Begin typing your search above and press return to search.

కేజ్రీ... ఎంత ఒంగిపోయారండీ?

By:  Tupaki Desk   |   2 April 2018 11:55 AM GMT
కేజ్రీ... ఎంత ఒంగిపోయారండీ?
X
అర‌వింద్ కేజ్రీవాల్... నిజాయ‌తీ క‌లిగిన సివిల్ సర్వెంట్ గానే కాకుండా అవినీతి రాజ‌కీయాల‌ను పార‌దోలేస్తానంటూ రాజ‌కీయాల్లోకి దూసుకొచ్చేసిన స్వ‌చ్ఛ‌మైన నేత‌గా మ‌నంద‌రికీ తెలుసు. ఈ కార‌ణంగానే కేజ్రీని విద్యాధికులు అధికంగా ఉండే ఢిల్లీ ఓట‌ర్లు చాలా స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో రెండు ప‌ర్యాయాలు సీఎంగా ఎన్నుకున్నారు. అంతేనా స్వ‌చ్ఛ‌మైన రాజ‌కీయాలు చేస్తానంటూ కేజ్రీ వ‌చ్చేశార‌ని, ఈ క్ర‌మంలో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీకి చుక్క‌లు చూపిస్తున్న బీజేపీకి సైతం ఢిల్లీ ఓట‌ర్లు షాకుల మీద షాకులిచ్చేశారు. ఢిల్లీ ఓట‌ర్ల ఆద‌ర‌ణ‌తో రెండు సార్లు సీఎం కుర్చీని ద‌క్కించుకున్న కేజ్రీవాల్... గ‌తంలో పోరాడిన చందంగా ఇప్పుడు పోరు సాగించ‌డంలో ఆస‌క్తి చూపించ‌డం లేద‌నే చెప్పాలి. ఆస‌క్తి చూపించ‌లేద‌న‌డం కంటే కూడా చ‌ద‌రంగం లాంటి రాజ‌కీయ క‌ద‌న రంగంలో ఆయ‌న అల‌సిపోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దేమో.

అయినా ఇప్పుడు కేజ్రీ గురించి ఇంత పెద్ద సుదీర్ఘ ప్ర‌స్తావ‌న అవ‌స‌ర‌మా? అంటే అవ‌స‌ర‌మనే చెప్పాలి. ఎందుకంటే... అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు బీజేపీతోనూ ఢీ అంటే ఢీ అన్న రేంజిలో బ‌రిలోకి దిగేసిన కేజ్రీ... ఇప్పుడు త‌న‌కు తానుగా పోటీ నుంచి త‌ప్పుకుంటున్నారు. ఆ త‌ప్పుకోవ‌డంతోనే స‌రిపెట్టుకుని ఉంటే బాగుండేదేమో గానీ... ఏకంగా త‌న ప్ర‌త్య‌ర్థుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డ‌మే కాకుండా... ఏదో తాను త‌ప్పు చేశాను, మ‌న‌సులో పెట్టుకోకుండా క్ష‌మించేయండి అంటూ ఆయ‌న కాళ్ల బేరానికి దిగుతున్న వైనం ఇప్పుడు నిజంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... బీజేపీ సీనియ‌ర్ నేత‌గానే కాకుండా... ప్ర‌స్తుతం న‌రేంద్ర మోదీ స‌ర్కారులో ఆర్థిక శాఖ మంత్రి హోదాలో ఉన్న అరుణ్ జైట్లీకి సారీ చెప్పేశారు.

అయినా జైట్లీ, కేజ్రీల మ‌ధ్య వివాదం ఎలా ముదిరింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌ (డీడీసీఏ) అధ్యక్షుడిగా వ్య‌వ‌హ‌రించిన స‌మ‌యంలో జైట్లీ పెద్ద ఎత్తున అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని కేజ్రీ అండ్ కో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌న్న భావ‌న‌తో ఏకంగా దీనిపై జైట్లీని కోర్టుకు లాగుతూ కేసు దాఖ‌లు చేశారు. అయితే ఈ విష‌యంలో కాస్తంత గ‌ట్టిగానే వాదించిన జైట్లీ ఏకంగా కేజ్రీపై ప‌రువు న‌ష్టం దావా వేశారు. ఈ క్ర‌మంలో త‌మ వ‌ద్ద ఉన్న ఆధారాలు త‌ప్పుడువ‌ని కేజ్రీ అండ్ కో ఓ అవ‌గాహ‌న‌కు వ‌చ్చింది. అంతే... ఇక‌పైనా ఈ కేసులో ఇదే రీతిన వ్య‌వ‌హరిస్తే ఎక్క‌డ‌ త‌ల‌కు చుట్టుకుంటుందన్న భావ‌న‌తో రాజీ య‌త్నాలు ప్రారంబించిన కేజ్రీ బృందం... జైట్లీకి సారీ చెప్ప‌క త‌ప్పలేదు. ఈ సారీని కేజ్రీతో పాటు ఆయ‌న అనుంగు అనుచ‌రులు అశుతోశ్, రాఘ‌వ్ చ‌ద్దా, సంజ‌య్ సింగ్ లు కూడా జైట్లీకి సారీ చేప్పేశారు. మ‌రి ఈ సారీల‌కు జైట్లీ క‌రుగుతారో, లేదంటే తాను వేసిన ప‌రువు న‌ష్టం దావాతో కేజ్రీని ఇంకా నలిపేస్తారో చూడాలి.