Begin typing your search above and press return to search.

నాటి సన్నిహితుడ్ని జైలుకెళ్లమంటున్న సీఎం?

By:  Tupaki Desk   |   23 Sep 2015 9:20 AM GMT
నాటి సన్నిహితుడ్ని జైలుకెళ్లమంటున్న సీఎం?
X
అమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు కాలం కలిసి రావటం లేదు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. తాడు పామైనట్లుగా అవుతున్న పరిస్థితి. ఇవి చాలవన్నట్లుగా ఒకనాటి ఆయన సన్నిహితులకు సంబంధించిన వివాదాస్పద అంశాలు ఆయన్ను మరింత చిరాకు పెట్టిస్తున్నాయి.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు.. ఆ పార్టీ మాజీ న్యాయశాఖామంత్రి సోమనాథ్ భారతీకి మధ్యనున్న సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన విద్యార్హతలకు సంబంధించిన తప్పుడు అంశాలతో మంత్రి పదవి పొందటం.. అది ఊడగొట్టుకోవటం తెలిసిందే. ఇది చాలదన్నట్లు వ్యక్తిగత జీవితంలో కూడా పలు వివాదాస్పద అంశాల నేపథ్యంలో సోమనాథ్ భారతి వ్యవహారం మూడు కేసులు ఆరు ఆరోపణలుగా మారిపోయింది.

సోమనాథ్ భారతి సతీమణి లిపిక పెట్టిన గృహహింస.. హత్యాయత్నం కేసులో కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆయన అరెస్ట్ కావాల్సి ఉంది. అయితే.. కోర్టు ఆదేశాలు అమలు కాకుండా ఉండేలా ఆయన ఎవరికి కనిపించకుండా పారిపోవటం.. అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఇది పరోక్షంగా కేజ్రీవాల్ ప్రభుత్వానికి చిరాగ్గా మారింది. తమకు సంబంధం లేకుండా.. ఒకనాటి సన్నిహితుడ్ని ఆదుకునేందుకు ఢిల్లీ అధికార పక్షం ప్రయత్నిస్తుందన్న విమర్శల నేపథ్యంలో.. అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు.

చట్టానికి దొరక్కుండా ఎంత దూరం పరిగెత్తగలవని ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన కేజ్రీవాల్.. జైలుకు వెళ్లెందుకు ఎందుకంత భయపడతా మంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యాలు చేశారు. ఢిల్లీ సర్కారుకు తన నాటి సన్నిహితుడు ఇబ్బందిగా మారాడని ఆయన వాపోతున్నారు.

అయినా.. ఎంత తప్పు చేస్తే మాత్రం.. అంతలా జైలుకు వెళ్లిపోవాలంటూ నాటి సన్నిహితుడే పిలుపునివ్వటం సోమనాథ్ భారతిని అమితంగా అభిమానించే వారికి ఏ మాత్రం రుచించటం లేదు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి సేవ్ చేయాల్సింది పోయి.. జైలుకు వెళ్లాలని చెప్పటమేమిటని వారు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. వారి పాయింట్ లోనూ విషయం ఉందంటారా?