Begin typing your search above and press return to search.

ఐటీ సాఫ్ట్ వేర్ రంగంలో నియామకాలు లేవా?

By:  Tupaki Desk   |   13 Aug 2020 12:30 PM GMT
ఐటీ సాఫ్ట్ వేర్ రంగంలో నియామకాలు లేవా?
X
ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలు కరోనాకు ముందు.. తర్వాత అన్నట్టుగా మారిపోయాయి. జీవితంపై ఎన్నో ప్లాన్లు చేసుకున్న సామాన్యులకు, ప్రణాళికలు రచించుకున్న పారిశ్రామిక వర్గాల కలలను మొత్తం కూల్చేసింది కరోనా.. అందరినీ రోడ్డున పడేసింది. ఇప్పుడు బతకడమే కష్టంగా మార్చేసింది.

కరోనా దెబ్బకు ఇప్పుడు అన్ని ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. లాక్ డౌన్ సడలింపులు.. కీలక పరిశ్రమలు తెరుచుకోవడంతో భారత్ లో నియామకాల ప్రక్రియ ఊపందుకుంది.

ఈ జూలై నెలలో దేశవ్యాప్తంగా నియామకాల ప్రక్రియ అంతకుముందు నెలతో పోలిస్తే 5శాతం పెరిగిందని నౌకరీ జాబ్ సీక్ నివేదకలో వెల్లడైంది. అయితే ఈ నియామకాలు ఎక్కువగా మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగంలో 36శాతం.. హెచ్.ఆర్ లో 37శాతం, నిర్మాణ ఇంజనీరింగ్ రంగాల్లో 27శాతంగా ఉన్నాయని తెలిపింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్ రంగంలో 16శాతం , ఆటోమొబైల్స్ 14శాతం, టెలికాం పరిశ్రమలో 13శాతం మేర నియామకాల ప్రక్రియలో వృద్ధి నమోదైంది.

ఐటీ హార్డ్ వేర్ రంగంలో 9శాతం నియామకాలు జరిగాయి. ఐటీ సాఫ్ట్ వేర్ రంగంలో ఎలాంటి నియామకాల జోరు కనిపించలేదని నౌకరీ జాబ్ స్పీక్ పేర్కొంది.

ఇక ఇవే కాదు.. నియామకాల్లో ఈ రంగాల్లో భారీగా కోతపడింది. విద్యాబోధనా రంగంలో మైనస్ -22శాతం, ఆతిథ్యరంగంలో -5శాతం, రిటైల్ లో -2శాతం మేర నియామకాల ప్రక్రియలో క్షీణత నమోదైంది.

ఇలా అన్నింటిలోనూ నియామకాల జోరు కనిపించగా.. లక్షల జీతాలు వచ్చే కలల సాఫ్ట్ వేర్ రంగంలో మాత్రం ఎలాంటి నియామకాలు లేకపోవడం ఆ రంగాన్ని కుదేలు చేస్తోంది. అమెరికా సహా దేశంలో ఐటీ జాబుల మోజులో పడిన యువ ఇంజినీరింగ్ పట్టభద్రుల ఆశలను అడియాసలు చేస్తోంది.