Begin typing your search above and press return to search.

పలువురు సీఎంలకు షాకిచ్చేలా ఢిల్లీ సీఎం వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   15 July 2020 2:30 PM GMT
పలువురు సీఎంలకు షాకిచ్చేలా ఢిల్లీ సీఎం వ్యాఖ్యలు
X
దేశంలో చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నప్పటికి కొందరు సీఎంలకున్న ఇమేజ్ భిన్నం. అలాంటి కోవలోకే వస్తారు ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్. చాలా రాష్ట్రాల్లోని సీఎంలతో పోలిస్తే.. ఆయనకున్న అధికారాల పరిధి తక్కువనే చెప్పాలి. రాష్ట్రానికి సీఎం అయినా.. చాలా సందర్భాల్లో ఆయన మాటకు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉంటుంది. ఢిల్లీ రాష్ట్రానికున్న విలక్షణతే దీనికి కారణం. అందుకే అటు కేంద్రంలోనూ..ఇటుఢిల్లీ రాష్ట్రంలోనూ ఒకే పార్టీ ప్రభుత్వాలు ఉంటే ఓకే కానీ లేకుండా మాత్రం నిత్యం తలనొప్పులు తప్పవు.

ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి పడిన కరోనాకు ఢిల్లీలోని కేజ్రీసర్కారు కిందామీదా పడిన పరిస్థితి. దేశ రాజధాని నగరానికి రాష్ట్ర ప్రభుత్వంగా ఉంటూ ఇతర మెట్రో నగరాల మాదిరి చెలరేగిపోయిన వైరస్ కేసుల్ని కంట్రోల్ చేసే విషయంలో తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంది కేజ్రీ ప్రభుత్వం. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకప్పుడు దేశంలో అత్యధిక కేసులు నమోదయ్యే నగరాల్లో ఢిల్లీ పేరు ప్రధానంగా వినిపించేది. ఒక అంచనా ప్రకారం జులై 15 నాటికి ఢిల్లీలో 2.25 లక్షల కేసులు నమోదవుతాయని భావించారు.

కానీ.. దాన్ని 1.15 లక్షలకే పరిమితం చేయటంలో కేజ్రీసర్కారు కీలకమని చెప్పాలి. కేసుల్ని కంట్రోల్ చేయటంలో కీలకభూమిక తమది మాత్రమే కాదన్న విషయాన్ని చెప్పటంతో పాటు.. అటు కేంద్రం.. స్వచ్చంద సంస్థలు.. ప్రజలు అందరి భాగస్వామ్యంతోనే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటే కరోనాను ఎదుర్కోవటం సాధ్యం కాదని తేల్చారు. అంతేకాదు.. విపక్షాలైన బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలతో పాటు రాజధానిలోని అందరికి తమ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలిపిన కేజ్రీవాల్.. అందరి మనసుల్ని దోచేశారు.

జూన్ ఒకటో తేదీ నాటికి ఢిల్లీలో కేవలం 4100 పడకలు మాత్రమే ఉండేవిన.. అది కాస్తా ఇప్పుడు 15,500 పడకల్ని అందుబాటులోకి తెచ్చామన్న ఆయన.. 2100 ఐసీయూ పడకల్ని కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రస్తుతం 1100 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని చెప్పటం ద్వారా రోగ తీవ్రత ఎక్కువగా ఉన్నకేసులు తగ్గాయన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారన్నారు. కేజ్రీవాల్ మాటల్ని విన్నప్పుడు విపత్తు వేళలో అధికారపక్షం ఎలా ఉండాలన్న విషయాన్ని చెప్పకనే చెప్పిందని చెప్పాలి. చాలా రాష్ట్రాల్లో మాదిరి కేంద్రం మీద రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు సంధించటం.. విపక్షాలు అధికారపక్షంపై విరుచుకుపడటం లాంటివి కాకుండా.. అందరిని కలుపుకుపోయే లక్షణం అధికార పార్టీలో ఉంటేనే సాధ్యమన్నది మర్చిపోకూడదు. కేజ్రీవాల్ తీరును దేశంలోని చాలామంది ముఖ్యమంత్రులు అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది.