Begin typing your search above and press return to search.

ఏపీలో రాబ‌డి కంటే రుణాలే అధిక‌మా?

By:  Tupaki Desk   |   26 Aug 2022 2:30 PM GMT
ఏపీలో రాబ‌డి కంటే రుణాలే అధిక‌మా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర ప్ర‌భుత్వ అప్పుల‌పై రచ్చ కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే రాష్ట్ర ప్ర‌భుత్వ అప్పు 8 లక్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు చేరింద‌ని ప్ర‌తిప‌క్షాలు, ఒక వ‌ర్గం మీడియా ఆరోప‌ణ‌లు చేస్తోంది. గ‌త టీడీపీ ప్ర‌భుత్వం చేసిన అప్పుతో క‌లిపి రాష్ట్ర ప్ర‌భుత్వ అప్పు 11 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింద‌ని చెబుతున్నారు. అయితే త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చిన మూడేళ్ల‌లో చేసిన అప్పు 3 ల‌క్ష‌ల కోట్లేన‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం చెబుతోంది.

అయితే ఏపీ బేవ‌రేజెస్ కార్పొరేష‌న్, ఇత‌ర కార్పొరేష‌న్ల‌ను త‌న‌ఖా పెట్టి తీసుకున్న రుణాల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం లెక్కించడం లేద‌ని.. అప్పుల లెక్కల్లోనూ మాయాజాలం చేస్తోంద‌ని విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాగా ఏపీలో రాబ‌డి కంటే రుణాలే అధికంగా ఉన్నాయ‌ని చెబుతున్నారు. రెవెన్యూ లోటు అంత‌కంత‌కూ పెరుగుతూనే ఉంద‌ని అంటున్నారు. ఏడాది మొత్తానికి క‌లిపి ఎంత రెవెన్యూ లోటు ఉంటుందని ఆర్థిక శాఖ అధికారులు లెక్కించారో.. అది కేవలం 2 నెలల్లోనే మించిపోయింద‌ని పేర్కొంటున్నారు.

వాస్త‌వానికి 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.17,036.15 కోట్లకు రెవెన్యూ లోటును సరిపెడతామని బడ్జెట్‌ ప్రతిపాదనల్లో పేర్కొన్నార‌ని గుర్తు చేస్తున్నారు. ఈ మేర‌కు బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేట‌ప్పుడు శాస‌న స‌భ‌, శాస‌న మండ‌లికి హామీనిచ్చార‌ని చెబుతున్నారు. అయితే ఆ అంచనా కేవలం 2 నెలల్లోనే తప్పింద‌ని అంటున్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌, మే నెలాఖరు వరకు రాష్ట్ర ఆర్థిక లెక్కలను ప్రభుత్వం కంప్ట్రోల‌ర్ అండ్ ఆడిట‌ర్ జ‌న‌ర‌ల్ (కాగ్‌)కు సమర్పించింది. ఏడాది మొత్తానికి రెవెన్యూ రాబడికన్నా రెవెన్యూ ఖర్చు రూ.17,036.15 కోట్లు ఉంటుందని లెక్కిస్తే ఈ 2 నెలల్లోనే రెవెన్యూ లోటు రూ.21,924.85 కోట్లకు చేరింద‌ని స‌మాచారం. అంటే అంచనాతో పోలిస్తే ఇప్పటికే 128 శాతం రెవెన్యూ లోటు ఉందని తెలిపింది.

స‌ర్వ‌సాధార‌ణంగా ఏ రాష్ట్రంలోనైనా, ఏ కుటుంబంలోనైనా రాబడి ఎక్కువ ఉండి అందులో అప్పులు కొద్ది శాతంలో ఉండాలి. అలాంటిది ప్రస్తుతం ఏపీలో కొత్త ఆర్థిక సంవత్సరంలోనూ రాబడిని మించి అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింద‌ని అంటున్నారు. అన్ని రకాల ఆదాయాలు కలిసి రూ.17,975.28 కోట్లు వచ్చింద‌ని చెబుతున్నారు. అదే సమయంలో రూ.22,960.96 కోట్లు అప్పు తీసుకున్నార‌ని స‌మాచారం. ఆ రెండు కలిపి మొత్తం రూ.39,900 కోట్లు ఖర్చు చేశార‌ని తెలుస్తోంది. అదే సమయంలో మూలధన వ్యయం (ఆస్తులు సృష్టించేందుకు చేసిన ఖర్చు) కేవ‌లం రూ.996 కోట్లు మాత్రమేన‌ని చెబుతున్నారు.