Begin typing your search above and press return to search.

కేసీఆర్ మొదలైన ‘సమైక్యం’చర్చ ఎక్కడి దారి తీస్తుందో?

By:  Tupaki Desk   |   1 Nov 2021 3:30 AM GMT
కేసీఆర్ మొదలైన ‘సమైక్యం’చర్చ ఎక్కడి దారి తీస్తుందో?
X
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక.. సమైక్య రాష్ట్రం అనే పదం కూడా దాదాపు కనుమరుగై పోయింది. అప్పట్లో సమైక్య రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగినా.. అవి కేవలం పబ్లిసిటీ కోసం ఉపయోగపడ్డాయి తప్ప.. వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జోరులో మిగతా ఉద్యమాలన్నీ కొట్టుకుపోయాయి. రాష్ట్రాలు విడిపోయాయి.. ఆవేశాలు చల్లారిపోయాయి.. ఎవరి రాజకీయాలు వారు చూసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ఏపీలో కూడా పార్టీ పెట్టే ఉద్దేశం ఉందని ప్రకటించడంతో.. మళ్లీ సమైక్యాంధ్ర చర్చ తెరపైకి వచ్చింది. కేసీఆర్ సీరియస్‌గా అన్నారా.. లేక పొరపాటున మాట తూలి అన్నారా అని వారి పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. ఏపీలో పార్టీ పెట్టినా ఆదరణ ఉండదనే విషయం అందరికీ తెలుసు.. కేసీఆర్ కవ్వించడానికి అలా మాట్లాడారా? మరి టీఆర్ఎస్ ప్లీనరీలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలో కాకతీయ తోరణం మధ్యలో తెలుగు తల్లి చిత్రం పటాన్ని ఎందుకుపెట్టారు? ఇలా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఏ సందర్భంలో అన్నారో తెలియదు కాదు మరోసారి ‘సమైక్యం’అనే చర్చ తెరపైకి వచ్చింది.

టీఆర్ఎస్ పాలనను ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని కేసీఆర్ ప్రకటించి మౌనంగా ఉండిపోయారు. ఇక అక్కడి నుంచి లొల్లి మొదలైంది. ఏపీ మంత్రులు టీఆర్ఎస్ విస్తరణను ఆహ్వానిస్తూనే... విమర్శలు సంధించారు. కేసీఆర్ వ్యాఖ్యలకు సమాధానమిస్తూ ప్రత్యేకంగా పార్టీ ఎందుకు రెండు రాష్ట్రాలను కలిపేద్దామని ఏపీ మంత్రి పేర్నినాని ప్రతిపాదిన చేశారు. అప్పటివరకు కేసీఆర్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇంతలోనే రేవంత్ రెడ్డి ఎంట్రీ అయ్యారు. ఏపీ, తెలంగాణాను కలిపేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నట్లు మండిపడ్డారు. సీఎంలు కేసీఆర్, జగన్ మొదటి నుంచి కవలపిల్లల్లా కలిసి వెళ్తున్నారని విమర్శించారు. జల వివాదాలు పెంచి రెండు రాష్ట్రాలను కలిపే కుట్ర జరుగుతోందని రేవంత్‌ ఆరోపించారు. ఇలాంటి కుట్రలను ప్రజలు సహించరని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

ఇంతలోనే ఈ టాఫిక్‌లో ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ఎంటర్ అయ్యారు. ఆయన వస్తూనే పలు ప్రశ్నలు సంధించారు. తాను మొదటి నుంచి సమైక్య వాదినని తేల్చిచెప్పారు. అంతేకాదు రెండు రాష్ట్రాలను కలపాలని చూస్తే తాను మద్దుతు ఇస్తానని ప్రకటించారు. రెండు రాష్ట్రాలు మళ్లీ కలిసిపోతే నీళ్ల పంచాయితీలుండవని చెప్పారు. ఇంకా చాలా సమస్యలు పరిష్కారమైపోతాయని జగ్గారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్‌ లో కలవరం సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డికి పూర్తి భిన్నంగా జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌లో ఉన్న అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మరోసారి బయటపెట్టింది. ప్రత్యేక తెలంగాణకు కట్టబడి ఉమ్మడి ఏపీని కాంగ్రెస్ విభజించింది. ఆ తర్వాత ఏపీలో ఆ పార్టీ ఉనికే ప్రశ్నార్థమైంది. ఇప్పుడు జగ్గారెడ్డి తిరిగి సమైక్య వాదాన్ని తెరపైకి తేవడం తెలంగాణ కాంగ్రెస్‌కు నష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పడిప్పుడే తెలంగాణలో కాంగ్రెస్ పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నిస్తుంటే జగ్గారెడ్డి వ్యాఖ్యలతో పరిస్థితి ఎలా మారుతుందోనని ఆ పార్టీ నేతలు ఆందోళనలో పడ్డారు.

సరే ఏదిఏమైనా సందర్భం లేకున్నా కేసీఆర్ ఏపీలో పార్టీని విస్తరించాలని అనుకోవడం.. సమైక్యాంధ్ర ఆశలకు ఊపిరిపోసినట్లుయింది. ప్రజలు కాకుండా రాజకీయ నేతలు సమైక్యాంధ్ర చర్చను బయటకు తేవడంతో ప్రజల్లో కూడా విస్తృతంగా చర్చ సాగుతోంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను చాలా మంది వ్యతిరేకించారు. ఇప్పటికే విడిపోయి నష్టపోయామనే భావన ఏపీ ప్రజల్లో బలంగా ఉంది. తెలంగాణలో ఏపీ ప్రజలకు ఉన్న అనుబంధం అలాంది. తెలంగాణ నుంచి బౌతికంగా విడిపోయినా మానసికంగా కలిసి ఉన్నట్లే భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాద్‌తో ఏపీ ప్రజలకు ఉన్న అనుబంధం విడదీయరానిది. రాష్ట్రం విడిపోయినా పేగు బంధాన్ని తెంచుకోలేక తెలంగాణలో కోటి మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు నివసిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, ఏపీ ప్రజలు అత్యధికంగా ఉన్నారు. ఇప్పుడు ఉమ్మడి ఏపీపై చర్చజరగడం మంచిదేనని తెలంగాణలో నివాసమున్న ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్‌తో మొదలైన చర్చ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.