Begin typing your search above and press return to search.

జీవితకాల అధ్యక్షుడిగా జగన్ నియామకంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం!

By:  Tupaki Desk   |   12 July 2022 5:30 AM GMT
జీవితకాల అధ్యక్షుడిగా జగన్ నియామకంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం!
X
వైసీపీ నరసాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ నాయకత్వాన్ని కావాలనే రెచ్చగొడుతున్నారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి అండ్ కో నుండి తన ప్రాణాలకు హాని ఉందని ఊరూ వాడా గోల చేస్తూనే మరోవైపు నాయకత్వాన్ని రెచ్చగొడుతున్నారు. వైసీపీకి జీవితకాల అధ్యక్షుడిగా జగన్ నియామకంపై ఎంపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎంపీ ఆగుంటే బాగానే ఉండేది. కానీ అలా ఆగితే ఆయన రఘురాజు ఎలాగవుతారు ?

కేంద్ర ఎన్నికల కమీషన్ దగ్గరకు వ్యక్తిగతంగా వెళ్ళి తన అభ్యంతరాలను రాతమూలకంగా ఫిర్యాదుచేశారు. జీవితకాల అద్యక్షుడి నియామక తీర్మానం అంటే 1951 ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని తమ పార్టీ ఉల్లంఘించిందని ఎంపీ తన ఫిర్యాదులో చెప్పారు. పార్టీ ఎంపీగా, క్రియాశీల సభ్యుడిగా తాను ఈ ఫిర్యాదుచేస్తున్నట్లు కూడా ఎంపీ లేఖలో స్పష్టంగా చెప్పారు. పార్టీ నియమావళి ప్రకారం అంతర్గత ఎన్నికల ద్వారా మాత్రమే నియమించాల్సిన అధ్యక్ష పదవిని తీర్మానం ద్వారా శాశ్వతం చేసుకునేందుకు లేదని తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.

నియమావళిని తమ పార్టీ ఉల్లంఘించింది కాబట్టి వెంటనే జోక్యం చేసుకోవాలని ఎన్నికల కమీషన్ను కోరారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే సాంకేతికంగా రఘురాజు వైసీపీ ఎంపీగా ఉంటున్నారంతే.

భౌతికంగా కానీ మానసికంగా కానీ పార్టీ నుంచి ఆయన ఎప్పుడో విడిపోయారు. ఈ విషయం ప్రపంచంతో పాటు ఆయనకు కూడా బాగా తెలుసు. పార్టీ నుంచి విడిపోయిన ఎంపీ విడిపోయినట్లు ఉండకుండా పార్టీని, ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తున్నారు.

దీంతో సహజంగానే అయనంటే ప్రభుత్వంలో అందరికీ బాగా మండుతోంది. ఎక్కడ దొరుకుతారా అని ప్రభుత్వం ఎంపీ గురించి వెయ్యికళ్ళతో వెతుకుతోంది. ఈ నేపథ్యంలో ఇంగితం ఉన్న వారెవరైనా సరే ప్రభుత్వం, పార్టీ గురించి పట్టించుకోకుండా దూరంగా ఉంటారు. జగన్ సీఎంగా ఉన్నంతకాలం ఎంపీ ఏమీ చేయలేరన్నది వాస్తవం.

ఈ విషయం తెలిసి కూడా జగన్ను కెలుకుతున్నారంటే కావాలనే రెచ్చగొడుతున్నట్లు అర్ధమైపోతోంది. పార్టీ నియమవాళిని ఉల్లంఘిస్తే ఆ విషయం ఎన్నికల కమీషన్ చూసుకుంటుంది. మధ్యలో ఎంపీకి అవసరం లేకపోయినా ఫిర్యాదు చేశారంటేనే కావాలనే పార్టీని కవ్విస్తున్నట్లు తెలిసిపోతోంది.