Begin typing your search above and press return to search.

వామ్మో.. అరకు ఎంపీ అంతపని చేశారా?

By:  Tupaki Desk   |   17 Sep 2016 8:06 AM GMT
వామ్మో.. అరకు ఎంపీ అంతపని చేశారా?
X
ఈ వారంలోనే అరకు ఎంపీ కొత్తపల్లి గీత మీడియాతో మాట్లాడారు. తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన ఆస్తిని తెలంగాణ రాష్ట్ర అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఆమె మండిపడ్డారు. ఈ ఉదంతం మీద గవర్నర్ నరసింహన్ కు.. కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. సాదాసీదా మనుషులకే ఎంతోకొంత పలుకుబడి ఉన్న వేళ.. ఎంపీ స్థాయి నేత ఆస్తుల్ని కొంత మంది అధికారులు స్వాధీనం చేసుకునేంత ధైర్యం చేస్తారా? అన్నదో సందేహం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సంగతులు తెర మీదకు వచ్చాయి. ఎంపీ కొత్తపల్లి సామాన్యమైన వ్యక్తి కాదని.. ఆమె చేసిన మాయాజాలంతో భారీ ఎత్తున భూమిని సొంతం చేసుకున్నారన్న నిర్ధారణకు రావటం ఇప్పుడు సంచలనంగా మారింది.

ఒకపక్క తమ జీవితాంతం సంపాదించిన ఆస్తిని తెలంగాణ అధికారులు స్వాధీనం చేసుకున్నారని ఎంపీ వాపోతుంటే.. మరోవైపు.. అలాంటిదేమీ లేదు ఎంపీగారి భూమి వివాదంలో లెక్కలు చాలానే ఉన్నాయని.. ప్రస్తుతం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి విలువ ఏకంగా రూ.5వేల కోట్ల పైచిలుకు ఉంటుందన్న కొత్త విషయం హాట్ టాపిక్ గా మారింది.

కొత్తపల్లి గీత డిప్యూటీ కలెక్టరుగా ఉన్నప్పుడు సీలింగ్.. పట్టా భూమికి ఎసరుపెట్టి.. దొంగపత్రాలు.. కంపెనీల పేరిట మాయ చేశారని.. ఇందులో భాగంగా బ్యాంకుకు సైతం రూ.25కోట్లు టోకరా ఇచ్చారన్న కొత్త విషయం బయటకు వచ్చింది. అధికారులు నిర్దారించిన ఈ భారీ కుట్ర ఎలా జరిగింది? ఏం చేశారు? ఇందులో ఎంపీ కొత్తపల్లి గీత పాత్రేమిటి? లాంటి విషయాల్లోకి వెళితే..

హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హైటెక్ సిటీకి అతి సమీపంలోని 525 ఎకరాల భూమి ఉంది. పాత ముంబయి హైవేను ఆనుకొని ఉన్న ఈ భూమి ఎకరా ధర రూ.50 కోట్ల పైమాటే. ఈ 525 ఎకరాల్లో ప్రభుత్వ.. యూఎల్ సీ.. పట్టా ఇలా అన్ని రకాల భూములు ఉన్నాయి. ఇదొక పార్శం. ఇక్కడో మరో పార్శం ఉంది. అది.. ఇప్పటి అరకు ఎంపీ కొత్తపల్లి గీత గతంలో డిప్యూటీ కలెక్టరుగా పని చేసే వారు. అప్పట్లో నకిలీ స్టాంప్ పేపర్లతో దొంగ పత్రాలు సృష్టించి.. తనకున్న అవకాశాన్ని ఉపయోగించి యూఎల్ సీ.. పట్టా భూములను కొత్త పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించారు. అది ఎంతలా అంటే.. ఒక్కరోజులో తన భర్త పి. రామకోటేశ్వరరావుకు ఒక్కరోజులో 99.07 ఎకరాల భూమిని కట్టబెట్టేశారు. పేపర్లు సిద్ధం చేసేసి.. విలువైన భూమికి హక్కుదారులైపోయారు.

ఇక్కడితో కథ ఆగలేదు. 8 కంపెనీల్ని సృష్టించి వాటి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. వాటిని చూపించి పంజాబ్ నేషనల్ బ్యాంకులో రూ.25కోట్ల రుణం తీసుకున్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలోనూ.. భూమికి సంబంధించిన వచ్చిన ఆరోపణలతో ఈ వ్యవహారంలోకి సీబీఐ ఎంటరైంది. బ్యాంకులో తీసుకున్న రూ.25 కోట్లతో ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకపోవటమే కాదు.. ఆ భూములకు సంబంధించిన సేల్ డీడ్ కూడా మోసపూరితమన్న విషయాన్ని గుర్తించింది. ఎంపీపై చార్జిషీటు దాఖలు చేసింది.

