Begin typing your search above and press return to search.

రెవెన్యూ శాఖలో సంస్క‌ర‌ణ‌లు సాధ్య‌మా ?

By:  Tupaki Desk   |   14 April 2022 7:31 AM GMT
రెవెన్యూ శాఖలో సంస్క‌ర‌ణ‌లు సాధ్య‌మా ?
X
సుదీర్ఘ కాలంగా వేచి ఉన్న ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అనే సీనియ‌ర్ లీడ‌ర్ కు జ‌గ‌న్ స‌రైన స‌మ‌యం లో స‌రైన ప‌ద‌వే ఇచ్చారు. నిన్న‌టి వేళ ఆయ‌న త‌న‌కు కేటాయించిన రెవెన్యూ శాఖ‌కు సంబంధించిన బాధ్య‌త‌ల‌ను అందుకున్నారు.ఈ సంద‌ర్భంగా ల్యాండ్ ను ఫ్రీ హోల్డ్ చేయాల్సిన ఆవ‌శ్య‌కత ఎంతైనా ఉంద‌న్నారు. భూమి అంటే సంప‌ద సృష్టి కేంద్రం అని కూడా నిర్వ‌చించారు. ముఖ్యంగా త‌న‌కు అప్ప‌గించిన రెవెన్యూ శాఖ‌ను భూ యాజ‌మాన్య శాఖ అని వ్య‌వ‌హ‌రించాలి అని కొత్త చ‌ర్చ‌కు అర్థం ఇచ్చే మాట ఒక‌టి చెప్పి వెళ్లారు.

ఇవ‌న్నీ ఎలా ఉన్నా భూ సంస్క‌ర‌ణ‌లు ముఖ్యంగా అనేక వివాదాల్లో న‌లిగిపోతున్న భూములు వీటి నుంచి సంబంధిత వ‌ర్గాలు విముక్తం అయ్యేందుకు తాను కృషి చేస్తాను అన్న అర్థం ధ్వ‌నించేలా స్ప‌ష్టం అయిన ప్ర‌క‌ట‌న ఒక‌టి మీడియా ఎదుట చేయ‌డం శుభ ప‌రిణామమే! ఇదే స‌మ‌యంలో మ‌రికొన్ని విష‌యాలు చ‌ర్చించాలి. ఆ వివ‌రం ఈ క‌థ‌నంలో...

ఇప్ప‌టికే రాష్ట్రం లో స‌మ‌గ్ర భూ స‌ర్వే పై కొన్ని అపోహ‌లు ఉన్నాయి. ప్ర‌భుత్వ భూమి ఎంత అన్న‌ది నిర్థిష్ట వివ‌రం అయితే లేదు. వీటితో పాటు మ‌రోసారి స‌ర్వే చేసినా మంచిదే! ముఖ్యంగా క‌బ్జాలు నిలువ‌రించాల్సిన బాధ్య‌త ధ‌ర్మాన‌దే ! విశాఖ కేంద్రం గా అనేక ప్ర‌భుత్వ స్థ‌లాలు ఇవాళ అక్ర‌మార్కుల కబంధ హస్తాల‌లో చిక్కుకుని ఉన్నాయి. వీటికి ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. ఆ రోజు టీడీపీ హ‌యాంలోనూ ఇవాళ వైసీపీ లోనూ అవే ప‌నులు ప‌దే ప‌దే జ‌రిగినా కూడా నియంత్రించ‌డం సాధ్యం కావ‌డం లేదు సంబంధిత వ‌ర్గాల‌కు.

ముఖ్యంగా రిషికొండ చుట్టూ చాలా భూమి ఉంది. ఆ భూమి ప్ర‌భుత్వ పెద్ద‌ల చేతిలోనే ఉంది. ఇదీ ప్ర‌ధాన ఆరోప‌ణ. వీటిని నిలువ‌రించ‌డం ధ‌ర్మాన‌కే కాదు జ‌గ‌న్ కు కూడా సాధ్యం కాదు..అని క‌మ్యూనిస్టు శ‌క్తులు అభిప్రాయ‌ప‌డుతున్నాయి.

ముఖ్యంగా వీటిని విముక్తం చేయ‌డం కోసం పోరాటాలు న‌డిపిన వారు కూడా ఇప్పుడు నిశ్శ‌బ్దం అయిపోయారు అని విప‌క్షం ఆరోప‌ణ చేస్తోంది. ఇక శ్రీ కాకుళంలోనూ అనేక భూములు ముఖ్యంగా దేవాదాయ ధ‌ర్మాదాయ శాఖ భూములు అదేవిధంగా వ‌క్ఫ్ భూములు ఇంకా చాలా దేవుడు మాన్యాలు, ఇతర ప‌నుల నిమిత్తం సేక‌రించిన భూములు అన్నీ అన్నీ క‌బ్జాల‌లోనే ఉన్నాయి.

వీటిని నియంత్రించ‌డం కూడా సాధ్యం కానే కాదు అని క‌మ్యూనిస్టులు అంటున్నారు. ముఖ్యంగా కొవ్వాడ భూముల‌లో ఇవాళ ఆక్వా క‌ల్చ‌ర్ న‌డుస్తోంది. దానిని నిలువ‌రించ‌డం అస్స‌లు కుద‌ర‌ని ప‌ని అని స్థానికులే అంటున్నారు. ఈ విధంగా స‌మ‌స్యాత్మ‌క శాఖ కు మంత్రి ధ‌ర్మాన పెద్ద‌దిక్కుగా ఉన్నారు. ముఖ్యంగా రాజ‌ధాని అమ‌రావ‌తి భూముల వివాదాల‌ను ఆయ‌నే ప‌రిష్క‌రించాలి. క‌నుక వాటిపై ఆయ‌న ఏ విధంగా దృష్టి సారిస్తారు అన్న‌దే ఇప్పుడిక ఆస‌క్తిదాయ‌కం.