Begin typing your search above and press return to search.

జన సైనికులు అలీని టార్గెట్‌ చేయబోతున్నారా?

By:  Tupaki Desk   |   3 Nov 2022 1:30 PM GMT
జన సైనికులు అలీని టార్గెట్‌ చేయబోతున్నారా?
X
ఎట్టకేలకు సినీ నటుడు అలీకి ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా జగన్‌ ప్రభుత్వం పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ప్రచారం చేసిన అలీకి రాజ్యసభ ఎంపీగా లేదా ఏపీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌గా లేదా ఎమ్మెల్సీగా చాన్సు ఇస్తారని మొదట్లో వార్తలు వచ్చాయి. అయితే వీటిలో ఏదీ నిజం కాలేదు.

ఇక చివరికి జగన్‌ ప్రభుత్వానికి ఏడాదిన్నర సమయం మాత్రమే ఉన్న సమయంలో ఏపీ ఎలక్ట్రానిక్‌ మీడియా సలహాదారుగా ప్రభుత్వం పదవిని కట్టబెట్టింది. ఈ విషయంపై జగన్‌కు కృతజ్ఞతలు తెలపడానికి వచ్చిన అలీ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ నేతలు బూతులు మాట్లాడకూడదని.. సంయమనం పాటించాలని సలహా ఇచ్చిన సంగతి తెలిసిందే. జగన్‌ ఇలా ఓర్పుగా ఉండటం వల్లే గొప్ప నాయకుడిగా ఎదిగారని కొనియాడారు. బూతులు తిట్టడం రాజకీయం కాదన్నారు.

అలీ ఈ వ్యాఖ్యలు పవన్‌ కల్యాణ్‌ను ఉద్దేశించే చేశారని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవల పవన్‌ తన చెప్పు చూపించి వైసీపీ నా కొడుకుల దవడ పగలకొడతానంటూ వార్నింగ్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఉద్దేశించే అలీ వ్యాఖ్యలు చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు అలీపై మండిపడుతున్నారు. మిత్ర ద్రోహి అలీ అని నిప్పులు చెరుగుతున్నారు. పవన్‌ కల్యాణ్‌ను ఉపయోగించుకునే.. అలీ నటుడిగా ఎదిగాడని గుర్తు చేస్తున్నారు.

బూతులు గురించి అలీ నీతులు చెప్పడం అస్సలు బాలేదని అంటున్నారు. మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా డబుల్‌ మీనింగ్‌ డైలాగులు మాట్లాడటంలో అలీ దిట్టని గుర్తు చేస్తున్నారు. పలు అవార్డుల ఫంక్షన్లలోనూ, ప్రీ రిలీజ్‌ ఈవెంట్లలోనూ, ఆడియో ఫంక్షన్‌ల్లోనూ, విజయోత్సవ సభల్లోనూ హీరోయిన్లు, యాంకర్లను ఉద్దేశించి అలీ మాట్లాడిన డబుల్‌ మీనింగ్‌ డైలాగులు, అసభ్య భాష ఎవరూ మర్చిపోలేదని అంటున్నారు.

డబుల్‌ మీనింగ్‌ వ్యాఖ్యలకు పెట్టింది పేరైన అలీ కూడా బూతులు గురించి నీతులు చెప్పడం బాలేదని జనసేన కార్యకర్తలు, పవన్‌ అభిమానులు ధ్వజమెత్తుతున్నారు. మరోవైపు వైసీపీ 175కి 175 సీట్లు సాధించడంలో తప్పకుండా తన పాత్ర పోషిస్తానని అలీ చెప్పిన నేపథ్యంలో పవన్‌ అభిమానులు అలీని లైట్‌ తీసుకునే ప్రసక్తి ఉండబోదని చెబుతున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.