Begin typing your search above and press return to search.

వికెట్ 16 కూడా పడిపోయింది జగన్ బాబు

By:  Tupaki Desk   |   28 April 2016 10:31 AM GMT
వికెట్ 16 కూడా పడిపోయింది జగన్ బాబు
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెరువుకు గండి పడింది. ఇప్పుడా చెరువులో జగన్ అనే ఒకే చుక్క మిగులుతుంది’’ అంటూ ఆసక్తికరమైన పోలిక పోలుస్తూ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ఒక్కరే కాదు.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు లోకేశ్ సైతం.. జగన్ పార్టీ మొత్తం ఖాళీ కావటం ఖాయమని తేల్చి చెబుతున్నారు. దీనికి తగ్గట్లే తాజా పరిణామాలు చోటు చేసుకోవటం కనిపిస్తుంది.

మొన్నటి వరకూ 13 మంది జగన్ ఎమ్మెల్యేలు జంప్ కావటం తెలిసిందే. గురువారం మధ్యాహ్నానానికి ఈ సంఖ్య కాస్తా 16కు చేరుకోవటం గమనార్హం. మంచి రోజులు 29 వరకు మాత్రమే ఉండటం.. ఆ తర్వాత మంచి రోజులు లేకపోవటంతో.. నమ్మకాలకు పెద్ద పీట వేసే రాజకీయ నేతలు.. తమ జంపింగ్స్ కు మంచి టైమ్ ను చూసుకున్నట్లుగా చెప్పొచ్చు. ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తూ కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వ్యవహారమే తీసుకుంటే.. మంచి రోజు అని తేలటంతో ఈ ఉదయం హడావుడిగా వచ్చి చంద్రబాబు చేతుల మీద మెడలో పార్టీ కండువా వేయించుకొన్నారు. పార్టీలోకి అధికారికంగా తర్వాత మారనున్నట్లు వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. తాజాగా విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు సైతం టీడీపీలో చేరిపోయారు. తన మద్దతుదారులతో కలిసి విజయవాడ వచ్చిన ఆయన.. ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా ఆయన మెడలో పార్టీ కండువా కప్పిన చంద్రబాబు.. ఆయన్ను.. ఆయన వెంట వచ్చిన నేతల మెడలో పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కిడారి ఎంట్రీతో టీడీపీలోకి చేరిన జగన్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 16కు చేరుకున్నట్లైంది. ఒకదాని వెంట ఒకటి చొప్పున పడిపోతున్న వికెట్ల గురించిన సమాచారంతో జగన్ ఎలా ఉన్నారో..?