Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో : ఆర్టీసీ సిబ్బంది రోడ్లు వేసుకోవాల్సిందేనా?

By:  Tupaki Desk   |   3 Oct 2022 4:04 PM GMT
వైరల్ వీడియో : ఆర్టీసీ సిబ్బంది రోడ్లు వేసుకోవాల్సిందేనా?
X
ఏపీలో పాలన అద్భుతంగా ఉందని వైసీపీ నేతలు పదే పదే చెబుతూ ఉంటారు. కానీ అయ్యవారి అందం అద్దంలో కనిపిస్తుంది అన్న ముతక సామెత మాదిరిగా ఏపీ అభివృద్ధి అంతా పాడై దరిద్రంగా ఎక్కడికక్కడ కనిపించే రోడ్లే చక్కగా చెబుతాయి అని అంటున్నారు.

ఏపీలో రోడ్లను వాటి అద్వాన్న స్థితి గురించి విపక్షాలు విమర్శలు చేసి విసిగి వేసారి అలసిపోయారు. అయినా కూడా సర్కార్ లో చలనం లేదు అని అంటున్నారు. అదిగో ఇదిగో అంటూ గత మూడేళ్ళుగా కాలం గడిపేశారు. అపుడెప్పుడో రోడ్లు బాగాలేవు ఏలిన వారూ అంటే కరోనా ఉంది ఇపుడు ఎలా బాగు చేస్తామని ఎదురు దాడి చేసి నోళ్ళు మూయించేశారు.

ఆ తరువాత చూస్తే కరోనా శాంతించింది కానీ భారీ వర్షాలు వరదలు అంటూ చెబుతూ వచ్చారు. వర్షాకలం వస్తే వానలు పడడం సాధారణం. మరి ఎండాకాలం ఏం చేస్తున్నారు అంటే అపుడు బడ్జెట్ లో డబ్బులు అని చూపిస్తారు. తీరా వర్క్ స్టార్ట్ అంటారు వానలు వచ్చేస్తాయి. మరి ఇలాగైతే ఏపీ రోడ్లు బాగు అయ్యేదెలా సారూ అంటే మీ తిప్పలేవో మీరు పడండని చెప్పకుండానే పెద్దలు చెబుతున్నారు.

ఇదేంటి అని అంటే మేము బడ్జెట్ లో డబ్బులు ఎపుడో వేశాం కదా మా చిత్తశుద్ధి చూశారు కదా అని మళ్లీ మాటలతో మహ బాగా చెబుతున్నారు. మేమేం చేస్తాం వరుణుడు మా ఫ్రెండ్ అందుకే వానలు పడుతున్నాయని కామెడీ కూడా పండిస్తున్నారు. ఇలా అయితే ఎలా అంటో చివరికి ఎవరికి వారు అంటే మరీ దారుణంగా రోడ్లు కొట్టుకుపోయిన చోట శ్రమదానం చేసి రోడ్ల గోతులు వారే పూడ్చుకుంటున్నారు.

ఇపుడు అలాంటి శ్రమదానం పని ఆర్టీసీ సిబ్బంది చేయడం, దాన్ని వీడియోగా పెట్టి సోషల్ మీడియాలో తెగ వైరల్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలోని నర్శీపట్నం నియోజకవర్గం నాతవరం నుంచి తాండవ మధ్య రోడ్డు పూర్తిగా పాడైపోయింది. కానీ పల్లె వెలుగు బస్సు అటూ ఇటూ తిరగాలి కదా. దాంతో ఆ వైపుగా బస్సుని నడిపే ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్ ఇద్దరూ బస్సుని ఆపేసి మరీ రోడ్డుని వేసే పనికి ఉపక్రమించారు.

బండలను తెచ్చి మరీ అక్కడ రోడ్డును కలుపుతూ లెవెల్ చేశారు. అతి చిన్న దారి సన్నని మార్గంలో ఇంత రాయీ తట్టెడు మట్టి, సిమెంట్ వేస్తే రోడ్డు ఎంతో కొంత బాగు అవుతుంది. కానీ దాన్ని కూడా చేపట్టలేక చతికిలపడిన అధికార పార్టీ నాయకుల మీద నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇక ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్టింగ్ చేసిన బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అయితే ఇదీ రోడ్ల దారుణ పరిస్థితి. సీఎమె గారూ చూస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకం వల్లనే ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు స్వయంగా రోడ్లు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది అని ఆయన ట్వీట్ లో ఘాటుగానే విమర్శించారు. మీ పరిపాలన వల్లనే ప్రజలు అంతా ఇలాంటి కష్టాలు పడుతున్నారని మాధవ్ హాట్ కామెంట్స్ చేశారు. దీనికి మరి వైసీపీ నేతలు ఎలా కౌంటర్ ఇచ్చి తమను తాము డిఫెన్స్ చేసుకుంటారో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.