Begin typing your search above and press return to search.

ఈ ప్రముఖులంతా తగులుకున్నట్లేనా ?

By:  Tupaki Desk   |   6 July 2021 5:30 AM GMT
ఈ ప్రముఖులంతా తగులుకున్నట్లేనా ?
X
అమరావతి భూ కుంభకోణంలో బయటపడుతున్న పేర్లు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. సీఐడీ విచారణలో సీఆర్డీయే మాజీ కమీషనర్ చెరుకూరి శ్రీధర్ చెప్పిన అనేక విషయాలను గమనిస్తే మాజీమంత్రి పి. నారాయణతో పాటు కొందరు ఐఏఎస్ అధికారులు+ఓరిటైర్డ్ ఐఏఎస్ అధికారికి కుంభకోణంలో గట్టి పాత్రే ఉన్నట్లు అర్ధమవుతోంది.

శ్రీధర్ చెప్పినట్లుగా ప్రచారంలో ఉన్న విషయలను చూస్తుంటే కుంభకోణానికి దారితీసిన అనేక విషయాలను సీఐడీ విచారణలో పూసగుచ్చినట్లు చెప్పినట్లే. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే సీఆర్డీయేని ప్రకటించే ఏడాది ముందుగానే తుళ్ళూరు మండలంలోని రెవిన్యు రికార్డులను అప్పటి మంత్రి నారాయణ తెప్పించుకున్నట్లు శ్రీధర్ చెప్పారట. అలాగే అసైన్డ్ భూములను డీ నోటిఫై చేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదని తాను చెప్పినా నారాయణ వినిపించుకోలేదని చెరుకూరి స్పష్టంగా చెప్పారట.

సరే ఈ విషయాలను పక్కనపెట్టేస్తే బ్రహ్మనందరెడ్డి అనే రియాల్టర్ మాట్లాడుతు రాజధాని ప్రాంతంలో తాను 50 ఎకరాల అసైన్డ్ ల్యాండ్స్ కొన్నట్లు అంగీకరించారు. తనలాగే చాలామంది రియాల్టర్లు అసైన్డ్ భూములు కొన్నారని రెడ్డి చెప్పారు. అసైన్డ్ భూముల కొనుగోలుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తు జీవో రిలీజ్ చేసిన కారణంగానే తాము భూములు కొన్నట్లు చెప్పారు. నిజానికి ఈ అధికారం రాష్ట్రప్రభుత్వానికి లేదు. అసైన్డ్ భూముల డీ నోటిఫై చేయాలంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా మాత్రమే సాధ్యం.

శ్రీధర్ చెప్పిన విషయాల ప్రకారమైతే మాజీమంత్రి నారాయణతో పాటు ఐఏఎస్ అధికారులు , మాజీ ఐఏఎస్ అధికారి సాంబశివరావులు గట్టిగా తగులుకున్నట్లే అనుమానంగా ఉంది. ఐఏఎస్ లు తగులుకుంటే నారాయణ పాత్ర బయటకు వస్తుంది. నారాయణ తగులుకుంటే చంద్రబాబునాయుడు పాత్ర బయటపడుతుంది. ఎందుకంటే వీళ్ళందరినీ నడిపించింది చంద్రబాబే కాబట్టి. ఈ రోజో రేపో ఐఏఎస్ లు+నారాయణలను విచారణకు పిలిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. చూద్దాం విచారణలో వాళ్ళేమి చెబుతారో.