలా బడ్జెట్‌లో చూపని రుణాలు రూ.లక్ష కోట్ల పైమాటేనన్నది ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అలాగే బడ్జెట్‌లో చూపకుండా రుణం పొంది తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే ఏటా వడ్డీలు, అసలు రూపంలో చెల్లిస్తున్న మొత్తం రూ.15వేల కోట్లు ఉంటుందని అంటున్నారు. దీనికి ఇంకా నాన్‌ గ్యారంటీ రుణాలు కలపాల్సి ఉంద‌ని చెబుతున్నారు.

అలాగే మద్యం డిపోల ఆదాయాన్ని ప్రభుత్వం ఎస్క్రో చేసి ఏపీఎస్‌డీసీ ద్వారా దాదాపు రూ.23వేల కోట్ల రుణం తీసుకుంద‌ని అంటున్నారు. అయితే దీన్ని రాష్ట్రప్రభుత్వ అప్పుగా చూపించడం లేద‌ని చెబుతున్నారు. తాజాగా బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రూ.8,300 కోట్ల రుణం తీసుకుంద‌ని పేర్కొంటున్నారు.