Begin typing your search above and press return to search.

బీజేపీ ఎంపీలు ఆ పార్టీలోకి జంప్ చేసేస్తున్నారా ?

By:  Tupaki Desk   |   19 Sep 2021 2:30 AM GMT
బీజేపీ ఎంపీలు ఆ పార్టీలోకి జంప్ చేసేస్తున్నారా ?
X
దేశ‌వ్యాప్తంగా అనేకానేక రాష్ట్రాల్లో ఫిరాయింపు రాజ‌కీయాల‌తో అధికారాలోకి వ‌చ్చేస్తోన్న బీజేపీకి ఒక్క ప‌శ్చిమ బెంగాల్లో మాత్రం పెద్ద ఎదురు దెబ్బ‌లు త‌గులుతున్నాయి. 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఏకంగా 18 లోక్‌స‌భ సీట్లు గెలుచుకోవ‌డంతో బీజేపీకి గ‌ర్వం నెత్తికెక్కింది. ఈ గ‌ర్వంతోనే ఈ యేడాది జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ బంప‌ర్ మెజార్టీతో తాము బెంగాల్‌ను హ‌స్త‌గ‌తం చేసుకుంటాని బీరాలు పోయారు. బెంగాల్లో మ‌మ‌తాబెన‌ర్జీ ఇప్ప‌టికే రెండు సార్లు అధికారంలోకి రావ‌డంతో ఆమెను ఎలాగైనా గ‌ద్దె దింపుతామ‌ని భావించారు. అయితే మ‌మ‌త చేతిలో వారు ఘోరంగా భంగ‌ప‌డ్డారు. మ‌మ‌త ఏకంగా 200కు పైగా సీట్ల‌తో తిరుగులేని ఘ‌న‌విజ‌యం సాధించింది.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు ఎంతో మంది తృణ‌మూల్ పార్టీ నేత‌లు బీజేపీలోకి వెళ్లిపోయారు. చివ‌ర‌కు నందిగ్రామ్‌లో మ‌మ‌త‌పై గెలిచిన సువేందు అధికారి లాంటి మ‌మ‌త రైట్ హ్యాండ్‌ను సైతం బీజేపీ లాగేసుకుంది. ముకుల్‌రాయ్ లాంటి వాళ్లు కూడా మ‌మ‌త‌కు దూర‌మ‌య్యారు. వీరంతా బీజేపీ ఆశ‌ల‌కు లోబ‌డి.. మ‌మ‌త ఓడిపోతోంద‌న్న భ్ర‌మ‌ల‌తో త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్తును నాశ‌నం చేసుకున్నారు. తీరా ఎన్నిక‌ల త‌ర్వాత వాళ్ల భ్ర‌మ‌లు వీడిపోయాయి. ఎప్పుడు అయితే బీజేపీ చిత్తుగా ఓడిపోయిందో బెంగాల్లో ఆ పార్టీకి సీన్ లేద‌న్న విష‌యం వాళ్ల‌కు అర్థ‌మైంది. ఇక ఇప్పుడు ఆప‌రేష‌న్ రివ‌ర్స్‌లో కొన‌సాగుతోంది.

ఇప్ప‌టికే బీజేపీ నుంచి గెలిచిన ప‌లువురు ఎమ్మెల్యేలు తిరిగి తృణ‌మూల్ వైపు చూస్తున్నారు. చివ‌ర‌కు ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్ద‌రు ఎంపీలు సైతం రాష్ట్ర రాజ‌కీయాల్లో ఉంటే భ‌విష్య‌త్తు లేద‌ని త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వుల‌ను కూడా వ‌దులుకున్నారు. ఇక ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే కొంద‌రు ఎంపీలు సైతం తృణ‌మూల్ వైపు చూస్తున్నార‌ట‌. వారంతా 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి ఎంపీలుగా గెలిచారు. పైగా ఇప్పుడు కేంద్రంలో బీజేపీ బంప‌ర్ మెజార్టీతో అధికారంలో ఉంది. అయినా వీరు బీజేపీని వీడేందుకు సిద్ధ‌మ‌వుతున్నారంటే దాని వెన‌క చాలా బ‌ల‌మైన కార‌ణాలే క‌నిపిస్తున్నాయి.

బెంగాల్లో మ‌మ‌త మ‌రో ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటుంది. పైగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీ ఛ‌రిష్మా ప‌నిచేయ‌ద‌న్న విష‌యం చాలా మంది బీజేపీ నేత‌ల‌కు కూడా అర్థ‌మ‌య్యేలా ఉంది. ఇక ఇప్పుడు ఆ పార్టీ ఎంపీ బాబుల్ సుప్రియో బీజేపీని వీడి మ‌మ‌త చెంత చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. విచిత్రం ఏంటంటే 2014 ఎన్నిక‌ల్లో బెంగాల్లో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎంపీగా ఆయ‌న ఉన్నారు. 2019లో గెలిచాక మోడీ ఆయ‌న్ను కేంద్ర మంత్రిని చేశారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆయ‌న కేంద్ర మంత్రి ప‌ద‌వి పీకేశారు. స్థానిక నేత‌ల‌కు, ఆయ‌న‌కు పొస‌గ‌డం లేదు. దీంతో ఆయ‌న పార్టీ వీడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న బాట‌లోనే మ‌రో ఇద్ద‌రు ఎంపీలు ఉన్నారంటున్నారు. ఏదేమైనా బెంగాల్లో మాత్రం బీజేపీకి ఎదురు దెబ్బ‌లు ఆగ‌డం లేదు.