Begin typing your search above and press return to search.

ఏడేళ్లలో అన్ని వందల ప్రైవేటు కాలేజీలు బంద్ కావటమా కేసీఆర్?

By:  Tupaki Desk   |   11 Dec 2021 7:32 AM GMT
ఏడేళ్లలో అన్ని వందల ప్రైవేటు కాలేజీలు బంద్ కావటమా కేసీఆర్?
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల్ని విన్నంతనే అరచేతిలో వైకుంఠం కనిపిస్తూ ఉంటుంది. అంతేనా.. ఆయన మాటలు వింటే.. బంగారు తెలంగాణ వచ్చేసినట్లే అన్నట్లుగా ఉంటుంది. మరి.. వాస్తవం మాటేమిటి? ఆయన చెప్పే మాటలన్ని అబద్ధాలు అని చెప్పలేం కానీ.. నిజాలు కూడా ఉన్నాయని చెప్పటం కష్టం.

తాజాగా బయటకు వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఈ ఏడున్నరేళ్లలో.. ఏడేళ్లను పరిగణలోకి తీసుకుంటే.. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నత విద్యను బోధించే ప్రైవేటు కాలేజీల పరిస్థితి దయనీయంగా మారటమే కాదు.. వందల సంఖ్యలో కాలేజీలు మూత పడినట్లుగా తేలింది.

గడిచిన ఏడేళ్లలో 705 ప్రైవేటు కాలేజీలు మూతపడినట్లుగా తేలింది. ఇందులో ఇంజనీరింగ్.. ఫార్మసీ.. ఎంసీఏ.. ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. సకాలంలో ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల కాకపోవం.. విద్యార్థుల నుంచి డిమాండ్ లేకపోవటం లాంటివి కాలేజీలు మూతపడటానికి కారణంగా చెబుతున్నారు.

ఉన్నత విద్య ఆడ్మిషన్ల విషయంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణ వెనుకపడి ఉందని న్యాక్ (నేషనల్ అసెస్ మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్) చెప్పటం గమనార్హం.

2014-15లో రాష్ట్రంలో 1703 ప్రైవేటు ఉన్నత విద్య కాలేజీలు ఉన్నాయి. వీటిలో ఇంజనీరింగ్ బీ ఫార్మసీ.. ఎంబీఏ.. ఎంసీఏ.. లా.. ఎంటెక్.. ఎంఫార్మసీ.. బీఈడీ లాంటి కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కాలేజీల సంఖ్య 998కు పడిపోయాయి. ఒక్క లా కాలేజీల మినహా మిగిలిన అన్ని కోర్సుల కాలేజీల సంఖ్య తగ్గిపోవటం గమనార్హం.

మూతపడిన 705కాలేజీల్లో ఎక్కువగా ఇంజనీరింగ్.. బీ ఫార్మసీ.. ఎంబీఏ కాలేజీలు ఉన్నట్లుగా చెబుతున్నారు. ఉన్నత విద్యను బోధించే కాలేజీలు మాత్రమే కాదు.. జూనియర్.. డిగ్రీ కాలేజీల సంఖ్య కూడా రాష్ట్రంలో తగ్గిపోతోంది.

గతంలో రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో 1680 డిగ్రీ కాలేజీలు ఉంటే.. తాజాగా 886కు పడిపోయాయి. 2600లకు పైనే జూనియర్ కాలేజీలు ఉంటే.. ఇప్పుడవి కాస్తా 1785కు తగ్గిపోయినట్లుగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని కాలేజీల పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెబుతున్నారు.

ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరవకపోతే.. పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని చెబుతున్నారు. బంగారు తెలంగాణ మాటల్ని మాట్లాడే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. విద్య విషయంలో ఇలా వెనుకపడిపోవటమా? అన్న ప్రశ్నను వేసుకోవాల్సిన ఉందన్న మాట వినిపిస్తోంది.