Begin typing your search above and press return to search.

ఏమాటకు ఆ మాటే ఆ సీఎం దమ్మున్నోడు

By:  Tupaki Desk   |   12 Jan 2016 4:46 AM GMT
ఏమాటకు ఆ మాటే ఆ సీఎం దమ్మున్నోడు
X
తాను సీఎం అయినా సామాన్యుడిలా ఫీలయ్యే వారిలో ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముందుంటారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా.. ఎంతటి సంచలన నిర్ణయాల్ని అయినా తీసుకునేందుకు వెనుకాడని మొండిఘటం. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో.. మాటలతో కాకుండా చేతలతో తానేంటో రుజువు చేసుకున్నారు. సరి.. బేసి అంటూ సరికొత్త విధానానికి తెర తీసిన ఆయన.. తాజాగా ఢిల్లీ ప్రైవేట్ స్కూళ్ల దందాను చెక్ పెట్టే ఆలోచనను ఆవిష్కరించారు.

ఢిల్లీలోని ప్రైవేటు స్కూళ్లు తమ ఆడ్మిషన్లు అన్నీ ఆన్ లైన్ లోనే చేయాలంటూ కేజ్రీ సర్కారు తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో.. ప్రముఖులు.. సంపన్నులకు మాత్రమే సొంతమయ్యే స్కూల్ సీట్లకు ఇప్పుడు చెక్ పడనుంది. ఇప్పటివరకూ మేనేజ్ మెంట్ కోటా అంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు స్కూళ్ల తీరుపై కొరడా విదిల్చిన కేజ్రీ సర్కారు నిర్ణయంతో.. ప్రతి ప్రైవేటు స్కూల్ 25 శాతం మేర ఆర్థికంగా బలహీన వర్గాలకు కేటాయించాల్సి వస్తుంది.

అదే సమయంలో ఆడ్మిషన్లు పారదర్శకంగా సాగేందుకు వీలు కల్పించనుంది. కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న తాజా నిర్ణయంతో దాదాపు 50 శాతం సీట్లు అదనంగా సామాన్యులకు లభించే అవకాశం ఉందని.. ఆన్ లైన్ పుణ్యమా అని రాజకీయంగానూ.. ఆర్థికంగా శక్తివంతులైన వారికి ఎలాంటి ప్రత్యేకత ఉండదు. అందరి మాదిరే వీరు సైతం స్కూల్ ఆడ్మిషన్ల కోసం ఆన్ లైన్ పద్దతినే అనుసరించి ఉండాలి. సామాన్యుడి సర్కారుతో వీపీఐపీలకు చాలానే చిక్కులు ఎదురవుతున్నాయి.