Begin typing your search above and press return to search.

APSRTC : పెరుగుతున్న ప్రైవేటు వాటా

By:  Tupaki Desk   |   4 May 2022 12:30 PM GMT
APSRTC : పెరుగుతున్న ప్రైవేటు వాటా
X
ఏపీ ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల వాటా పెరిగిపోతోందా ? ప్రభుత్వం తాజా చర్యలు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. సంస్ధకు అవసరమైన కొత్త బస్సుల కొనుగోలులో 998 బస్సులకు టెండర్ల దాఖలు చేసింది ప్రభుత్వం. టెండర్ల దాఖలకు ఈనెల 5వ తేదీ గడువు. మొత్తం బస్సులను అద్దె ప్రాతిపదికగా తీసుకోవటానికి మాత్రమే ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీంతో ప్రభుత్వం బస్సులను సమకూర్చుకోవటం మానేసి అద్దె బస్సులను ఏర్పాటు చేసుకోవటానికి మాత్రమే మొగ్గు చూపుతున్నది.

ప్రస్తుతం సంస్ధలో 11,236 బస్సులున్నాయి. వీటిల్లో సొంత బస్సులు 8972 బస్సులు కాగా ప్రైవేటు వ్యక్తుల నుండి అద్దెకు తీసుకున్నవి 2264. సొంత బస్సుల్లో సుమారు 3 వేల బస్సులకు కాలం తీరిపోయాయి.

వీటి స్థానంలో కొత్త బస్సులను సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. సొంతంగా బస్సులను సమకూర్చుకునే బదులు అద్దె బస్సులను తీసుకోవటానికే ప్రభుత్వం ప్రాధాన్యతిస్తోంది. అందుకనే అద్దె బస్సుల కోసం టెండర్లు పిలిచింది.

జిల్లాల నుంచి తెప్పించుకున్న నివేదిక ప్రకారం అర్జంటుగా 1633 బస్సులు అవసరమని తేలింది. అందుకనే ప్రభుత్వం కూడా అర్జంటుగా 998 కొత్త బస్సులు కావాలంటు టెండర్లలో స్పష్టం చేసింది.

రేపు అంటే గురువారం టెండర్లు ఓపెన్ చేసి మళ్ళీ 10, 11 తేదీల్లో రివర్స్ టెండర్లకు వేలం వేసి కిలోమీటరుకు ఎంత చెల్లించాలనే విషయాన్ని ఫైనల్ చేస్తుంది. ఇప్పటికే 100 విద్యుత్ ఏసీ బస్సులకు ఆర్డర్ కూడా ఇచ్చేసింది. అవి తొందరలోనే రాబోతున్నాయి.

ఏపీఎస్ ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల వాటా 25 శాతానికి మించి ఉండకూడదనే నిబంధనుంది. అయితే ఆ ప్రైవేటు వాటాను 35 శాతానికి పెంచుకుంటు నిబంధనను సవరించారు. కొత్త బస్సులు వచ్చినపుడు అందుకు అవసరమైన ఉద్యోగుల భర్తీ లేకుండా ఉన్న వారితోనే సర్దుబాటు చేయాలని కూడా ప్రభుత్వం డిసైడ్ చేసింది.

కొత్త బస్సులను ప్రైవేటు నుండి తీసుకోబోతున్న కారణంగా వాటకి అవసరమైన డ్రైవర్లను కూడా ప్రైవేటు వారినే నియమించుకునే అవకాశముంది. బస్సులు వచ్చిన తర్వాత వాటికి అవసరమైన డ్రైవర్ల విషయంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.