Begin typing your search above and press return to search.

జగన్ తో పీకే లెక్కలు తేల్చుకునే రోజులు వచ్చేశాయా?

By:  Tupaki Desk   |   22 April 2022 4:24 AM GMT
జగన్ తో పీకే లెక్కలు తేల్చుకునే రోజులు వచ్చేశాయా?
X
దేశ ప్రధానమంత్రి కుర్చీలో నరేంద్ర మోడీకి బదులుగా మరో నేతను కూర్చోబెట్టాలన్న ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. ఈ విషయంలో మిగిలిన వారు చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా పలితం చూపించని పరిస్థితి. ఇలాంటివేళ.. రంగంలోకి దిగారు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. ఇప్పుడున్న రెండు కూటములకు బదులుగా ముచ్చటగా మూడో కూటమి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేల్చిన ఆయన.. కాంగ్రెస్ తో జత కట్టేలా పార్టీల్ని సిద్ధం చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. ఇందుకు తగ్గట్లే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.

తమకు పూర్వవైభవం తెచ్చి పెట్టేందుకు పీకే చేస్తున్న ప్రయత్నాలు.. పార్టీ అధినేత్రి సోనియాను ఇంప్రెస్ చేశాయంటున్నారు. తాజాగా.. సోనియాకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో పీకే కీలక అంశాల్ని ప్రస్తావించారని తెలుస్తోంది. పొత్తుల లెక్కల్ని మేడమ్ కు వివరిస్తూ.. అధికారానికి చేరువ కావటానికి అవసరమైన స్పష్టత ఆమెకు ఇచ్చారన్న మాట వినిపిస్తోంది.

2019 ఎన్నికల్లో 128 స్థానాల్లో గెలిస్తే.. మరో 249 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. మొదటి.. రెండు స్థానాల్లో నిలిచిన సీట్లను కలిపితే 377 అవుతాయని.. వచ్చే ఎన్నికల్లో వీటి మీద ప్రత్యేక ఫోకస్ పెట్టగలిగితే.. భారీగా పుంజుకోవటం ఖాయమని స్పష్టం చేశారు. బీజేపీతో ముఖాముఖి తలపడే రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేయాలని.. మిగిలిన చోట్ల ఐదారు పార్టీలతో వ్యూహాత్మక పొత్తులు పెట్టుకుంటే పార్టీ విజయవకాశాలు పెరుగుతాయన్న సూచనను చేసినట్లు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ విషయానికి ప్రస్తావించిన పీకే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పొత్తు పెట్టుకోవాలని సోనియాకు చెప్పినట్లుగా తెలుస్తోంది.

తమిళనాడు లో డీఎంకే.. మహారాష్ట్రలో ఎన్సీపీ.. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ.. జమ్ముకశ్మీర్ లో నేషనల్ కాన్ఫరెన్సు తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కలిసి వచ్చే పార్టీలతో వెళ్లాలని చెప్పే క్రమంలోనే ఏపీ ప్రస్తావన తీసుకొచ్చారని చెబుతున్నారు. పీకే ప్రస్తావన వరకు ఓకే. కానీ.. ఇద్దరు (సోనియా, జగన్) ఇద్దరే. ఒకరికి ఒకరు ఏ మాత్రం పొసగదు. అలాంటి వేళ పీకే కానీ ఫోర్సు చేస్తే.. ఆయనతో తెగతెంపులు చేసుకోవటానికే జగన్ ఇష్టపడతారు కానీ కాంగ్రెస్ తో కలవటానికి అస్సలు ఇష్టపడరు. అయినా.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోయి.. దాన్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి.

అలాంటి పార్టీతో జత కట్టాలని జగన్ ను కోరటంతోనే ఆయనకు కోపం ఖాయమంటున్నారు. తన తండ్రి మరణం తర్వాత తనను సీఎంగా చేయాల్సిన సోనియా.. ఆ అవకాశాన్ని ఇవ్వని తీరు పై ఇప్పటికి జగన్ మండిపాటు కు గురవుతారని చెబుతారు. అలాంటప్పుడు ఏపీలో పీకే వ్యూహం ఫలించే అవకాశమే లేదంటున్నారు. మరోవైపు మోడీకి అత్యంత సన్నిహితంగా ఉన్న ఎన్డీయేతర పార్టీల్లో వైసీపీ ఒకటి.

అలాంటప్పుడు ఇప్పుడు నడుస్తున్న కాంబినేషన్ కే మోడీ - జగన్ లు మొగ్గు చూపుతారు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ తో జత కడితే లేని తలనొప్పులతో పాటు.. పాతాళంలోకి పడిపోయి ఉన్న పార్టీని తాను మద్దతు ఇవ్వటం ద్వారా మళ్లీ తిరిగి లేచేలా చేయటం కోసం జగన్ ఎందుకు సాయం చేస్తారు? ఈ విషయం లో పీకే కోరికను మన్నించలేని పరిస్థితి జగన్ కు ఉందంటున్నారు. అదే జరిగితే.. తన మాట వినని జగన్ విషయం లో పీకే ఆలోచనలు మరోలా మారటం ఖాయమంటున్నారు. మరేం జరుగుతుందో కాలమే సరైన సమాధానం చెప్పగలదు.