Begin typing your search above and press return to search.

అయితే.. ఏపీ బీఆర్‌ఎస్‌ నేతపై ఆ ఆరోపణలు నిజమేనా?

By:  Tupaki Desk   |   19 Jan 2023 6:35 AM GMT
అయితే.. ఏపీ బీఆర్‌ఎస్‌ నేతపై ఆ ఆరోపణలు నిజమేనా?
X
ఇటీవల బీఆర్‌ఎస్‌ లో చేరిన మాజీ ఐఏఎస్‌ అధికారి తోట చంద్రశేఖర్‌ పై పలు ఆరోపణలు వస్తున్నాయి. 99 టీవీ అధినేతగా, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న తోట చంద్రశేఖర్‌ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)లో చేరిన సంగతి తెలిసిందే. ఆయనను కేసీఆర్‌.. బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడిగా నియమించారు. ఇదే సమయంలో మాజీ మంత్రి రావెల్‌ కిశోర్‌ బాబు, తదితరులు సైతం బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కాగా.. తోట చంద్రశేఖర్‌ బీఆర్‌ఎస్‌ లో చేరడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయనకు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలున్నాయని, వందల కోట్ల రూపాయలు విలువ చేసే ఆయన ఆస్తులన్నీ ప్రధానంగా హైదరాబాద్‌ లోనే ఉన్నాయని చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ బెదిరింపుల వల్లే ఆయన బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారని జనసేన పార్టీ వర్గాల్లో టాక్‌ నడిచింది.

అలాగే తాజాగా ఖమ్మంలో జరిగిన బీఆర్‌ఎస్‌ సభకు ఏపీ నుంచి 2 వేల బస్సులను తోట చంద్రశేఖర్‌ ఏర్పాటు చేసినట్టు గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. దీనికి దాదాపు కోటి రూపాయలు ఖర్చు అయ్యిందని.. ఇదంతా తోట చంద్రశేఖర్‌ పెట్టుకున్నట్టు టాక్‌ నడుస్తోంది.

ఇప్పుడు ఈ ఆరోపణలు నిజమన్నట్టు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రూ.4 వేల కోట్ల రూపాయల విలువ చేసే 40 ఎకరాల భూమిని తోట చంద్రశేఖర్‌ అప్పనంగా కొట్టేశారని రఘునందనరావు హాట్‌ కామెంట్స్‌ చేశారు. అందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన ఆవిర్భావ సభకు తోట చంద్రశేఖర్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారని సంచలన విమర్శలు చేశారు.

ఈ నేపథ్యంలో రఘునందనరావు చేసిన ఈ వ్యాఖ్యలపై తోట చంద్రశేఖర్‌ ఘాటుగా స్పందించారు. తనపై బీజేపీ నేతలవి చౌకబారు ఆరోపణలని కొట్టిపారేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ లో తనకు ఒక్క ఎకరం ఇచ్చినట్లు నిరూపించాలని సవాల్‌ విసిరారు. నిరూపిస్తే తాను 10 శాతం తీసుకుని మిగిలిన 90 శాతం తనపై విమర్శలు చేసేవారికి ఇచ్చేస్తానని తోట చంద్రశేఖర్‌ హాట్‌ కామెంట్స్‌ చేశారు. కేవలం బీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు వచ్చిన ప్రజా స్పందనను పక్కదారి పట్టించడానికే రఘునందనరావు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

వార్తల్లో నిలవడం కోసం, చౌకబారు ఇమేజ్‌ కోసమే బీజేపీ నేతలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తోట చంద్రశేఖర్‌ చెబుతున్నారు. కాగా ఏపీలోని విశాఖపట్నంలో త్వరలో బీఆర్‌ఎస్‌ సభ ఏర్పాటు చేస్తామన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు బీఆర్‌ఎస్‌ పోరాటం చేస్తుందని తోట చంద్రశేఖర్‌ తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఏపీలోనూ అందిస్తామన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.