Begin typing your search above and press return to search.

'అన్నా చెల్లెళ్లు బీజేపీని వదిలి మా మీద పడ్డారేంటి'

By:  Tupaki Desk   |   8 May 2019 2:30 PM GMT
అన్నా చెల్లెళ్లు బీజేపీని వదిలి మా మీద పడ్డారేంటి
X
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ - ఆయన చెల్లెలు - ఆ పార్టీ ముఖ్య నేత ప్రియాంక వాద్రాల మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు ఢిల్లీ ముఖ్యమంత్రి - ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలో రాహుల్ గాంధీ - ప్రియాంకలు పనిగట్టుకుని ప్రచారం చేస్తుండటం పట్ల కేజ్రీవాల్ అసంతృప్తితో ఉన్నాడు. ఈ విషయంలో ఆయన ఓపెన్ గానే అసహనం వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను ఓడించాలంటూ కాంగ్రెస్ ముఖ్య నేతలు ప్రచారం చేస్తూ ఉన్నారు. అక్కడ బీజేపీ - కాంగ్రెస్ - ఆప్ ల మధ్యన త్రిముఖ పోరు నెలకొంది. ఒకప్పుడు తమకు అనుకూల ప్రాంతం అయిన ఢిల్లీలో పట్టు మళ్లీ సాధించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇప్పటికే ఢిల్లీలో తిరుగులేని శక్తిగా ఉన్న ఆప్.. కాంగ్రెస్ తీరుపై మండి పడుతూ ఉంది.

వాస్తవానికి ఈ ఇరు పక్షాలూ బీజేపీ వ్యతిరేకత అనే ఆయుధంతో ఏకం కావాలని చూశాయి. పొత్తుకు రెడీ అనుకున్నాయి. అయితే ఎవరికి వారు గొంతెమ్మ కోరికలతో వీరి పొత్తు పొడవలేదు. ఆ విషయంలో రాహుల్ గాంధీ - కేజ్రీవాల్ లు ట్విటర్ వేదికగా బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు.

ఇక ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ప్రచారం వల్ల ఆప్ అభ్యర్థులు ఓడిపోయే అవకాశం ఉందని కేజ్రీవాల్ అంటున్నారు. 'కాంగ్రెస్ వాళ్లు ఏ మధ్య ప్రదేశ్ మీదో - రాజస్తాన్ మీదో కాన్సన్ ట్రేట్ చేయాలి, కానీ ఇలా ఢిల్లీ మీద పడటం ఏమిటి?' అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఎన్నికల పోరు సాగుతూ ఉందని, రాహుల్ - ప్రియాంకలు ఆ రాష్ట్రాల మీద దృష్టి సారించి బీజేపీని ఓడించాలని.. ఇలా ఆప్ ను ఓడించేందుకు రావడం ఏమిటని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ మాత్రం కేజ్రీవాల్ మాటలను పట్టించుకోవడం లేదు!