Begin typing your search above and press return to search.

షాకింగ్ రిపోర్టు: హైదరాబాద్ లో శవాల అంతిమసంస్కారాలు ఇలా సాగుతున్నాయా?

By:  Tupaki Desk   |   12 July 2020 11:50 AM GMT
షాకింగ్ రిపోర్టు: హైదరాబాద్ లో శవాల అంతిమసంస్కారాలు ఇలా సాగుతున్నాయా?
X
మాయదారి కరోనా పుణ్యమా అని కలలో కూడా ఎదురుకాని పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాజాగా ఒక ప్రముఖ దిన పత్రికలో ప్రచురితమైన ఒక కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. కరోనా వేళ.. హైదరాబాద్ లో పెరుగుతున్న మరణాల కారణంగా వారి అంతిమ సంస్కారాల విషయంలో చోటు చేసుకుంటున్న పరిస్థితి షాకింగ్ గా ఉన్నట్లుగా చెబుతున్నారు. కరోనా మరణాలతోపాటు.. అనుమానిత మరణాల్ని ప్రభుత్వం పేర్కొన్న ప్రోటోకాల్ ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో.. మరణించిన వారి కుటుంబీకుల్ని.. బంధువుల్ని దూరంగా ఉంచేసి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నారు.

రోజురోజుకి పెరుగుతున్న మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. ఒక్కొక్కరిగా దహన సంస్కారాలు చేయలేని పరిస్థితి. దీంతో.. సామూహిక ఖననాల దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈఎస్ఐ వద్ద ఉన్న శశ్మానవాటికలో నిత్యం పదికి పైగా ఖననాలు జరుగుతుంటే.. శుక్రవారం ఒక్కరోజున 38 మందిని సామూహిక దహనం చేసినట్లుగా పేర్కొన్నారు. అందరిని వరుస పెట్టి ఖననం చేస్తున్న వైనం చూసినప్పుడు మనసు చేదుగా మారటంఖాయం.

ఎందుకింత రద్దీ అన్న విషయానికి వస్తే.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో మరణించిన వారిని కొన్ని శశ్మానవాటికల్లోనే దహనం చేస్తున్నారు. కరోనా మరణాలు.. కరోనా అనుమానిత మరణాలకు సంబంధించిన వారి దహన సంస్కారాల్ని నగరంలోని చాలా శశ్మానవాటికల్లో అనుమతించట్లేదు. దీంతో.. ఈఎస్ఐ వద్దనున్న శశ్మానవాటికకు తీసుకొస్తున్నారు. దీంతో.. పని భారం పెరగటంతో అక్కడున్న సిబ్బంది సామూహిక దహనాలకు మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో చితుల్ని పేర్చి.. డీజిల్ తో దహనం చేస్తున్నారు. వర్షాకాలం కావటంతో.. వానపడిన సందర్భాల్లో మృతదేహాలు పూర్తిగా కాలట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. మొన్నామధ్య ఒక మృతదేహాం విషయంలో అలా జరిగిందని చెబుతున్నారు. ఒకసారి పొరపాటు జరిగిందని.. కానీ అదేపనిగా జరిగినట్లుగా మీడియా రిపోర్టులు రావటాన్ని జీహెచ్ఎంసీ అధికారులు తప్పు పడుతున్నారు.