Begin typing your search above and press return to search.

టీడీపీ నుంచి ఎన్నారైలు పోటీకి రెడీ అవుతున్నారా ?

By:  Tupaki Desk   |   31 Jan 2022 8:30 AM GMT
టీడీపీ నుంచి ఎన్నారైలు పోటీకి రెడీ అవుతున్నారా ?
X
గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ చ‌రిత్ర‌లోనే లేనంత ఘోరంగా ఓడిపోయింది. స‌మైక్య రాష్ట్రంలో 2004లోనే ఘోరంగా ఓడిపోయిన‌ప్పుడే ఆ పార్టీకి 47 సీట్లు వ‌చ్చాయి. అయితే మొన్న ఎన్నిక‌ల్లో కేవ‌లం 23 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. నాలుగు దశాబ్దాల ఘ‌న‌మైన చ‌రిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీ ఇంత ఘోరంగా ఓడిపోతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.

మ‌హామ‌హులు అయిన నేత‌లు కూడా గ‌త ఎన్నిక‌ల్లో మ‌ట్టి క‌రిచారు. ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత పార్టీ కీల‌క నేత‌లు అంద‌రూ కొద్ది రోజుల పాటు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడిప్పుడే ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త విధానాల‌పై గ‌ట్టిగా పోరాటం చేస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు.

ఈ క్ర‌మంలోనే 2024 సాధార‌ణ ఎన్నిక‌లు చంద్ర‌బాబు, టీడీపీకి చావోరేవో కానున్నాయి. ఈ క్ర‌మంలోనే ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రు బ‌ల‌మైన అభ్య‌ర్థో ప‌క్కా స్కెచ్‌తోనే నిర్ణ‌యిస్తున్నారు. ప్రోగ్రామ్ క‌మిటీ టీంతో పాటు రాబిన్‌శ‌ర్మ టీం ప‌దే ప‌దే స‌ర్వేలు చేస్తూ అభ్య‌ర్థులు, ఇన్‌చార్జ్‌ల ఎంపిక‌లో కీల‌కం కానున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు పార్టీలో ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ప‌లువురు ఎన్నారైలు ఆస‌క్తితో ఉన్నారు.

పార్టీ త‌ర‌పున ఇప్పుడు ఆర్థికంగా కూడా ఖ‌ర్చుపెట్టేవారు కావాలి. ఎవ‌రో ఒక‌రిద్ద‌రు నేత‌లు మిన‌హా మిగిలిన వారంతా డ‌బ్బులు తీసేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే కొంద‌రు ఎన్నారైలు త‌మ‌కు సీట్లు ఇస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ నియోజ‌క‌వ‌ర్గానికి తాము ఖ‌ర్చు పెట్టుకోవ‌డంతో పాటు మ‌రో ఒక‌టి రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా తాము డ‌బ్బులు పెడ‌తామ‌ని ప్ర‌పోజ‌ల్స్ పెడుతున్నార‌ట‌. ఇప్ప‌టికే కొంద‌రు ఎన్నారైల‌కు పార్టీ ప‌గ్గాలు కూడా ఇస్తున్నారు.

కృష్ణా జిల్లా తిరువూరు ఇన్‌చార్జ్ దేవ‌ద‌త్‌.. ఎన్నారైనే..! ఇక తూర్పు గోదావ‌రి జిల్లాలోని కోన‌సీమ నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు కాకినాడ రూర‌ల్ నుంచి పోటీ చేసేందుకు ప‌లువురు ఎన్నారైలు రెడీగా ఉన్నారు. ఇక గుంటూరు జిల్లాలో క‌మ్మ వ‌ర్గానికి చెందిన ఇద్ద‌రు ఎన్నారైలు కూడా పోటీకి రెడీగా ఉన్నారు. అటు సీమ నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పోటీకి కొంద‌రు ఎన్నారైలు ఆస‌క్తి చూపుతున్నారు. ఓవ‌రాల్‌గా 20 మంది ఎన్నారైలు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో పాటు చంద్ర‌బాబుపై ఒత్తిళ్లు చేస్తున్నారు.

ఇక పార్టీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. అందుకే చంద్ర‌బాబు కూడా కొంద‌రు ఎన్నారైల‌కు సీట్లు ఇవ్వ‌డం ద్వారా వారి నుంచి భారీగా ఫండ్స్ రాబ‌ట్టే ఆలోచ‌న చేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక టీడీపీకి ఎప్ప‌టి నుంచో ఎన్నారైల్లో మాంచి స‌పోర్ట్ ఉంది. వాళ్ల‌లో కొంద‌రికి సీట్లు ఇవ్వ‌డం ద్వారా వారిని ఆక‌ట్టుకునే క్ర‌మంలో వారి ప్రొఫైల్స్ కూడా ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది.