Begin typing your search above and press return to search.

రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయా ?

By:  Tupaki Desk   |   30 Nov 2020 5:00 PM GMT
రైతులను ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయా ?
X
దేశవ్యాప్తంగా జరుగుతున్న రైతుల ఆందోళనలపై ప్రధానమంత్రి నరేంద్రమోడి విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. వారణాసి పర్యటనలో ఉన్న మోడి మాట్లాడుతూ కేంద్రం అమల్లోకి తెచ్చిన నూతన వ్యవసాయ సంస్కరణల చట్టాలపై రైతలను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మండిపోయారు. నిజానికి రైతుల ఆందోళనలకు ప్రతిపక్షాలకు పెద్దగా సంబంధం ఉన్నట్లు ఎక్కడా కనబడటం లేదు. ఎందుకంటే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టానికి వ్యతిరేకంగా రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు స్వచ్చంధంగా మొదలైన విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుత ఆందోళనలకు ప్రతిపక్షాలకు సంబంధం లేదని ఎలా చెప్పవచ్చంటే ఎన్డీయేలో భాగస్వామి అయిన సిరోమణి అకాలీదళ్ మంత్రి తనంతట తానుగా తప్పుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. పంజాబుకు చెందిన కేంద్రమంత్రి రైతుల సెగను తట్టుకోలేక స్వచ్చందంగా కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయటమే కాకుండా ఏకంగా ఎన్డీయే నుండి కూడా బయటకు వచ్చేశారు. ఒకవేళ ప్రతిపక్షాల ప్రమేయమే ఉండుంటే కేంద్రమంత్రి రాజీనామా చేసుండే వారే కాదని చెప్పచ్చు. రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులంతా సంఘిటితం అయ్యారు కాబట్టే అకాలీదళ్ కూడా ఆందోళనల్లో పాల్గొంటోంది.

పంజాబు వ్యవహారం ఇలాగుంటే హర్యానాలోని రైతు సంఘాలు, రైతులు కూడా ఇదే విధంగా ఆందోళన బాటపట్టారు. హర్యానాలో ఉండేది బీజేపీ ప్రభుత్వమే. ఇక్కడ గనుక ప్రతిపక్షాలు రైతు సంఘాలను రెచ్చగొడుతుంటే ఆ విషయాన్ని ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించుండేది. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయలేదంటే మోడి తాజాగా చేసిన ఆరోపణ తప్పని అర్ధమైపోతోంది. మోడి కూడా సగటు రాజకీయ నేతగానే ప్రతిపక్షాలపై ఆరోపణలు చేస్తున్నట్లుగా అనుమానం వస్తోంది. రైతుల మేలు కోసమే తాము కొత్త చట్టాలను తెచ్చినట్లు చెబుతున్న మోడి ఆ విషయంలో రైతులను ఎందుకు కన్వీన్స్ చేయలేకపోతున్నారు ?

కేంద్రం తెచ్చిన కొత్త చట్టంపై రైతులు ఇంతగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారంటేనే అందులో మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. మరలాంటపుడు కేంద్రం రైతు సంఘాలతో చర్చలు జరిపి వాళ్ళ వెర్షన్ ఏమిటో ఎందుకు వినటం లేదు ? అసలు రైతు సంఘాలతో చర్చలు జరపకుండా వాళ్ళ సంక్షేమం కోసమే కొత్త చట్టాలు చేశామని మోడి చెప్పే మాటలను ఎవరైనా నమ్ముతారా ? దాదాపు నెల రోజులుగా రైతులు ఆందోళన సెగ తాజాగా ఢిల్లీకి కూడా తగులుతోంది.

గడచిన మూడు రోజులుగా ఢిల్లీలోకి ఎంటరైన దేశవ్యాప్త రైతు సంఘాలు తమ ఆందోళనలను విరమించేది లేదని తెగేసి చెప్పాయి. ఢిల్లీ నుండి హైదరాబాద్ కు వచ్చి కరోనా వైరస్ టీకా అభివృద్దిని పరిశీలించిన మోడి ఢిల్లీలోనే ఆందోళన చేస్తున్న రైతు సంఘాలతో సమావేశం అవ్వటానికి ఎందుకు ఇష్టపడటం లేదు ? రైతుల ఆందోళనను విరమింపచేయలేని ప్రభుత్వం ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేస్తున్నట్లే ఉంది చూస్తుంటే.