Begin typing your search above and press return to search.

ఇద్దరిదీ ఒకటే మాటా ?

By:  Tupaki Desk   |   1 Oct 2022 4:38 AM GMT
ఇద్దరిదీ ఒకటే మాటా ?
X
ఏ విషయంలో అయినా ఉప్పు-నిప్పుగా ఉండే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడు ఒక్క విషయంలో మాత్రం ఒకే విధంగా ఆలోచిస్తున్నారు. ఇద్దరూ తమ నేతలకు సంబందించి ఒకే స్లోగన్ వినిపిస్తున్నారు. ఇంతకీ అదేమిటంటే జనాల్లో ఉండండి, జనాలకు అందుబాటులో ఉండండి. ప్రజల్లో తిరగకపోతే, ప్రజల అభిమానం పొందకపోతే వచ్చే ఎన్నికల్లో టికెట్ల దక్కేది అనుమానమే అని. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నేతలతో చంద్రబాబు సమీక్ష జరిపారు.

ఈ సమీక్షలో మాజీమంత్రులు, మాజీ ఎంఎల్ఏలతో పాటు నేతలకు ఫుల్లుగా క్లాసుపీకారు. జిల్లాల విభజన తర్వాత నేతలు ఇంతవరకు ఒక్కసారి కూడా సమిష్టిగా మీటింగ్ ఎందుకు పెట్టుకోలేదని నిలదీశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమిష్టిగా కార్యక్రమాలు చేయకపోతే ఎలాగంటు ప్రశ్నించారు. సమస్యల పరిష్కారం విషయంలో జనాలకు అందుబాటులో లేకపోతే, జనాలకు మద్దతుగా లేకపోతే ఎలాగంటు మండిపడ్డారు.

ప్రజల తరపున ప్రభుత్వంపై అందరు కలిసి పోరాటాలు చేయకపోతే జనాల్లో మనపై నమ్మకం ఎలాగుంటుందని అందరినీ అడిగారు. గతంలో మంత్రులు, ఎంఎల్ఏలుగా పనిచేసిన వారు కూడా జనాల్లో ఎందుకు ఉండటంలేదంటు మందలించారు.

రాజధాని అమరావతిని తరలిస్తే జరగబోయే నష్టాన్ని నేతలంతా కలిసి జనాలకు వివరించాలని ఆదేశించారు. మంగళగిరి, గురజాల, వినుకొండ నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన జిల్లాలో సభ్యత్వ నమోదు సరిగా జరగటంలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు.

మొత్తంమీద ఈ ఒక్క విషయంలో మాత్రమే జగన్, చంద్రబాబు ఒకేమాట మీదున్నారు. మంత్రులు, ఎంఎల్ఏలందరినీ జనాల్లోనే ఉండాలని జగన్ కూడా పదే పదే చెబుతున్నారు. జనాల నమ్మకం, అభిమానం పొందకపోతే ఎన్నికల్లో గెలుపు కష్టమనే విషయాన్ని ఇద్దరు అధినేతలు తమ నేతలకు పదే పదే చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే అధినేతలు ఎన్ని సమీక్షలు నిర్వహిస్తున్నా కొందరి నేతల పనితీరు మాత్రం మారటంలేదు. అందుకనే తమ నేతలకు ఇద్దరు ఇన్నేసిసార్లు క్లాసులు పీకాల్సొస్తోంది. మరిప్పటికైనా మారుతారా ?

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.