ఇదే అంశంపై గతంలోనూ సీఐడీ విచారణ జరిపింది. రిజిస్ట్రేషన్ పత్రాల్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. అక్కడవి నకిలీ పత్రాలన్న విషయం బయటకు వచ్చింది. ఇదే అంశంపై రిజిస్ట్రేషన్ శాఖ సైతం విచారణ జరిపి.. డ్యాకుమెంట్లను రద్దు చేయాలంటూ గతంలో ఈ ఉదంతంపై విచారణ జరిపిన అధికారి పది పేజీల నివేదిక ఇవ్వటం గమనార్హం. ఇంత జరిగిన తర్వాత కూడా కొత్తపల్లి గీత మాత్రం వివాదాస్పదమైన 99 ఎకరాల భూమి తమకు చెందినదేనని వాదించటం గమనార్హం. ఈ కేసును తాను సుప్రీంకోర్టులో గెలిచినట్లుగా ఆమె చెబుతున్నారు. అయితే.. సుప్రీంలో గెలిచినకేసు ఈ వివాదానికి సంబంధించింది కాదని.. వేరే అంశానికి సంబంధించిందిగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ భూమి ప్రభుత్వానికి చెందినదంటూ రెవెన్యూ అధికారులు బోర్డులు పాతారు. ఈ సందర్భంలోనే ఎంపీ కొత్తపల్లి తెలంగాణ అధికారులపై నిప్పులు చెరిగారు.

ఇలా అత్యంత విలువైన భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించిన మొత్తం వ్యవహారం నకిలీ కావటం ఒక ఎత్తు అయితే.. చివరకు ఈ వ్యవహారంలో వినియోగించిన రూ.5 నాన్ జ్యూడీషియల్ స్టాంపు పేపరు సైతం నకిలీదని తేల్చారు. దీన్ని రిజిస్ట్రార్ ఆఫీసులో అమ్మలేదని కూడా తేలింది. మరింత దారుణమైన విషయం ఏమిటంటే ఈ భూమి రిజిస్ట్రేషన్ జరిగిన 1982 ఫిబ్రవరి – మార్చిల మధ్య విక్రయించిన స్టాంప్ పేపర్ల సీరియల్ నెంబర్లు 1892 – 1957 మధ్య ఉంటే.. కొత్తపల్లి భూమికి సంబంధించిన డ్యాకుమెంట్ పేపర్ సీరియల్ నెంబరు 33416గా ఉడటం విశేషం. కొత్తపల్లి భర్తకు చెందిన99.07 ఎకరాల భూమికి స్వర్గీయ రుక్ముద్దీన్ అహ్మద్ కుమారుడు అహ్మద్ అబ్దుల్ అజీజ్ పట్టాదారుగా ఉన్నారు. ఎప్పుడూ కూడా ఈ భూమి పీఆర్ కే రావు.. కొత్తపల్లి గీతల స్వాధీనంలో లేవన్న విషయాన్ని అధికారులు గుర్తించారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఎంపీ కొత్తపల్లి పేరిట రెండు పాన్ కార్డులు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఎవరికైనా ఒక్కటే ఉండాల్సిన పాన్ కార్డు కొత్తపల్లికి మాత్రం రెండు ఉండటం గమనార్హం. విశ్వేశ్వర ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ డైరెక్టర్ మోదాలో 2008లో ఆమె చేయించుకున్న భూమి రిజిస్ట్రేషన్ ప్రకారం సేల్ డీడ్ లో కొత్తపల్లి గీత పాన్ కార్డును ‘‘ఏఎల్ పీపీ2599క్యూ’’గా చూపించారు. అందుకు భిన్నంగా తన ఐటీ రిటర్న్స్ లో మాత్రం పాన్ కార్డు నెంబరును ‘‘ఏఆర్ టీపీజీ 1248జీ’’ చూపించటం గమనార్హం. ఇలా తప్పుల మీద తప్పులు చేసిన కొత్తపల్లి ఉదంతం ఇప్పుడు రాజకీయ వర్గాలోనే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన పరిస్థితి.