Begin typing your search above and press return to search.

టీడీపీ నాయకులకు అప్పులు ఎక్కువ అయ్యాయా...?

By:  Tupaki Desk   |   12 Sep 2022 11:33 AM GMT
టీడీపీ నాయకులకు అప్పులు ఎక్కువ అయ్యాయా...?
X
టీడీపీ అధికారంలో ఉన్నపుడు మూడు పూవులు ఆరు కాయలుగా అధికారాన్ని అనుభవించిన మంత్రులు, ఇతర్ పెద్దలు ఇపుడు మాజీ మంత్రులు, మాజీ నేతలు అయ్యాక అప్పులలో కూరుకుని పోయారు అని ప్రచారం సాగుతోంది. అది ఎంతదాకా అంటే బ్యాకులు నోటీసులు ఇచ్చే పరిస్థితుల దాకా అని అంటున్నారు. ఒకరూ ఇద్దరూ కాదు అందరి పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది అని కూడా చెబుతున్నారు.

ఏపీలో చూస్తే తొందరలోనే చాలా మంది మాజీ మంత్రులకు బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే ఇదంతా నిజంగానే జరుగుతోందా తమ నాయకులు అప్పుల పాలు అయి బాధపడుతున్నారా అన్న చర్చ కూడా తమ్ముళ్ళలో చర్చ సాగుతోంది. కావాలనే కొందరు ఇలా చేస్తున్నారా అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయట.

అదెలా అంటే తమ దగ్గర ఏ మాత్రం డబ్బులు లేవని అధినాయకత్వానికి తెలియచెప్పాలన్నదే తెలివైన తమ్ముళ్ల మాజీల‌ ఉద్దేశ్యం అని అంటున్నారు. ఆ విధంగా చేయడం ద్వారా తమ మీద పార్టీ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత తగ్గుతుందని, అదే టైం లో రేపటి రోజుల టికెట్ దక్కి పోటీ చేయాల్సి వస్తే హై కమాండ్ అండగా ఉంటుందని లెక్కలేసుకునే ఇలా చేస్తున్నారా అన్న డౌట్లు కూడా కలుగుతున్నాయట.

నిజానికి అధికారంలో ఉండి మంత్రులుగా ఇతర పదవులు అనుభవించిన వారు ఇంత తొందరలో అంటే కేవలం మూడేళ్ళ వ్యవధిలోనే ఊన్నఫళానా అప్పుల పాలు అయిపోతారా అన్నది కూడా చర్చగా ఉందిట. అప్పులు నిజంగా కనుక ఉంటే కొంపలు మునిగేలా బ్యాంకులు నేరుగా నోటీసులు ఇచ్చేలాగా కూడా ఉంటాయా అన్న ప్రశ్నలూ ఉత్పన్నం అవుతున్నాయట.

మరి ఈ విధంగా ఎందుకు జరుగుతోందని అని ఆయా మాజీలు ఉన్న ప్రాంతాలలో లోకల్ లీడర్స్ మధ్య చర్చోపచర్చలు జరుగుతున్నాయట. మరి నాడు సంపాదించిన డబ్బులు పూర్తిగా అయిపోయాయా అన్న మాటలు వినిపిస్తున్నాయట. ఆనాడు సంపదించిన డబ్బులు ఏమి అయిపోయాయని, ఇదేమి చిత్రమని కూడా కొందరు తమ్ముళ్ళు నోరు వెళ్లబెడుతున్నారుట.

దీని మీద మరికొందరు అయితే అలా ఏమీ జరగదని, కేవలం ఇదంతా నాటకం అయి ఉండవచ్చు అని అంటున్నారుట. ఇదిలా ఉండగా ఇప్పటికే టీడీపీ అధినాయకత్వం కొన్ని కార్యక్రమాలను డిజైన్ చేసి పార్టీ వర్గాలకు వాటిని అమలు చేయాలని ఆదేశించింది. దాని ప్రకారం చూస్తే బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలు హిట్ అయినా వాటిని పూర్తి స్థాయిలో జిల్లాలలో నిర్వహించలేకపోవడానికి కారణం డబ్బులు లేవని కొందరు నాయకులు ముఖాలు చాటేయడమే అని చెబుతారు.

ఇక చంద్రబాబు మహానాడు తరువాత జిల్లాలలో సైతం మినీ మహానాడులను నిర్వహించాలని చూశారు. అయితే దానికి కూడా డబ్బులు ఖర్చు చేయలేమని ఆయా జిల్లాలలో కొందరు నేతలు వెనకేయడంతోనే ఆయా కార్యక్రమాలు సడెన్ గా వాయిదా పడ్డాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే ముందే డబ్బులు లేవని చెబితే రేపటి రోజున పార్టీ పరంగా ఆర్ధిక వనరులు ఏమైనా దక్కుతాయన్న ఆలోచనలతొనే కొందరు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.

మొత్తానికి ఈ తరహా విచిత్రమైన ఎత్తులకు కొందరు పాల్పడితే అది వారికి ఎంతమేరకు లాభమో తెలియదు కానీ పార్టీ పరంగా మాత్రం ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. పార్టీ అధికారంలో ఉన్నపుడు బాగుపడిన వారి ఇపుడు విపక్షంలో ఉన్నపుడు జేబులు తీయకపోతే పార్టీ ఏ విధంగా జనాల్లోకి వెళ్తుంది. ఏ విధంగా ఎత్తిగిల్లుతుంది అన్న ఆలోచన బడా నాయకులకు ఉండాలి కదా అన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి చిత్రమైన ప్లాన్స్ కూడా నాయకులు చేస్తారా అని ఈ ఉదంతాలను చూసిన పార్టీలోని వారు అవాక్కు అవుతున్నారుట.

మరి రాజకీయాలను మొత్తం ఔపాసన పెట్టేసి అపర చాణక్యుడిగా ముద్రపడిన చంద్రబాబుకు ఈ విషయలు తెలియవని అనుకోగలమా అని అంటున్నారు. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టే చంద్రన్న ముందు ఈ తరహా అప్పుల ఆర్తనాదాలు అసలు పనిచేయవని ఒక విధంగా అతి తెలివికి పోతే అసలుకే ఎసరు వస్తుందని కూడా అంటున్నారు. రేపటి రోజున బాగా సౌండ్ పార్టీలకే టికెట్ అని హై కమాండ్ అంటే అపుడు అప్పులు చూపించిన వారు తిప్పలు పడతారని, అలాగే రేసు నుంచి పూర్తిగా తెగిపోతారని కూడా అంటున్నారుట.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.