Begin typing your search above and press return to search.

కేసీయార్ జగన్ ల మధ్య చిచ్చు పెడుతున్నారా...?

By:  Tupaki Desk   |   3 Sep 2022 3:30 PM GMT
కేసీయార్ జగన్ ల మధ్య చిచ్చు పెడుతున్నారా...?
X
ఉమ్మడి ఏపీ విభజన తరువాత తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు సీఎంలు ఉన్నా ఎవరి దారిలో వారు తమ రాష్ట్రాలలో పనిచేసుకుంటున్నారు. ఓటుకు నోటు వ్యవహారం తరువాత మిగిలిన కాలమంతా విజయవాడలోనే చంద్రబాబు ఉంటూ కేసీయార్ కి దూరం పాటించారు, ఒక విధంగా సహనంతో వ్యవహరించారు. జగన్ సీఎం అయ్యాక చూస్తే ఇద్దరు మిత్రుల కధగా కొన్నాళ్ళు అటూ ఇటూ సాగింది. అయితే ఆ తరువాత మాత్రం మాటలులేవు. అయితే బాహాటంగా ఒకరిని ఒకరు అనుకున్న సందర్భాలు అయితే పెద్దగా లేవు

కానీ తెలుగు రాష్ట్రాల మీద కన్నేసిన కేంద్రంలోని బీజేపీ మాత్రం ఒక విధంగా చూస్తే జగన్ కేసీయార్ ల మధ్య చిచ్చు పెట్టేలా చూస్తోందా అంటే జరుగుతున్న పరిణామాలు అవును అనే అంటున్నాయి. లేటెస్ట్ గా ఏపీకి బల్క్ డ్రగ్ పార్క్ మంజూరైంది. అయితే పోటీలో తెలంగాణా కూడా ఉంది. కానీ ఏపీకి కేంద్రం మంజూరు చేసింది.

దాంతో కేటీయార్ కేంద్రాన్ని విమర్శిస్తూనే ఏపీ మీద కూడా ఇండైరెక్ట్ గా తగిలేనా కొన్ని బాణాలు వేశారు. కేంద్రం వివక్ష చూపిస్తోందని, దేశంలోనే ఫార్మా హబ్ గా తెలంగాణా ఉంటే అక్కడ మంజూరు చేయకుండా మిగిలిన చోట్లకు ఇచ్చారని, దాని వల్ల మౌలిక సదుపాయాలే ఉండని చోట పార్కులు రెడీ కావాలంటే కచ్చితంగా మూడేళ్ల సమయం పడుతుంది అని అంటున్నారు. అంటే ఏపీలో మౌలిక సదుపాయాలు లేవని ఇండైరెక్ట్ గా ఆయన అంటున్నారన్న మాట.

ఏపీకి కేంద్రం ప్రేమతో బల్క్ డ్రగ్ పార్క్ ఇచ్చినా లేక తెలంగాణాను ఇబ్బంది పెట్టాలని ఇచ్చిందా అన్నది పక్కన పెడితే దీని వల్ల ఏపీ ఇపుడు టార్గెట్ అవుతోంది. నిజానికి ఏపీకి ఈ రోజుకీ రాజధాని లేదు, ప్రత్యేక హోదా లేదు, విభజన హామీల అమలు ఊసే లేదు. ఇవ్వక ఇవ్వక ఒక బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ మంజూరు చేస్తే తెలంగాణా పడి ఏడుస్తోంది అన్న భావన కల్పించేలా కేంద్రం వ్యవహరించిందా అన్న చర్చ కూడా ముందుకు వస్తోంది.

మరో వైపు చూస్తే ఈ మధ్యనే ఏపీకి తీర్చాల్సిన విద్యుత్ బకాయిలు అంటూ ఏకంగా ఆరు వేల కోట్ల పై చిలుకు మొత్తాన్ని నెల రోజుల వ్యవధిలోగా తీర్చాలని కేంద్రం తెలంగాణాకు హుకుం జారీ చేసింది. దాని మీద తెలంగాణా మంత్రులు మండిపడ్డారు. అదే టైం లో ఏపీ కూడా తెలంగాణాకు పన్నెండు వేల కోట్లు ఇవ్వాలని కూడా వారు లెక్కలేవో చెబుతున్నారు. వీటన్నింటినీ చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత లేకుండా గొడవ పడేలా చిచ్చు పెడుతున్నారా అన్న చర్చ వస్తోంది. ఇన్నాళ్ళూ ఊరుకుని ఇపుడు సరైన టైమ్ చూసుకుని విద్యుత్ బకాయిల విషయంలో కేంద్రం ముందుకు కదలడం మీద కూడా చర్చ సాగుతోంది

దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయని అంటున్న వారు ఉన్నారు. అదేలా అంటే దేశంలో బీజేపీ విముక్త రాజకీయం చేస్తామని కేసీయార్ ముందుకు కదులుతున్నారు. అదే టైమ్ లో ఆయనకు ఏపీ నుంచి పెద్దగా రాజకీయ సాయం లేకుండా చేయడానికే ఇలాంటి ఎత్తుగడలు ఉపయోగిస్తున్నారా అన్నదే చర్చగా ఉంది మరి. నిజానికి ఏపీకి కేంద్రం ఎంతో చేయాలి. కానీ పోటీలో ఉన్న వాటి విషయంలోనే ఒకటి ఏపీకి ఇచ్చి అంతా చేశామని చెప్పడం ద్వారా కేంద్ర పెద్దలు ఏం చెప్పదలచుకున్నారని కూడా అంటున్నారు. నిజానికి ఏపీకి మేలు చేయాలంటే ప్రత్యేక హోదా సహా అనేక హామీలను తీర్చాలని కూడా డిమాండ్ ఉంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.