Begin typing your search above and press return to search.

మంత్రివర్గంలో ఇంతమంది క్రిమినల్సా ?

By:  Tupaki Desk   |   18 Aug 2022 5:40 AM GMT
మంత్రివర్గంలో ఇంతమంది క్రిమినల్సా ?
X
బీహార్లో కొత్తగా ఏర్పాటైన నితీష్ కుమార్ మంత్రివర్గంలో చాలామందికి క్రిమినల్ రికార్డున్నట్లు అసోషియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకటించింది. ఏడీఆర్ రిలీజ్ చేసిన నివేదిక ప్రకారం నితీష్ మంత్రివర్గంలో 32 మందున్నారు. ఎన్నికల సందర్భంగా వీరి దాఖలుచేసిన అఫిడవిట్లను పరిశీలించినపుడు 23 మందిపై క్రిమినల్ కేసులున్నట్లు బయటపడిందట. వీరిలో కూడా 17 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నట్లు అర్ధమవుతోంది.

హత్యలు, దొమ్మీలు, కిడ్నాపులు, బ్లాక్ మెయిలింగ్, మహిళలపై అత్యాచారాలు, అత్యాచారాలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటున్నట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పైగా ఒకరిద్దరు మంత్రులపై అరెస్ట్ వారెంట్లు కూడా జారీ అయున్నాయి. కోర్టులో లొంగి పోవాల్సిన ఒక ఎంఎల్ఏ అలా చేయకుండా పాట్నాలోని రాజ్ భవన్లో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఆయన మంత్రిగా ప్రమాణం చేసిన మరుసటి రోజే కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు జారీ చేయడం గమనార్హం.

కొత్తగా కొలువుదీరిన మంత్రివర్గంలో జేడీయూ నుండి 11 మంది, ఆర్జేడీ నుండి 16 మంది కాంగ్రెస్ నుండి ముగ్గురితో పాటు జీతన్ రామ్ మాంఝీ, ఒక ఇండిపెండెట్ ఎంఎల్ఏగా మంత్రలుగా బాద్యతలు తీసుకున్న విషయం తెలిసిందే.

రాజకీయాల్లో నేరగాళ్ళుండ కూడాదనే నినాదం చివరకు ఉత్త నినాదంగా మాత్రమే మిగిలిపోతోంది. ప్రతిపార్టీ కూడా వేదికల మీద మాట్లాడుతున్నపుడు నేరగాళ్ళకు రాజకీయాల్లో చోటుండకూడదని పదే పదే చెబుతుంది. అయితే ఎన్నికలు వచ్చేటప్పటికి మళ్ళీ క్రిమినల్ రికార్డున్న వాళ్ళకి కూడా టికెట్లిచ్చేస్తోంది.

రాజకీయనేతలన్నాక ఏదో ఆందోళనల్లో, నిరసనల్లో పాల్గొంటారన్నది అందరికీ తెలిసిందే. ప్రజా ఉపయోగార్ధం చేసే ఆందోళనలు, నిరసనల్లో నమోదయ్యే కేసులను క్రిమినల్ కేసులుగా పరిగణించాల్సిన అవసరం లేదు.

కానీ వీరిలో కొందరు భూకబ్జాలు, హత్యలు, కిడ్నాపులకు కూడా పాల్పడుతున్నారు. అయినా వాళ్ళకి పార్టీలు టికెట్లిస్తున్నాయి, జనాలు గెలిపిస్తున్నారు, ముఖ్యమంత్రి మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. ఇక రాజకీయాలనుండి నేరగాళ్ళని దూరంగా పెట్టడం సాధ్యమేనా ?